కొణతాల సోదరుడి బెదిరింపులు
పాత క్యాడర్‌కు పెదబాబు హెచ్చరికలు
వారు ఎదురుతిరగడంతో తోక ముడిచిన వైనం
అనకాపల్లి: మూడు పార్టీలు కలిసినా అనకాపల్లిలో ఎదురీత తప్పలేదు. 15 సంవత్సరాలు ప్రజలకు దూరంగా ఉన్న కొణతాల రామకృష్ణను చాలామంది గుర్తు పట్టడం లేదు. దీనికితోడు ఆనాటి ఆయన సోదరుల ఆగడాలు గుర్తుకు తెచ్చుకొని.. ఆ తలనొప్పి మాకొద్దు బాబోయ్ అంటున్నారు. 2004లో కొణతాలను గెలిపించి మూడు శాఖల మంత్రిని చేసిన వైఎస్సార్ అభిమానులను పక్కన పెట్టి తన సోదరుల సంపద సృష్టికే పరితపించిన కొణతాల.. 2009 ఎన్నికల్లో పరాజయం పాలై అనకాపల్లిని వదిలి విశాఖకు మకాం మార్చేశారు. తనను నమ్ముకున్న క్యాడర్‌ను గాల్లో వదిలేశారు. ఆనాటి కొణతాల వర్గమంతా వైఎస్సార్‌సీపీలో చేరి ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ తదితర పదవుల్లో ఉన్నారు.
2019లో గుడివాడ అమర్‌నాథ్ వెంట నడిచిన వీరంతా ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ గెలుపునకు కృషి చేస్తున్నారు. 15 ఏళ్ల తర్వాత ప్రజల్లోకొచ్చిన కొణతాల జనసేన పార్టీలో చేరి, టీడీపీ, బీజేపీ పొత్తుతో అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కానీ క్యాడర్ కరువై విలవిల్లాడుతున్నారు. తమ పాత వర్గమంతా కొణతాల గెలుపు కోసం పనిచేయాలని ఆయన సోదరుడు పెదబాబు కోరినప్పటికి ప్రయోజనం లేకపోయింది.
దీంతో కనీసం కొణతాలకు వ్యతిరేకంగా చురుగ్గా పనిచేయకుండా గమ్మున కూర్చోవాలని ఆయన తెరవెనుక బెదిరింపులకు దిగుతున్నారట. కొందరు నాయకులకు ఫోన్లు చేసి అసభ్య పదజాలంతో మాట్లాడుతూ.. మీ సంగతి చూస్తానంటూ దురుసుగా మాట్లాడుతున్నారట. మీ బెదిరింపులకు ఎవరు భయపడతారని, మా మీద మీ పెత్తనమేమిటని వారంతా ఎదురుతిరగడంతో చేసేది లేక పెదబాబు మిన్నకుండిపోయారట.
కొణతాల రామకృష్ణ మంత్రిగా ఉన్న కాలంలో అనకాపల్లికి చేసిందేమీలేదు. ప్రజలు ఆయన్ను కలిసి సమస్యలు చెప్పుకునే పరిస్ధితి ఏనాడూ లేదు. నియోజకవర్గంలో పాలన, అధికారం మొత్తం ఆయన సోదరులు పెదబాబు, రఘుబాబులదే. వ్యాపారులను బెదిరించి నెలవారీ మామూళ్లతో దోచుకున్నారు. సమస్యలపై వస్తే గంటలపాటు నిల్చోబెట్టేవారు. వారి ఆగడాలతోనే కొణతాల పరాజయం పాలయ్యారని అనకాపల్లిలో అందరూ చెప్పేమాట. తాను గెలిస్తే వారి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తానని, రాజకీయాల్లో వారి పాత్ర లేకుండా చేస్తానని మద్దతిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు కొణతాల ఇచ్చిన హామీ పెదబాబు బెదిరింపులతో మూలకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment