విధాన నిర్ణయాల్లో డేటాదే కీలక పాత్ర | Sakshi
Sakshi News home page

విధాన నిర్ణయాల్లో డేటాదే కీలక పాత్ర

Published Thu, Jun 30 2022 6:21 AM

Data interpretation key to informed decisions says RBI Governor Shaktikanta Das - Sakshi

ముంబై: విధాన నిర్ణయాల పటిష్టతలో గణాంకాల (డేటా) పాత్ర చాలా కీలకమని రిజర్వ్‌ బ్యాంక్‌  గవర్నర్‌ శక్తికాంతదాస్‌ స్పష్టం చేశారు. తగిన సమాచారంతో విధాన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయని సూచించారు. ఇందుకు స్పష్టమైన, పారదర్శకమైన డేటా అందుబాటులో ఉండడం అవసరమని అన్నారు. తద్వారా నిర్ణయాధికారుల నుండి తగిన నిర్ణయాలు వెలువడతాయని, మార్కెట్‌ భాగస్వాములు హేతుబద్ధమైన అంచనాలకు రాగలుగుతారని అన్నారు. సెంట్రల్‌ బ్యాంక్‌ వార్షిక ‘స్టాటిస్టిక్స్‌ డే’ సదస్సులో ఈ మేరకు గవర్నర్‌ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..

► పబ్లిక్‌ పాలసీలో గణాంకాల ప్రాముఖ్యత ఎంతో ఉంది. కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా ఏర్పడిన తీవ్ర అనిశ్చితి నేపథ్యంలో పారదర్శక, పటిష్ట గణాంకాల పాత్ర మరింత పెరిగింది.  

► మునుపెన్నడూలేని విధంగా ఏర్పడిన ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు మానవాళి లక్ష్యాలు, దృక్పధాన్ని పరిశోధిస్తోంది. భారత్‌సహా వివిధ దేశాలలో విధించిన లాక్‌డౌన్‌లు... మహమ్మారి వ్యాప్తి, ఆర్థిక వ్యవస్థలపై దాని ప్రభావాలకు సంబంధించిన డేటా  లభ్యత విషయంలో  క్లిష్టమైన స్థితిని సృష్టించింది. మునుపెన్నడూ చూడని ఈ సమస్యకు అత్యవసరంగా పరిష్కారాలు కనుగొనడం అవసరం.  

► డేటా లభ్యత విషయంలో  2020లో మహమ్మారి మొదటి వేవ్‌ సమయంలో దేశంలో అనేక వస్తువుల ధరల సేకరణలో అపారమైన ఇబ్బందులు నెలకొన్నాయి. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంది.  

► అయితే ఈ పరిస్థితి డేటా సేకరణలో నూతన సాంకేతిక విధానాలను అవలంభించే అవకాశాలనూ మహమ్మారి సృష్టించింది. ఈ నూతన విధానాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను  కలిగి ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే కొత్త డేటా వనరులు అధికారిక గణాంకాల కోసం తాజా అవకాశాలను సృష్టిస్తుండగా, ఇది ఈ విషయంలో డేటా విశ్వసనీయత, క్రమశిక్షణకు సంబంధించిన సమస్యలను కూడా లేవనెత్తుతుండడం మరో ప్రతికూలాంశం. ఈ సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించాల్సి ఉంటుంది.  

► సరైన డేటా నాణ్యతకు తగిన ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం,  డేటా గోప్యత,  భద్రతకు  అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని 2022 ఏప్రిల్‌లో జరిగిన ‘ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ అఫీషియల్‌ స్టాటిస్టిక్స్‌ కాన్ఫరెన్స్‌’ ఉద్ఘాటించింది.  

► విధాన నిర్ణయాలు తీసుకోవడంలో, వాటి ఫలితాలను అంచనా, మదింపు వేయడంలో సెంట్రల్‌ బ్యాంకులకు గణాంకాలు ఎంతో కీలకం. ఇక్కడ గణాంకాలు సేకరించడం, వాటిని వినియోగించుకోవడం రెండు బాధ్యతలూ సెంట్రల్‌ బ్యాంకులకు సంబంధించినవే. మహమ్మారి వంటి కల్లోల సమయాల్లో సెంట్రల్‌ బ్యాంకులు  తమ విధానాలు, చర్యల మదింపునకు సంబంధించిన డేటా సమీకరణలో పటిష్టమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది.  ఆయా అంశాలకు సంబంధించి ఎదురయిన సవాళ్లనూ సెంట్రల్‌ బ్యాంకులు మహమ్మారి సమయాల్లో పరిష్కరించుకోవాల్సి వచ్చింది. మహమ్మారి సమయంలో ప్రత్యామ్నాయ సూచీలు, డేటా సమీకరణ వనరులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది.


భారత్‌లో అంతర్జాతీయ ప్రమాణాలు
ఆర్‌బీఐ విషయానికి వస్తే, పటిష్ట గణాంకాల సేకరణ, వినియోగ వ్యవస్థలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. డేటా ప్రవాహాన్ని క్రమబద్ధీకరించడంలో ఆర్‌బీఐ ప్రయత్నాలు, సాంకేతికతపై పెట్టుబడులు, నియంత్రిత సంస్థలతో నిరంతర సంప్రతింపులు మంచి ఫలితాలను అందించాయి. డేటా సర్వే, సేకరణ రీతుల్లో కొంత మార్పుతో పాటు, ఆయా అంశాల్లో మరింత స్థిరత్వం నెలకొల్పడానికి చర్యలు తీసుకోవడం జరిగింది.

డేటా నాణ్యతను నిర్ధారించడానికి పునఃపరిశీలన విధానాలను అవలంభించడం జరుగుతోంది. డేటా సేకరణ, ధ్రువీకరణ, నిర్ణయాల్లో వాటి అనుసంధానం వంటి అంశాల్లో వినూత్న విధానాలకు శ్రీకారం చుట్టాం. ఆయా అంశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలను సెంట్రల్‌ బ్యాంక్‌ అనుసరిస్తోంది. అంతర్జాతీయంగా మరిన్ని సూచీలు, ఉప సూచీలు, ఇతర గణాంకాలు కూడా ప్రస్తుతం తెరపైకి వచ్చాయి. దేశాలు ఉన్నత జీవన ప్రమాణాలను సాధించడానికి ఆయా సూచీలో ప్రయత్నిస్తున్నాయి.  బహుళ కోణాలలో దేశాల పురోగతిని పర్యవేక్షించడానికి ప్రయత్నిస్తున్నాయి.

మానవాభివృద్ధి సూచికలు, హ్యాపీ ఇండెక్స్‌లు, అసమానత సూచికల వంటివి వాటిని ఈ సందర్భంలో ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఆయా సూచీలను ప్రస్తుతం వివిధ జాతీయ– అంతర్జాతీయ సంస్థలు నిర్వహిస్తున్నాయి. వైశాల్యం, భౌగోళిక వైవిధ్యం దృష్ట్యా భారతదేశానికి ప్రాంతీయ అంశాలను సూచించే జాతీయ సూచికల అవసరం ఉంది.  రిజర్వ్‌ బ్యాంక్‌లో మేము సమాచారాన్ని ’ప్రజా ప్రయోజనకరమైన అంశం’గా పరిగణిస్తాము. వివిధ వాటాదారుల అవసరాలు, అంచనాలకు అనుగుణంగా మన సమాచార నిర్వహణ వ్యవస్థలను క్రమబద్ధం చేయాలని  భావిస్తున్నాము. ఆర్‌బీఐ మరింతగా ప్రత్యామ్నాయ డేటా వనరులపై దృష్టి సారించాలి. ఇప్పటికే ఉన్న డేటా విశ్లేషణాత్మక ఫ్రేమ్‌వర్క్‌ విధానాలతో  వాటిని అనుసంధించడానికి ప్రయత్నం జరగాలి.

Advertisement
 
Advertisement
 
Advertisement