గడువు ముగుస్తోంది.. పాన్‌-ఆధార్‌ లింక్‌ చేశారా? | Sakshi
Sakshi News home page

PAN-Aadhaar Linking Deadline: గడువు ముగుస్తోంది.. లింక్‌ చేయకపోతే జరిగే పరిణామాలివే..

Published Sun, Jun 25 2023 11:47 AM

PAN Aadhaar Linking Deadline Income Tax Department Reminds Consequences - Sakshi

శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)ను ఆధార్‌తో లింక్‌ చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ విధించిన గడువు ముగుస్తోంది. మినహాయింపు కేటగిరీకి చెందినవారు తప్ప మిగిలిన వారందరూ వెంటనే తమ పాన్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ ట్విటర్‌లో రిమైండర్‌ను షేర్ చేసింది.   

చివరి తేదీ సమీపిస్తున్న క్రమంలో ట్యాక్స్‌ పేయర్లు, పాన్ కార్డ్ హోల్డర్‌లు తమ పాన్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుకోవాలంటూ ఐటీ శాఖ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్‌లను జారీ చేస్తోంది. పాన్- ఆధార్‌ లింకింగ్ ప్రక్రియ కోసం అనుసరించాల్సిన సూచనలతోపాటు గడువులోపు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే జరిగే పరిణామాల గురించి కూడా హెచ్చరించింది.

చివరి తేదీ ఎప్పుడు?
పాన్‌-ఆధార్‌ను లింక్ చేయడానికి చివరి తేదీ జూన్ 30. ఈలోపు పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించకపోతే, 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆ పాన్‌ కార్డ్‌ పని చేయకుండా పోతుంది. 

పాన్‌-ఆధార్‌ లింక్ చేయడమెలా?

  • ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ కోసం సెర్చ్‌ చేసి అందుబాటులో ఉన్న పాన్-ఆధార్ లింక్‌పై క్లిక్ చేయాలి
  • అకౌంట్‌ ఉంటే లాగిన్ అవ్వాలి లేకుంటే కొత్తది క్రియేట్‌ చేసుకోవాలి
  • యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేయాలి (యూజర్‌ ఐడీగా పాన్‌ నంబర్‌ నమోదు చేయాలి) వెంటనే ఆధార్-పాన్‌ లింక్‌ను తెలియజేసే పాపప్‌ కనిపిస్తుంది. (ఒకవేళ కనిపించకపోతే వెబ్‌సైట్ ఎడమ వైపు విభాగాన్ని సందర్శించండి)
  • అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయాలి
  • వివరాలను నిర్ధారించి, క్యాప్చాను ఎంటర్‌ చేయాలి
  • ఇది పూర్తయిన తర్వాత పాన్ ఆధార్ కార్డ్‌కి విజయవంతంగా లింక్ చేసినట్లు నోటిఫికేషన్ వస్తుంది.     

లింక్ చేయకపోతే ఏమౌతుంది?
ఆదాయపు పన్ను శాఖ షేర్ చేసిన వీడియో ప్రకారం.. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే ఆ పాన్ కార్డ్ పనికిరాకుండా పోతుంది. అలాగే ఈ కింది పరిణామాలను పాన్ హోల్డర్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

  • చెల్లింపులు నిలిచిపోతాయి.
  • పాన్‌ పని చేయని కాలానికి నిలిచిపోయిన నగదుపై ఎటువంటి వడ్డీ రాదు
  • అధిక టీడీఎస్‌, టీసీఎస్‌లు భరించాల్సి ఉంటుంది.

ఎన్‌ఆర్‌ఐలు, కొన్ని నిర్దిష్ట రాష్ట్రాల వాసులు, భారతీయ పౌరులు కానివారు, 80 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారికి  పాన్-ఆధార్ లింక్ నుంచి, జరిమానాల నుంచి మినహాయింపు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 2023 మార్చి 28న ఆర్థిక శాఖ ఇచ్చిన ప్రకటనలో పాన్‌-ఆధార్‌ లింకింగ్‌కు చివరి తేదీని  జూన్ 30 వరకు పొడిగించినట్లు తెలిపింది. 2023 మార్చి 28 నాటికి 51 కోట్లకుపైగా పాన్‌లు ఆధార్‌తో లింక్ అయినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: Bank Holidays July 2023: నెలలో దాదాపు సగం రోజులు సెలవులే! 

Advertisement
Advertisement