టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో అద్భుతాలు కళ్ళముందు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎద్దుల బండితో మొదలైన మనిషి ప్రయాణం.. నేడు విమానంలో ప్రయాణించే స్థాయికి చేరింది. ఇది సరే అనుకునే లోపల.. అసలు మనిషే అవసరం లేకుండా కారు డ్రైవ్ చేస్తున్న సంఘటనలు నేడు ప్రత్యక్షమవుతున్నాయి. ఇందులో భాగంగానే జపాన్ పరిశోధకులు ముసాషి అనే హ్యూమనాయిడ్ రోబోట్ సృష్టించారు.
ముసాషి రోబోట్ ఎలక్ట్రిక్ మైక్రో-కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేయడానికి సంబంధించిన ఒక వీడియో కూడా జేఎస్‌కే టెండన్ గ్రూప్ తమ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. వీడియోలో గమనించినట్లయితే.. రోబోట్ రోడ్డుపై పరిసరాలను గమనిస్తూ డ్రైవ్ చేయడం చూడవచ్చు.
రోబోట్ డ్రైవింగ్ చేసే మైక్రో కారులో కూడా విజన్ కెమెరాలు, జీపీఎస్, కాంప్లెక్స్ అల్గారిథమ్‌లు అండ్ కంట్రోల్ సిస్టం అనే టెక్నాలజీలు ఇన్‌స్టాల్ చేశారు. ఇవన్నీ రోడ్డు మీద సురక్షితంగా డ్రైవ్ చేయడానికి ఉపయోగపడతాయి. డ్రైవర్‌గా మనిషి అవసరం లేకుండా కారును డ్రైవ్ చేసే టెక్నాలజీని కనిపెట్టడంలో భాగంగానే ముసాషిని రూపొందించారు.
ముసాషి అనేది "మస్క్యులోస్కెలెటల్ హ్యూమనాయిడ్". దీనిని 2019లో పరిశోధనా బృందం తయారు చేసింది. ఇది మనిషిలాంటి ప్రతి రూపం పొందటమే కాకుండా.. ఇది మానవ శరీరం మాదిరిగా ఉండే కండర నిర్మాణాన్ని కలిగి ఉంది. దీనిని పరిశోధకులు ఇప్పటికే పలు విధాలుగా టెస్ట్ చేశారు.
ముసాషి కన్ను హై రిజల్యూషన్ కెమరా మాదిరిగా పనిచేస్తుంది. కాబట్టి దూరంగా ఉన్న వస్తువులను, మనుషులను ఇది సులభంగా గుర్తిస్తుంది. నేరుగా ఉన్న వాటిని మాత్రమే కాకుండా సైడ్ మిర్రర్ ద్వారా వెనుక వున్నవారిని కూడా చూడగలదు. ఇది హ్యాండ్ బ్రేక్ లాగడం, స్టీరింగ్ తిప్పడం, బ్రేక్, యాక్సిలరేటర్ పెడల్స్ వంటి వాటిని ఆఫర్స్ చేయడం కూడా చేస్తుంది. ఇవన్నీ వీడియోలో స్పష్టంగా కనిపిస్తాయి.
ఇక్కడ కనిపించే కారును టయోటా కంపెనీ 2012లో తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ కారు పేరు 'ఛోట్టో ఒడెకేకే మచిమేడ్ సూయిసుయ్' (COMS). ఇది సింగిల్ సీట్ ఎలక్ట్రిక్ కారు. ఈ కారును రోబోట్ డ్రైవ్ చేయడానికి అనుకూలంగా రూపొందించారు. టెస్ట్ డ్రైవ్ మాత్రం టోక్యో యూనివర్సిటీలోని కాశివా క్యాంపస్‌లో నిర్వహించినట్లు తెలుస్తోంది.
టెస్టింగ్ సమయంలో ముసాషి మనిషిని గుర్తించడం, కారు రావడాన్ని గమనించడం, ట్రాఫిక్ లైట్‌లకు రెస్పాండ్ అవ్వడం వంటివి చూడవచ్చు. అన్ని టెస్టులలోనూ రోబోట్ ఉత్తమ పెర్ఫామెన్స్ చూపించినప్పటికీ.. హ్యుమానాయిడ్ ఆటోమాటిక్ డ్రైవింగ్ అనేది ప్రారంభ దశలోనే ఉంది. కాబట్టి ముసాషిను మరింత వేగంగా ఉండేలా రూపొందించాల్సిన చేయాల్సిన అవసరం ఉంది.
హ్యూమనాయిడ్ రోబోట్స్ డ్రైవింగ్ వల్ల ఉపయోగాలు
రోడ్డు ప్రమాదాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదానికి కారణాలు మితిమీరిన వేగం కావొచ్చు, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం కావొచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కావొచ్చు. అయితే ఒక రోబోట్ డ్రైవర్ అవ్వడం వల్ల అది తప్పకుండా రూల్స్ ఫాలో అవుతుంది. ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా తక్కువ కూడా. ఇలాంటి రోబోలు ఎప్పుడు వినియోగంలోకి వస్తాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment