‘వరంగల్–ఖమ్మం– నల్లగొండ’ గ్రాడ్యుయేట్ల స్థానం నుంచి బరిలోకి పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో జరుగుతున్న ఉప ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి ‘వరంగల్– ఖమ్మం–నల్లగొండ’ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికకు బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి పేరును పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఖరారు చేశారు. సుమారు అరడజను మంది బీఆర్‌ఎస్ అభ్యర్థిత్వాన్ని ఆశించినా రాకేశ్‌రెడ్డికి అవకాశం దక్కింది.
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌కు చెందిన రాకేశ్‌రెడ్డి.. బెంగళూరు, అమెరికాలలో వివిధ కార్పోరేట్ సంస్థల్లో పనిచేశారు. 2013లో బీజేపీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టారు. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా, బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. కానీ కుదరకపోవడంతో బీఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా అవకాశం దక్కింది.
పల్లా రాజీనామాతో ఉప ఎన్నిక
శాసన మండలి ‘వరంగల్–ఖమ్మం–నల్లగొండ’ పట్టభద్రుల స్థానానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలిచారు. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీఆర్‌ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. దీనికి ఈ నెల 9వ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. బీఆర్‌ఎస్ నేతలు ఓ.నర్సింహారెడ్డి, డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, పల్లె రవికుమార్, సుందర్ రాజు తదితరులు ఎమ్మెల్సీ టికెట్ ఆశించినా.. రాకేశ్‌రెడ్డికి దక్కింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలో 4.61 లక్షల మంది పట్టభద్రులు ఈ ఎన్నికలో ఓటేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment