గాజాపై హమాస్‌ పట్టుకోల్పోయింది: ఇజ్రాయెల్‌ | Sakshi
Sakshi News home page

Israel- Hamas war: గాజాపై హమాస్‌ పట్టుకోల్పోయింది: ఇజ్రాయెల్‌

Published Tue, Nov 14 2023 7:04 AM

Israel says Hamas has Lost Control in Gaza - Sakshi

పాలస్తీనా గ్రూప్ హమాస్ నెల రోజుల క్రితం ఇజ్రాయెల్‌పై దాడికి దిగి, 500కు పైగా రాకెట్లను ప్రయోగించింది. ఈ నేపధ్యంలో హమాస్‌- ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం నడుస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ ‘గాజాలో హమాస్ నియంత్రణ కోల్పోయింది’ అని వ్యాఖ్యానించారు. హమాస్‌ ఉగ్రవాదులు దక్షిణం వైపుకు పారిపోతున్నారంటూ ఎటువంటి ఆధారాలు చూపకుండానే పేర్కొన్నారు.  ఈ విషయాన్ని ఆయన ఇజ్రాయెల్ ప్రధాన టీవీ స్టేషన్లలో ప్రసారమైన వీడియోలో తెలిపారు.

అక్టోబరు 7న ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి హమాస్ ఉగ్రవాదులు చొరబాటు అనంతరం రక్తపాత గాజా యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌లో సుమారు 1,200 మంది మృతి చెందారు. కాగా హమాస్ ఆధ్వర్యంలోని గాజా స్ట్రిప్ డిప్యూటీ హెల్త్ మినిస్టర్ యూసుఫ్ అబు రిష్ మాట్లాడుతూ వసతులు లేమి కారణంగా క్షతగాత్రులకు అన్ని ఆసుపత్రులలో వైద్య సేవలు అందించలేకపోతున్నామని, గాజాలోని అతిపెద్ద అల్-షిఫా ఆసుపత్రిలో ఇటీవల ఏడుగురు నవజాత శిశువులు, 27 మంది క్షతగాత్రులు మృతి చెందారని తెలిపారు.

ఇదిలావుండగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మీడియాతో మాట్లాడుతూ గాజాలో హమాస్ చేతిలో ఉన్న బందీలను విడిపించేందుకు ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలున్నాయన్నారు. ప్రణాళిక విఫలమవుతుందనే ఉద్దేశంతో వివరాలను వెల్లడించడం లేదన్నారు. అయితే బందీల విడుదలకు ఒప్పందం కుదుర్చుకోవడంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయన్నారు.
ఇది కూడా చదవండి: అదే గాజా.. అదే దీన గాథ!

Advertisement
Advertisement