మానవ మెదడుతో ఏదీ సరితూగదు.. ఏఐని తలదన్నే ఉద్యోగాలివే.. | Sakshi
Sakshi News home page

మానవ మెదడుతో ఏదీ సరితూగదు.. ఏఐని తలదన్నే ఉద్యోగాలివే..

Published Thu, Mar 14 2024 12:15 PM

AI Threaten To Jobs Industry Trending AI jobs In Future - Sakshi

సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం కారణంగా కొన్ని రకాల ఉద్యోగాలను కోల్పోవలసి రావచ్చని సర్వేలు చెబుతున్నాయి. 2030 నాటికి 40-80 కోట్ల ఉద్యోగాలకు ముప్పు కనిపిస్తోందని పలు సర్వేల ద్వారా తెలుస్తుంది. దాదాపు 35 కోట్ల మంది కొత్త ఉద్యోగాల్లోకి మారాల్సి రావచ్చని అంచనా. సంప్రదాయ ఉద్యోగాల్లోనే కొనసాగుదామనుకొన్నా సాధ్యం కాదు. అటువంటి పనులన్నీ కంప్యూటర్లు, వాటికి అనుసంధానమయ్యే యంత్రాలు పూర్తిచేస్తాయి. అయితే, యంత్రాలను నియంత్రించడం, వాటికి పనుల్ని నిర్దేశించడం, స్టాఫ్ట్‌వేర్లు అయితే ఏఐకి సూచనలు ఇవ్వడం వంటివి మనుషులే చేయాలి. ఇలాంటి కొత్త తరహా విధులకు సంబంధించి సరికొత్త ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో లభిస్తాయి. కోల్పోయిన ఉద్యోగాలకంటే పెద్దసంఖ్యలో లభ్యమవుతాయి.

కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు పోతాయని 1990 దశకంలో అందరూ భయపడిపోయారు. తదనంతర కాలంలో కోల్పోయిన ఉద్యోగాలకంటే అధికంగా కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. కాకపోతే, నూతన సాంకేతిక మార్పులకు అనుగుణంగా శక్తిసామర్థ్యాలను, నైపుణ్యాలను నేర్చుకోవాల్సి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పటికే ఉన్న ఉద్యోగాలపై ప్రభావం చూపుతూ కొత్త అవకాశాలకు దారితీస్తోంది. అందులో ప్రధానంగా రానున్న రోజుల్లో ఈ కింది ఉద్యోగాలకు గిరాకీ ఏర్పడనుందని నిపుణులు భావిస్తున్నారు. 

ప్రాంప్ట్ ఇంజినీర్

స్థూలంగా చెప్పాలంటే.. ప్రాంప్ట్‌ ఇంజినీరింగ్‌ అనేది ఏఐ నుంచి అత్యంత కచ్చితమైన, అవసరమైన సమాచారం తెలుసుకునేందుకు అడగాల్సిన ప్రశ్నలు ఏంటో గుర్తించడం. దీనికి స్థిరమైన భాషాజ్ఞానం అవసరం. ఇదేమంత సులభమైన పని కాదు. ఏ లాంగ్వేజ్‌ ఇన్‌పుట్‌కు ఏఐ ఎలా ప్రతిస్పందిస్తుందో తెలుసుకునేందుకు ఈ ఇంజినీర్లు భాష లోతుల్లోకి వెళ్లి పరిశోధన చేస్తారు. వివిధ రకాలైన ప్రాంప్ట్‌కు ఎలా స్పందించాలనే విషయమై ఏఐకు శిక్షణ కూడా ఇస్తారు. ఈ ఉద్యోగాన్ని ప్రోగ్రామింగ్, ఇన్‌స్ట్రక్టింగ్, టీచింగ్‌ల సమ్మేళనంగా చెప్పవచ్చు. ఇందుకోసం వీరు నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ (ఎన్‌ఎల్‌పీ), నేచురల్‌ లాంగ్వేజ్‌ అండర్‌స్టాండింగ్‌ (ఎన్‌ఎల్‌యూ) అనే టెక్నాలజీలను వినియోగిస్తారు. ప్రాంప్ట్‌ ఇంజినీర్లు అనలిటిక్స్‌ను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 

ఏఐ ట్రెయినర్‌

జనరేటివ్‌ ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఏఐ ట్రెయినర్‌లకు గిరాకీ ఏర్పడుతోంది. యూజర్ల అవసరాలు ఏంటో కచ్చితంగా తెలుసుకుని అందుకు తగ్గట్లు ఏఐకి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. యూజర్లు ఏఐను వినియోగిస్తున్నపుడు ఎలాంటి ప్రతిస్పందనలు వస్తున్నాయో తెలుసుకుని అందుకు తగ్గుట్లు కోడ్‌రాసి దాని సామర్థ్యం పెంచేలా కృషి చేస్తారు. కస్టమర్ సర్వీస్, ఏఐ డెవలప్‌మెంట్, క్వాలిటీ అస్యూరెన్స్ టీమ్‌ల్లో వీరికి ప్రాధాన్యం ఇస్తారు. 

ఏఐ ఆడిటర్

ఏఐ అప్లికేషన్‌ల పెరుగుదలతో ఖచ్చితత్వాన్ని నిర్ధారించడం చాలా కీలకంగా మారింది. ఏఐ ఆడిటర్లు అవుట్‌పుట్‌ను ఆసక్తికరంగా, ఉపయోగకరంగా మార్చేలా చూస్తారు. అయితే ఇందుకోసం కొన్ని చట్ట పరమైన వ్యవహారాలపై అవగాహన ఉండాలి. 

ఏఐ ఎథిక్స్ ఎక్స్‌పర్ట్

ఏఐ పరిధి పెరుగుతున్నపుడు నైతిక సమస్యలు రావొచ్చు. వాటిని పరిష్కరించడం చాలా ముఖ్యం. ఏఐకి కొన్ని విలువలు జోడించేలా ఎథిక్స్‌ ఎక్స్‌పర్ట్‌ పనిచేయాల్సి ఉంటుంది. ఏఐకి నైతిక మార్గదర్శకాలు ఇవ్వడం, గోప్యత, పారదర్శకత, జవాబుదారీతనంతో ఉండేలా కోడ్‌ చేస్తారు. 

పైన తెలిపిన కొన్ని విభాగాల్లోని ఉద్యోగాలకుతోడు మానవ మెదడు చేసేచాలా పనులను ఏఐ ఎప్పటికీ చేయలేదు. ఒకవేళ చేసినా అంత కచ్చితత్వంతో చేయలేదని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటి వివరాలు కొన్నింటిని కింద తెలుసుకుందాం.

సృజనాత్మకత

అత్యంత తెలివైన కంప్యూటర్‌ కూడా మైమరపించే చిత్రాలను గీయలేకపోవచ్చు, వీనులవిందైన సంగీతాన్ని సృష్టించలేకపోవచ్చు! కారణం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మనుషుల్లా కొత్త ఆలోచనలు సృష్టించలేదు, తన పరిధి మేరకే ప్రవర్తిస్తుంది. ఊహకు అందని సృజనాత్మకతతో కొత్త అడుగులు వేయడం కేవలం మనుషులకే సాధ్యం. ఇది విద్య, వినోద, వ్యాపార రంగాల్లో ఎక్కడైనా ఏ రూపంలోనైనా అభ్యర్థులను ప్రత్యేకంగా నిలబెట్టగలదు. అందుకే సృజనాత్మకతతో కూడిన రంగాలను ఏఐ ఏమీ చేయలేకపోవచ్చు. సృజనలో ఊహాశక్తి, సందర్భానికి తగిన విధంగా స్పందించడం, పరిస్థితిని చూసి స్ఫూర్తి పొందడం భాగం.. ఇవన్నీ మనుషులు చేసినట్టుగా సాఫ్ట్‌వేర్లు చేయలేవు. 

ఇటువంటి స్కిల్స్‌ అవసరమైన ప్రతి చోటా అభ్యర్థుల అవసరం కచ్చితంగా ఉంటుంది. దీన్ని అలవరుచుకోవడం, ప్రతిదీ కొత్తగా ఆలోచించడానికి, చేయడానికి ప్రయత్నించడం ద్వారా ఏఐతో పోటీలో నెగ్గుకురావొచ్చు.

నిర్ణయాత్మకశక్తి

ఒక రోబోను ఏదైనా క్లిష్ట పరిస్థితిలో ఉంచి, నిర్ణయం తీసుకోమంటే అది ఏం చేయగలుగుతుంది? ఎటువంటి కెరియర్‌ అయినా సరే నిర్ణయాలు తీసుకునే శక్తి అవసరమయ్యే పోస్టుల్లో మనుషులే ఉండగలరు. సమస్యలను పరిష్కరించడం, సంప్రదింపులు చేసే నేర్పు తదితర నైపుణ్యాలు ఇలాంటి చోట్ల అవసరం అవుతాయి. ‘సిచ్యువేషన్‌ జడ్జిమెంట్‌, డెసిషన్‌ మేకింగ్‌’ అభ్యర్థులకు ఉండాల్సిన స్కిల్స్‌లో ముఖ్యమైనవి.

ఇదీ చదవండి: 2జీ, 3జీ, 4జీ, 5జీ.. తరాల్లో మతలబు

ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ 

ఏఐ తెలివైనదే.. కానీ ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ (ఈఐ) దానికి సులభం కాదు, కేవలం మనుషులకే సాధ్యం. ఎదుటివారి ఆలోచనలను, భావోద్వేగాలను, మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవడం.. అందుకు తగిన విధంగా ప్రవర్తించడం.. అవసరాన్ని బట్టి ఆదరణ, అభిమానం చూపడం.. ఇవన్నీ దానికి రావు. నిజానికి స్థాయీ భేదం లేకుండా ఏ ఉద్యోగాలకైనా ఇది ఎంతో కొంత అవసరం అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా బృందాల్లో పనిచేసినప్పుడు, లేదా వాటిని నడిపిస్తున్నప్పుడు ఈఐ తప్పక ఉండాలి. అందుకే దీన్ని పెంచుకునేందుకు అభ్యర్థులు దృష్టి పెట్టాలి. వీటితోపాటు డిజిటల్‌ లిటరసీ, డేటా లిటరసీ, డిజిటల్‌ థ్రెట్‌ అవేర్‌నెస్‌, క్రిటికల్‌ థింకింగ్‌.. వంటి నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలి.

Advertisement
 
Advertisement
 
Advertisement