డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో ఏర్పాట్లు చేయాలి | Sakshi
Sakshi News home page

డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో ఏర్పాట్లు చేయాలి

Published Wed, May 8 2024 8:20 AM

-

భూపాలపల్లి: నియోజకవర్గ కేంద్రంలోని డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం వద్ద అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, మెటీరియల్‌ పంపిణీకి ఇబ్బందులు రావొద్దని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌మిశ్రా అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ క్రీడామైదానంలో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం ఏర్పాటుచేసే స్థలాన్ని అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈ నెల 13న ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బందికి 12వ తేదీన ఎన్నికల సామగ్రి అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక రోజు ముందుగా డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 317 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటిని 30 సెక్టర్లుగా విభజించినట్లు తెలిపారు. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో 30 కౌంటర్లు ఏర్పాటు చేసి కౌంటర్ల ద్వారా ఎన్నికల విధులలో పాల్గొనే ిపీఓ, ఏపీఓ, ఓపీఓలు, సిబ్బందికి పోలింగ్‌ సామగ్రిని డిస్ట్రిబ్యూషన్‌ కౌంటర్ల ద్వారా అందించి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అంబేడ్కర్‌ క్రీడా మైదానంలో ఏర్పాటుచేసే డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం వద్ద అవసరమైన మౌలిక వసతులు కల్పించాలన్నారు. పోలింగ్‌ సిబ్బంది కోసం తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్‌, మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేయాలని చెప్పారు. పోలింగ్‌ రోజు సెక్టార్‌ అధికారులు ఈవీఎంలు, యంత్రాల, పోలింగ్‌ సామగ్రి ప్రభుత్వ వాహనాల్లో పటిష్ట పోలీస్‌ భద్రత నడుమ తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మంగీలాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాజేశ్వర్‌, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఆర్‌ఐ ప్రదీప్‌ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement