భగీరథ యమధర్మరాజ సంవాదం | Sakshi
Sakshi News home page

భగీరథ యమధర్మరాజ సంవాదం

Published Sun, Mar 17 2024 10:00 AM

Story Of Bhagiratha And Yamadharmaraja - Sakshi

పూర్వం భగీరథ చక్రవర్తి సమస్త భూమండలాన్ని పరిపాలిస్తుండేవాడు. ధర్మాత్ముడు, పరాక్రమవంతుడు అయిన భగీరథుడు నిత్యం తన రాజ్యంలో యజ్ఞయాగాది క్రతువులను జరిపించేవాడు. ఆయన రాజ్యం సర్వసుభిక్షంగా ఉండేది. రాజ్యంలోని ప్రజలెవరూ ధర్మం తప్పేవారు కాదు. భగీరథుడి కీర్తిప్రతిష్ఠలు ముల్లోకాలకూ వ్యాపించాయి.

భగీరథుడి కీర్తిప్రతిష్ఠలు విని యమధర్మరాజు ఒకసారి ఆయనను స్వయంగా కలుసుకోవాలనుకున్నాడు. ఒకనాడు యమధర్మరాజు భగీరథుడి వద్దకు వచ్చాడు. భగీరథుడు ఎదురేగి యమధర్మరాజుకు స్వాగతం పలికాడు. ఘనంగా అతిథి సత్కారాలు చేశాడు. భగీరథుడి సేవలకు యమధర్మరాజు సంతృప్తి చెందాడు. ‘భగీరథా! నువ్వు చాలా ధర్మాత్ముడివి. నీ కీర్తి ముల్లోకాలకూ వ్యాపించింది. అది వినే నేను నిన్ను స్వయంగా కలుసుకోవాలని వచ్చాను. నీ జీవితం మానవులందరికీ ఆదర్శప్రాయం’ అని ప్రశంసించాడు.

‘సమదర్శీ! నా మీద నీ అనుగ్రహానికి ఆనందభరితుణ్ణవుతున్నాను. అయితే, నాకు కొన్ని ధర్మసందేహాలు ఉన్నాయి. సకలలోక ధర్మాధర్మ విచక్షణాదక్షుడవైన నువ్వే నా సందేహాలను తీర్చగలవు. అవేమిటంటే, ధర్మాలంటే ఏవి? ధర్మాచరణ చేసేవారికి ఎలాంటి లోకాలు ప్రాప్తిస్తాయి? దయచేసి వివరించు’ అని వినయంగా అడిగాడు భగీరథుడు.
‘ధర్మం అనేది రకరకాలుగా ఉంటుంది. ధర్మం గురించి సంపూర్ణంగా చెప్పాలంటే లక్ష సంవత్సరాలైనా సరిపోవు. అయినా నువ్వు అడిగావు కాబట్టి సూక్ష్మంగా చెబుతున్నాను విను. లోకంలో బ్రాహ్మణులకు, ఆధ్యాత్మికవేత్తలకు చేసే దానం అత్యుత్తమమైనది. స్వయంగా కూప తటాకాది జలాశయాలు తవ్వినా, ఇతరులను నియమించి తవ్వింపచేసినా వచ్చే పుణ్యఫలం అనంతం. బావులు, చెరువులు తవ్వే పనిలో స్వల్పమైన సాయం చేసినా గొప్ప పుణ్యఫలం దక్కుతుంది. ఇందుకు ఉదాహరణగా నీకు వీరభద్ర మహారాజు

కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పాడు:
పూర్వం గౌడదేశాన్ని వీరభద్రుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతడు మహాదానశీలి, ధర్మాత్ముడు, అమిత పరాక్రమవంతుడు. వీరభద్రుడి భార్య చంపకమంజరి. వీరభద్రుడు ప్రతినిత్యం యజ్ఞయాగాదులు నిర్వర్తించేవాడు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడేవాడు. వీరభద్రుడి రాజ్యంలో ప్రజలందరూ ధర్మబద్ధులై ఉండేవారు. అతడి మంత్రులందరూ విద్యావంతులు, ధర్మాధర్మ విచక్షణ కలిగిన విజ్ఞులు కావడంతో పరిపాలన సజావుగా సాగేది. వీరభద్రుడి రాజ్యం భూతలస్వర్గంగా ప్రసిద్ధి పొందింది.

ఒకనాడు వీరభద్రుడు తన మంత్రులు, పరివారంతో కలసి సమీప అరణ్యానికి వేటకు బయలుదేరాడు. మధ్యాహ్నం వరకు వేట కొనసాగించారు. మధ్యాహ్నవేళ వీరభద్రుడు సహా అతడి పరివారమంతా బాగా అలసట చెందారు. అందరికీ విపరీతమైన దాహం వేయసాగింది. సమీపంలో నీటిజాడ ఎక్కడైనా కనిపిస్తుందేమోనని అందరూ వెదకసాగారు. కొంత దూరం ముందుకు వెళ్లాక కొండ మీద ఒక చెరువు కనిపించింది. అక్కడకు వెళ్లి చూశారు. చెరువులో చుక్క నీరైనా లేదు. ‘అసలు ఇంత ఎత్తులో ఎవరు ఈ చెరువు తవ్వించారు? ఇందులో నీళ్లు ఎందుకు లేవు?’ అని స్వగతంగా అన్నాడు వీరభద్రుడు.

అక్కడే ఉన్న వీరభద్రుడి మంత్రి బుద్ధిసాగరుడు చెరువును మరికొంత లోతుకు తవ్వమని భటులను పురమాయించాడు. మూడడుగులు తవ్వేసరికి చెరువులోకి నీళ్లూరాయి. చెరువు కొంతవరకు నీళ్లతో నిండింది. అందరూ ఆ చెరువులో నీళ్లు తాగి సేదదీరారు. ‘మహారాజా! ఈ చెరువు వానాకాలంలోనే నిండేలా ఎవరో తవ్వించారు. మరికొంత లోతుకు తవ్విస్తే సర్వకాలాల్లోనూ ఇందులో నీళ్లు నిలిచి ఉంటాయి. బాటసారులకు దాహార్తి తీర్చేలా ఈ చెరువు మరింత లోతుకు తవ్వించేందుకు అనుమతించండి’ అన్నాడు బుద్ధిసాగరుడు. అందుకు వీరభద్రుడు సరేననడంతో మంత్రి బుద్ధిసాగరుడు దగ్గర ఉండి భటులతో చెరువును మరింత లోతుగా తవ్వించాడు. దానికి పటిష్ఠంగా రాతిగోడలు నిర్మించారు. కొంతకాలానికి ఆయుష్షుతీరి బుద్ధిసాగరుడు, వీరభద్రుడు నా లోకానికి వచ్చారు.

చిత్రగుప్తుడు వారి పాపపుణ్యాల చిట్టాను పరిశీలించి, కొండ మీద తటకాన్ని తవ్వించిన వారి మహత్కార్యాన్ని నాకు చెప్పాడు. ధర్మవిమానంలో వారు స్వర్గానికి వెళ్లడానికి అర్హులని గ్రహించి, వారిని విమానంలో స్వర్గానికి పంపాను. స్వర్గానికి బయలుదేరే ముందు వారు నన్ను కొండ మీద ఆ చెరువు చరిత్ర చెప్పమని అడిగారు. ‘పూర్వం సైకతపర్వతం మీద ఈ చెరువు ఉన్నచోట ఒక లకుముకి పిట్ట తన ముక్కుతో రెండంగుళాలు తవ్వింది. కొంతకాలానికి ఒక వరాహం అక్కడకు వచ్చి, తన ముట్టెతో రెండు మూరలు తవ్వింది. దాంతో అందులోకి అప్పుడప్పుడు కొంత నీరు చేరసాగింది. చుట్టుపక్కల వన్యప్రాణులు అందులోని నీరుతాగుతూ దాహార్తి తీర్చుకునేవి.

మూడేళ్లు గడిచాక ఒక ఏనుగుల గుంపు వచ్చి, దానిని మరింత లోతుగా తవ్వడంతో చిన్న చెరువుగా మారింది. అప్పటి నుంచి ఏటా వానాకాలంలో ఆ చెరువు పూర్తిగా నీటితో నిండసాగింది. మీరు వేసవి ప్రారంభంలో వేటకు వెళ్లడం వల్ల ఆ చెరువు ఎండిపోయి కనిపించింది. అంతకు ముందు అందులోకి నీరు ఇంకి ఉండటం వల్ల కొద్ది లోతు తవ్వగానే నీరు దొరికింది. వీరభద్రా! నీ మంత్రి సూచనతో నువ్వు ఆ చెరువును మరింత లోతుగా తవ్వించి, పటిష్ఠంగా గోడ నిర్మించి, ఏడాది పొడవునా నీరు నిలిచేలా చేశావు. ఈ పనిచేసినందుకు నువ్వు, నీ మంత్రి, నీ పరివారం అభినందనీయులు’ అని చెప్పి ధర్మవిమానంలో వారిని స్వర్గానికి సాగనంపాను. ‘భగీరథా! తటాకాలను తవ్వించిన వారికి సమస్తపాపాలూ నశించి, అనంత పుణ్యఫలం లభిస్తుంది’ అని చెప్పాడు యమధర్మరాజు. భగీరథుడు ప్రణమిల్లి, అతడికి సాదరంగా వీడ్కోలు పలికాడు.

ఇవి చదవండి: హెల్త్‌: గుటక వేయడం కష్టమవుతోందా? అయితే ఇలా చేయండి..

Advertisement
Advertisement