Udupi Sri Krishna Temple, St. Mary's Island, St. Lawrence Shrine Basilica Etc Best Places To Visit In Karnataka - Sakshi
Sakshi News home page

ఆహ్లాదం.. ఆధ్యాత్మికం.. ఉడుపి

Published Thu, Jul 20 2023 12:46 AM

ఉడుపి శ్రీకృష్ణ ఆలయ సముదాయం   - Sakshi

బనశంకరి: కన్నడనాట అందమైన తీరప్రాంతం ఉడుపి. ఇక్కడ పురాతన దేవాలయాలనుంచి అందమైన బీచ్‌లు, దట్టమైన అడవులు, ప్రకృతి సోయగాల వరకు అన్నీ చూడదగ్గ ప్రదేశాలే. ముఖ్యంగా శీతాకాలంలో ఈ ప్రాంతం ప్రధాన టూరిస్ట్‌ స్పాట్‌గా మారుతుంది. వర్షాకాలంలో కూడా చూడడానికి పెద్ద ఇబ్బంది ఉండదు. ఉడుపి నగరం మంగళూరుకు 55 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరుకు పశ్చిమ దిక్కున 422 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఇది ఉడుపి జిల్లా కేంద్రమే కాకుండా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం.అలాగే ప్రధాన పర్యాటక స్థలం ఈ నేపథ్యంలో ఉడుపి జిల్లా కర్ణాటకలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. సముద్ర రుచులు, సంప్రదాయ శాకాహార వంటకాలకు ఈ జిల్లా ప్రసిద్ధి.


సువర్ణ నది– అరేబియా సముద్రం ఆనుకుని ఉండే కోడి బీచ్‌ ఇది

సముద్రంలో సెయింట్‌ మేరీస్‌ ఐలాండ్స్‌
ఉడుపిలో మల్పె బీచ్‌ నుంచి కొన్ని కిలోమీటర్లు అరేబియా సముద్రంలో వెళితే సెయింట్‌ మెరీస్‌ దీవులను చేరవచ్చు. ఇది కూడా ప్రత్యేకమైన పర్యాటక స్థలం. మొత్తం నాలుగు ద్వీపాల సమూహాన్ని కోకోనట్‌ ఐలాండ్స్‌ అని కూడా అంటారు. ఇక్కడ ఉండే బసాల్ట్‌ రాళ్లు ఎవరో పేర్చినట్లుగా చక్కగా అమరి ఉంటాయి. ఇటువంటి రాళ్లు భారతదేశంలో మరెక్కడా లేవు. పెద్ద పెద్ద అలలతో కూడిన సముద్రంలో చిన్న చిన్న పడవల్లో ఈ దీవికి చేరుకోవాలంటే కొంచెం ధైర్యం ఉండాలి. ఇక మల్పే బీచ్‌ కూడా టూరిస్ట్‌స్పాట్‌.

కోడి బీచ్‌.. సాగర సంగమం
ఉడుపి నుంచి 36 కిలోమీటర్లు దూరంలో ఉండే కోడి బీచ్‌ కూడా ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశం. ప్రశాంతమైన వాతావరణంలో ఉండే బీచ్‌కు తక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు. దీంతో ఇక్కడ ప్రశాంతంగా ఆస్వాదించవచ్చు. ఈ బీచ్‌కు మూడుదిక్కులా సముద్రమే ఉండటంతో చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ సువర్ణా నది అరేబియా సముద్రంలో కలిసే సాగర సంగమం పాయింట్‌ కూడా ఉంది.


సెయింట్‌ లారెన్స్‌ చర్చ్‌

సెయింట్‌ లారెన్స్‌ చర్చ్‌
ఉడుపి బస్టాండ్‌ నుంచి 18 కిలోమీటర్లు దూరంలోని అత్తూర్‌ చర్చ్‌ లేదా సెయింట్‌లారెన్స్‌ చర్చ్‌ కూడా సందర్శించాల్సిన ప్రాంతమే. ఇది రోమన్‌ క్యాథలిక్‌ చర్చ్‌ కావడం విశేషం.ఇక్కడ ఒక పాఠశాలతో పాటు అనాథాశ్రమం కూడా నిర్వహిస్తున్నారు. టిప్పు సుల్తాన్‌ కాలంలో ఇక్కడ ఒక కట్టడంలో క్రైస్తవులను బంధించారు. క్రైస్తవులు విడుదలైన తరువాత ఆ కట్టడాన్ని చర్చిగా నిర్మించుకొన్నారు. ఈ చర్చ్‌ మహిమ గల ప్రార్థనా మందిరంగా గుర్తింపు పొందింది.


మల్పె బీచ్‌ నుంచి సముద్రంలోకి వెళ్తే కనిపించే సెయింట్‌ మేరీస్‌ ద్వీపం

సుందర సముద్ర తీరాల విడిది శ్రీకృష్ణ ఆలయం..
13 వ శాతాబ్దంలో నిర్మించిన శ్రీకృష్ణమఠం అని పిలిచే శ్రీకృష్ణుని ఆలయం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయాన్ని జగద్గురు శ్రీమద్వాచార్యులు స్థాపించారు. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే నవగ్రహ కిండి అని పిలిచే 9 రంధ్రాలతో కూడిన కిటికీ నుంచి నల్లనయ్యను దర్శించుకోవాలి. ఈ ఆలయాన్ని తెల్లవారుజామునుంచి రాత్రి 9 గంటల వరకు దర్శించుకోవచ్చు. భక్త కనకదాసుకు శ్రీకృష్ణుడు ఈ ఆలయంలో ప్రత్యేకంగా దర్శనమిచ్చాడని ప్రతీతి.

మూకాంబికా అభయారణ్యం
జిల్లాలోని కొల్లూరు సమీపంలో ఉండే మూకాంబికా అభయారణ్యం కూడా సందర్శించదగ్గ ప్రదేశం. పశ్చిమ కనుమలు ఉండే ఈ వన్యజీవి సంరక్షణ కేంద్రం జంతుప్రేమికులకు అమితంగా నచ్చుతుంది. మొత్తం పచ్చదనంతో నిండిన దట్టమైన అటవీప్రాంతంలో విహరించడం మంచి అనుభూతినిస్తుంది. అలాగే చుట్టుపక్కల మూకాంబికా దేవాలయం, అబ్బే వాటర్‌ ఫాల్స్‌, అరసినగుండి జలపాతం అలరిస్తాయి. తీరంలో మడ అడవుల్లో పడవల్లో విహారం కూడా చేయవచ్చు.

Advertisement
Advertisement