లెనోవో ఆఫీసుల్లో ఐటీ సోదాలు.. ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లూ తనిఖీ | Sakshi
Sakshi News home page

లెనోవో ఆఫీసుల్లో ఐటీ సోదాలు.. ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లూ తనిఖీ

Published Thu, Sep 28 2023 4:41 PM

Income Tax searches at Lenovo premises - Sakshi

భారత ఆదాయపు పన్ను శాఖ అధికారులు చైనాకు చెందిన పర్సనల్‌ కంప్యూటర్ల తయారీ కంపెనీ లెనోవో (Lenovo) ఫ్యాక్టరీ, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని లెనోవా ఫ్యాక్టరీ, బెంగళూరులోని ఆఫీసులోనూ ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ ప్రచురించింది. 

సోదాల్లో భాగంగా ఐటీ శాఖ అధికారులు లెనోవో ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లను సైతం తనిఖీ చేసినట్లు తెలిసింది. సోదాల సమయంలోనూ, ముగిసిన తరువాత అధికారులు లెనోవా సీనియర్ మేనేజ్‌మెంట్‌ను సంప్రదించడానికి ప్రయత్నించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. 

(అమెరికా నుంచి ఐఫోన్‌ తెప్పించుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి..)

అంతకుముందు రోజు, తమిళనాడు రాష్ట్రంలోని లెనోవో కాంట్రాక్ట్ తయారీదారు ఫ్లెక్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీలలోనూ ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారని రాయిటర్స్ నివేదించింది. కంపెనీ, దాని అనుబంధ సంస్థలపై పన్ను ఎగవేత విచారణలో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది.

కాగా దీనిపై లెనోవా స్పందిస్తూ ఐటీ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు పేర్కొంది. “బాధ్యతగల కార్పొరేట్ పౌరులుగా మేము వ్యాపారం చేసే ప్రతి అధికార పరిధిలో వర్తించే అన్ని చట్టాలు, నిబంధనలు, రిపోర్టింగ్ అవసరాలకు కచ్చితంగా కట్టుబడి ఉంటాం. అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నాం. వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తాం” అని లెనోవా ప్రతినిధి తెలిపారు.

లెనోవో కంపెనీ భారత దేశంలో 17 శాతం మార్కెట్ వాటాతో 2022-23లో  1.9 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించింది.

Advertisement
Advertisement