లెక్కలు అనగానే చాలామందికి బాల్యం నుంచే భయం ఏర్పడుతుంది. అంకెలను చూసే సరికి కొంతమందిలో వణుకు పుడుతుంది. అయితే గణితం సాయంతో పలు విషయాల్లో విజయం సాధించవచ్చని తెలిస్తే వారిలోని భయం తొలగిపోతుంది. రొమేనియాకు చెందిన ఒక గణిత మేధావి లెక్కలతో లాటరీలలోని లాజిక్కును పట్టేసి, ఏకంగా 14 సార్లు లాటరీ గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.
డైలీ స్టార్ వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం రొమేనియా నివాసి స్టెఫాన్ మాండెల్ గణిత శాస్త్రజ్ఞుడు. అతని జీతం భారత కరెన్సీతో పోలిస్తే ఏడు వేలు. అది అతని కనీస అవసరాలకు కూడా సరిపోయేది కాదు. దీంతో స్టెఫాన్ మాండెల్ తన జీవితాన్ని తక్షణం మార్చుకోవాలని, గణితాన్ని తెలివిగా ఉపయోగించి డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. అంకెలను ఉపయోగించి ఒక సూత్రాన్ని సిద్ధం చేశాడు. దాని సాయంతో లాటరీలను గెలుచుకుంటూ వచ్చాడు.
స్టెఫాన్ స్వయంగా ప్రత్యేక అల్గారిథమ్‌ను సృష్టించాడు. పలు పరిశోధనలు సాగించిన అనంతరం ‘సంఖ్యల ఎంపిక’కు అల్గారిథమ్‌ను సిద్ధం చేశాడు. దానికి ‘కాంబినేటోరియల్ కండెన్సేషన్’ అనే పేరు పెట్టాడు. తాను ఎన్ని లాటరీ టిక్కెట్లు కొన్నప్పటికీ, వాటికి అయ్యే ఖర్చు జాక్‌పాట్ కన్నా చాలా తక్కువగా ఉంటుందని స్టెఫాన్ కనుగొన్నాడు. దీంతో లాటరీని దక్కించుకునేందుకు అధికంగా లాటరీ టిక్కెట్లు కొని జాక్‌పాట్ గెలిచేందుకు వివిధ కాంబినేషన్‌లను సిద్ధం చేసేవారు. ఇది క్లిక్ అవడంతో స్టెఫాన్ లాటరీలను సొంతం చేసుకుంటూ వచ్చాడు.
తరువాత స్టెఫాన్ లాటరీ సిండికేట్‌ను ఏర్పాటు చేశాడు. దీనిలో చేరినవారు స్టెఫాన్ సూచనలతో లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తుంటారు. ఇలా వారు గెలుపు అవకాశాలను పెంచుకుంటారు. ఈ సిండికేట్‌కు లాటరీలో వచ్చే భారీ మొత్తాన్ని సభ్యులంతా పంచుకునేవారు. ఈ విధంగా సంపాదించిన డబ్బుతో స్టెఫాన్ ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు.
స్టెఫాన్ మాండెల్ తాను కనుగొన్న లెక్కల సూత్రం ఆధారంగా మొత్తం 14 సార్లు లాటరీని గెలుచుకున్నాడు. తరువాతి కాలంలో యూకేలోనూ తన లాటరీ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అయితే అతని సిండికేట్‌పై దర్యాప్తు సంస్థల కన్నుపడింది. దీంతో పెద్దమొత్తంలో టిక్కెట్లు కొనడంపై నిషేధం విధించారు. దీంతకితోడు స్టెఫాన్‌పై పలు కేసులు నమోదు కావడంతో న్యాయపోరాటం కోసం లెక్కకు మించినంత డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో తాను కూడబెట్టిన సొమ్మునంతా పోగొట్టుకుని 1995లో తాను దివాలా తీసినట్లు స్టెఫాన్ ప్రకటించుకున్నాడు. ప్రస్తుతం స్టెఫాన్ తన స్నేహితులతో పాటు వనాటు ద్వీపంలో నివసిస్తున్నాడు. యూనిలాడ్ నివేదిక ప్రకారం స్టెఫాన్ 1960-70ల కాలంలోనే లాటరీలలో రూ. 200 కోట్లకుపైగా మొత్తాన్ని గెలుచుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment