పదిలో మెరిసిన బాలికలు | Sakshi
Sakshi News home page

పదిలో మెరిసిన బాలికలు

Published Tue, Apr 23 2024 8:30 AM

మార్చిలో టెన్త్‌ పరీక్షలకు హాజరైన విద్యార్థులు (ఫైల్‌) - Sakshi

గుంటూరు ఎడ్యుకేషన్‌: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. నాలుగేళ్లతో పోల్చితే ప్రస్తుత ఏడాది జిల్లాలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రైవేటు, కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు, అత్యధిక ఉత్తీర్ణత నమోదు కావడం గొప్ప విషయం. గత మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా హాజరైన 27,178 మంది విద్యార్థుల్లో 23,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 88.14 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 14,223 మంది పరీక్షలు రాయగా, వారిలో 12,297 మంది ఉత్తీర్ణులై 86.46 శాతంగా నమోదైంది. బాలికలు 12,955 మంది పరీక్షలు రాయగా, వారిలో 11,658 మంది ఉత్తీర్ణులయ్యారు. 89.99 శాతం ఉత్తీర్ణతతో బాలికలు పైచేయి సాధించారు. వీరిలో 19,689 మంది ప్రథమ శ్రేణి, 3,031 మంది ద్వితీయ శ్రేణి, 1,235 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులున్నారు.

జిల్లాలో 88.14 శాతం ఉత్తీర్ణత

టెన్త్‌ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 86.69 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, జిల్లాలో 88.14 శాతంగా నమోదైంది. రాష్ట్రస్థాయిలో గుంటూరు జిల్లా 16వ స్థానంలో నిలిచింది. గతేడాది 77.40 శాతం ఉత్తీర్ణతతో ఆరో స్థానంలో నిలిచిన జిల్లా ప్రస్తుత ఫలితాల్లో దిగజారింది. 2020, 2021 సంవత్సరాల్లో కోవిడ్‌ కారణంగా ప్రభుత్వం విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది. తరువాత జరిగిన రెండేళ్ల ఫలితాలతో పోల్చితే రాష్ట్రస్థాయిలో జిల్లా స్థానం దిగజారినప్పటికీ ఉత్తీర్ణత శాతం పెరగడం ఆహ్వానించదగిన పరిణామం.

ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించిన విధానం, ట్యాబ్‌లు, ఐఎఫ్‌పీల ద్వారా ప్రవేశపెట్టిన ఆధునిక విద్యాబోధన, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టులను బోధించేందుకు ఉపాధ్యాయుల కొరత లేకుండా ఉద్యోగోన్నతులతో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసిన అంశాల ప్రభావం పదో తరగతి పరీక్షల్లో స్పష్టంగా కనిపించింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్‌ ఉన్నత పాఠశాలల నుంచి టెన్త్‌ పరీక్షలు రాసిన పేద కుటుంబాల విద్యార్థులు ప్రతిభావంతులుగా నిలిచారు. ప్రైవేటు, కార్పొరేట్‌తో పోటీ పడి రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించడంతోపాటు జిల్లాలో టాపర్లుగా నిలిచారు.

స్రభుత్వ పాఠశాలల్లో టాపర్లు వీరే

టెన్త్‌ ఫలితాల్లో ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు జెడ్పీ హైస్కూల్‌కు చెందిన తమలపాకుల అభినవ్‌ 600 మార్కులకు అత్యధికంగా 584 మార్కులను కై వసం చేసుకుని జిల్లా టాపర్‌గా నిలిచాడు. గుంటూరు రూరల్‌ యనమదల జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థినులు షేక్‌ రిహానా 583, షేక్‌ సమ్రీన్‌ 582, బాలనాగు మధుమిత 578 మార్కులు సాధించారు. గుంటూరు నగర పరిధిలో ఇజ్రాయిల్‌పేటలోని బొర్రా నాగేశ్వరరావు నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాల విద్యార్థిని షేక్‌ ఫాతిమా తబసుమ్‌ 582 మార్కులతో నగర స్థాయిలో టాపర్‌గా నిలిచింది. వీరితోపాటు 550కు మార్కులు సాధించిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.టెన్త్‌ ఫలితాల్లో 582 మార్కులు కమ్మలూరి సాత్విక(జెడ్పీ హైస్కూల్‌, చినకాకాని, మంగళగిరి మండలం), సయ్యద్‌ మొహమ్మద్‌ (బీఎన్‌ఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌, మంగళగిరి), కాసుల ఈశ్వరి(జెడ్పీ హైస్కూల్‌, శేకూరు, చేబ్రోలు మండలం), గంజి హర్షవర్ధన్‌ (ఎస్‌ఆర్‌ఎస్‌ మున్సిపల్‌ హైస్కూల్‌, తెనాలి), శృంగవరపు దీపిక(జెడ్పీ హైస్కూల్‌, గోగులమూడి, పెదనందిపాడు) సాధించారు.

జిల్లాలో 88.14 శాతం ఉత్తీర్ణత నమోదు రాష్ట్రస్థాయిలో జిల్లాకు 16వ స్థానం స్థానం దిగజారినా పెరిగిన ఉత్తీర్ణత ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు అధిక మార్కులు సాధించిన పేదింటి ప్రతిభా కుసుమాలు

Advertisement

తప్పక చదవండి

Advertisement