ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్‌ బెల్‌’  | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్‌ బెల్‌’ 

Published Tue, Apr 9 2024 4:46 AM

Water Bell to continue even after reopening of schools ap education principal secretary - Sakshi

రోజూ మూడుసార్లు విద్యార్థులకు శుద్ధమైన తాగునీరు

అధిక ఎండ, వడదెబ్బ, డీహైడ్రేషన్‌ నుంచి రక్షణకు చర్యలు  

జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్న పాఠశాల విద్యాశాఖ 

ఈ మేరకు 45 వేల ప్రభుత్వ స్కూళ్లలో ప్రత్యేక ప్రణాళిక 

పాఠశాలల పునఃప్రారంభం తర్వాత కూడా వాటర్‌ బెల్‌ అమలు 

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా, వడదెబ్బ బారిన పడకుండా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం వేసవి తీవ్రతతో ఎండలు పెరుగుతుండటంతో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్‌ బెల్‌’ విధానం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రోజూ ప్రత్యేకంగా మూడుసార్లు వాటర్‌ బెల్‌ మోగించి.. విద్యార్థులంతా తప్పనిసరిగా మంచినీరు తాగేలా చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఈనెల 23తో ముగియనుంది.

అప్పటివరకు ‘వాటర్‌ బెల్‌’ కొనసాగించడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్‌ 12 నుంచి కూడా ఇదే విధానాన్ని విద్యాశాఖ కొనసాగించనుంది. డీహైడ్రేషన్‌పై విద్యార్థుల్లో అవగాహన పెంపునకు ప్రత్యేక పోస్టర్లను సైతం పాఠశాలల్లో ఏర్పాటు చేయనుంది. విద్యాశాఖ ఆదేశాలతో ఏప్రిల్‌ 1 నుంచే విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.   

ఎదిగే పిల్లల్లో నీటిలోపం లేకుండా చేసేందుకే.. 
శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఇదొక్కటే కాకుండా పలు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎదిగే పిల్లల్లో నీటి లోపం లేకుండా చూసేందుకు వాటర్‌ బెల్‌ విధానం ఉపయోగపడుతుంది. ప్రధానంగా మూత్రం ఏ రంగూ లేకుండా పారదర్శకంగా ఉంటే శరీరంలో తగినంత నీరు ఉందని, సరిపడినంత నీరు తాగుతున్నారని అర్థం.

మూత్రం లేత గోధుమ రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉన్నారని భావించవచ్చు. లేత పసుపు రంగులో ఉంటే సాధారణ స్థితి అని, ఆరోగ్యంగా ఉన్నట్లు సంకేతం. ముదురు పసుపు రంగులో మూత్రం ఉంటే నీరు తక్కువగా తాగుతున్నారని, మరికొంత నీరు శరీరానికి అవసరమని అర్థం. తేనె రంగులో ఉంటే శరీరానికి తగినంత నీరు అందడం లేదని సంకేతం. ముదురు గోధుమ రంగులో మూత్రం ఉంటే వెంటనే ఎక్కువ నీరు తాగాలని అర్థం. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలల వద్ద పోస్టర్లు అంటిస్తారు.  

రోజూ మూడుసార్లు వాటర్‌ బెల్‌ 
రాష్ట్రంలో 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో రోజూ ఉదయం 9.45, 10.05, 11.50 గంటలకు మొత్తం మూడుసార్లు వాటర్‌ బెల్‌ మోగిస్తున్నారు. బెల్లు మోగిన వెంటనే ప్రతి విద్యార్థి మంచినీరు తాగాల్సిందే. పాఠశాలల పునఃప్రారంభం తర్వాత కూడా వాటర్‌ బెల్‌ విధానాన్ని కొనసాగించాలని జిల్లా విద్యాధికారులను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆదేశించారు. రోజూ వాటర్‌ బెల్‌ నిర్వహణను పర్యవేక్షించాలని డీఈవోలకు సూచించారు. అంతేకాకుండా మూ­త్రం రంగు­ను బట్టి తమ శరీరంలో నీటి లోపా­న్ని విద్యార్థులు తెలుసుకునేలా మూ­త్రశాలల వద్ద పోస్టర్లు అంటించాలని ఆదేశించారు. దీనిద్వారా నీరు తాగే అలవాటును విద్యార్థుల్లో పెంపొందించవచ్చన్నారు.

Advertisement
Advertisement