పల్లెబాటల్లో ప్రగతి వేగం.. హర్షం వ్యక్తం చేస్తున్న పల్లె ప్రజలు! | Sakshi
Sakshi News home page

పల్లెబాటల్లో ప్రగతి వేగం.. హర్షం వ్యక్తం చేస్తున్న పల్లె ప్రజలు!

Published Fri, Feb 9 2024 1:04 AM

- - Sakshi

కర్నూలు(అర్బన్‌): దశాబ్దాల తరబడి గుంతలు పడిపోయి, కనీసం నడిచేందుకు కూడా వీలు లేని గ్రామీణ రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయి. ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన పల్లె రోడ్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. నాబార్డు నిధులు రూ.189.29 కోట్లతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 39 పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తయితే రెండు జిల్లాల్లో 257.79 కిలోమీటర్ల మేర రోడ్లు అభివృద్ధి చెందనున్నాయి.


కోడుమూరు మండలం క్రిష్ణాపురం రోడ్డు పనులను పరిశీలిస్తున్న అధికారులు

రహదారులు అభివృద్ధి చెందుతుండటంతో పల్లె ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందిన ప్రత్యేక ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో 11, నంద్యాల జిల్లాలో 28 రోడ్లను బాగు చేసున్తన్నారు. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.187.27 కోట్లతో పాలనా అనుమతులు కూడా మంజూరు చేసింది. దీంతో ఆయా పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చేసేందుకు పీఆర్‌ ఇంజినీర్లు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

వేగంగా జరుగుతున్న పనుల్లో కొన్ని ...

► పత్తికొండ నియోజకవర్గం మండల కేంద్రమైన మద్దికెర నుంచి మొలగవెల్లి మీదుగా ఆలూరు వరకు రూ.8.15 కోట్లతో 14.90 కిలోమీటర్లు అభివృద్ధి చేస్తున్నారు.

► కోడుమూరు మండలం కర్నూలు – బళ్లారి ప్రధాన రహదారి నుంచి క్రిష్ణాపురం వరకు రూ.2.97 కోట్లతో 4.10 కిలోమీటర్ల మేర రోడ్డును అభివృద్ధి చేస్తున్నారు.

► కోడుమూరు మండలం వర్కూరు నుంచి మెరుగుదొడ్డి వరకు రూ.4.50 కోట్లతో 12.05 కిలోమీటర్ల మేర రోడ్డును వేస్తున్నారు.

► దేవనకొండ మండలం కర్నూలు – బళ్లారి మెయిన్‌ రోడ్డు నుంచి కొత్తపేట మీదుగా పుల్లాపురం వరకు రూ.3 కోట్లతో 5.8 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు వేస్తున్నారు.

నిరంతర పర్యవేక్షణ
ప్రాధాన్యత రోడ్ల పనుల్లో భాగంగా చేపట్టిన పనులు పూర్తయితే దాదాపు వంద గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ పనులు కొనసాగుతున్నాయి. వీటిని పూర్తి నాణ్యతతో నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేందుకు పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖకు చెందిన అధికారులు పర్యవేక్షిస్తున్నారు.


గతంలో మద్దికెర – ఆలూరు రోడ్డు 


ప్రస్తుతం మద్దికెర – ఆలూరు రోడ్డు పనులు

ఏఈ స్థాయి నుంచి డీఈఈ, ఈఈ, ఎస్‌ఈ వరకు వారంలో ఎవరో ఒక అధికారి ఈ పనులను పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు చేస్తున్నారు. దీంతో పనుల్లో వేగం పెరుగుతోంది. దశల వారీగా నాణ్యతను సంబంధిత అధికారులు పరీక్షించిన తర్వాత మరో దశ పనులు చేపడుతున్నారు.

నిధుల కొరత లేదు
ప్రభుత్వం ఆమోదించిన రోడ్ల పనులకు ఎలాంటి నిధుల కొరత లేదు. ఈ పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి నాణ్యతతో పూర్తి చేయనున్నాం. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మొత్తం 39 రోడ్ల పనులు ప్రారంభం అయ్యాయి. ఈ రోడ్ల పనులు పూర్తయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు కూడా ఈ పనులను వేగంగా పూర్తి చేయించేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.  


– కే సుబ్రమణ్యం, పీఆర్‌ ఎస్‌ఈ

Advertisement
Advertisement