కాన్స్‌ చిత్రోత్సవంలో భారతీయ చిత్రాలు | Sakshi
Sakshi News home page

కాన్స్‌ చిత్రోత్సవంలో భారతీయ చిత్రాలు

Published Sat, Apr 13 2024 3:31 AM

All We Imagine As Light first Indian film to compete at Cannes in 30 yrs - Sakshi

30 ఏళ్లకు ప్రతిష్టాత్మక పామ్‌ డ ఓర్‌’ విభాగంలో భారతీయ చిత్రం 

భారతీయ దర్శకురాలు పాయల్‌ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్‌ వీ ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ చిత్రం చరిత్ర సృష్టించింది. కాన్స్‌ చలన చిత్రోత్సవంలో ప్రధాన విభాగంగా భావించే పామ్‌ డ ఓర్‌’ అవార్డు పోటీలో నిలిచింది ఈ మలయాళ చిత్రం. ముంబైకి చెందిన పాయల్‌ కపాడియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 77వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పామ్‌ డ ఓర్‌’ అవార్డు కోసం పోటీలో నిలిచినట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ ఏడాది కాన్స్‌ చిత్రోత్సవం మే 15 నుంచి 25 వరకు జరగనుంది. ఈ సందర్భంగా ఈ ఫెస్టివల్‌కు సంబంధించిన అవార్డులు, స్క్రీనింగ్‌ కానున్న సినిమాల జాబితాను ప్రకటించారు నిర్వాహకులు.

కాన్స్‌లో అత్యధిక బహుమతిని అందించే పామ్‌ డ ఓర్‌’ విభాగంలో భారతీయ చిత్రం ‘ఆల్‌ వీ ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’తో పాటు అమెరికన్‌ ఫిల్మ్‌ ‘అనొర’, యూకే ఫిల్మ్‌ ‘ఓహ్‌.. కెనడా’, ఫ్రెంచ్‌ ఫిల్మ్‌ ‘బీటింగ్‌ హార్ట్స్‌’, పోర్చుగల్‌ ఫిల్మ్‌ ‘గ్రాండ్‌ టూర్‌’ వంటి దాదాపు 20 చిత్రాలు నిలిచాయి. ఇక ‘అన్‌సర్టైన్‌ రిగార్డ్‌’ విభాగంలో బ్రిటిష్‌ ఇండియన్‌ దర్శకురాలు సంధ్యా సూరి దర్శకత్వం వహించిన ‘సంతోష్‌’, బల్గేరియన్‌ దర్శకుడు కోన్‌స్టాటిన్‌ బోజనోవ్‌ దర్శకత్వంలో భారతీయ నటీనటులు భాగమైన ‘ది షేమ్‌లెస్‌’ చిత్రాలతో పాటు చైనా ఫిల్మ్‌ ‘బ్లాక్‌డాగ్‌’, ‘సెప్టెంబర్‌ సేస్‌’, జపాన్‌ ఫిల్మ్‌ ‘మై సన్‌షైన్‌’ వంటి 15 చిత్రాలు పోటీ పడుతున్నాయి.

ఇక ‘అవుట్‌ ఆఫ్‌ కాంపిటిషన్‌’ విభాగంలో ‘ఫూరియోషియా: ది మ్యాడ్‌మాక్స్‌ సాగ’, ‘రూమర్స్‌’తో పాటు మరో మూడు చిత్రాలు ఉన్నాయి. మిడ్‌నైట్‌ స్క్రీనింగ్‌ విభాగంలో ‘ది సఫర్‌’తో కలిసి నాలుగు చిత్రాలు, కాన్స్‌ ప్రీమియర్‌లో ‘ఇట్స్‌ నాట్‌ మీ’తో పాటు ఆరు చిత్రాలు, స్పెషల్‌ స్క్రీనింగ్‌ విభాగంలో ‘ది బ్యూటీ ఆఫ్‌ ఘాజా’తో కలిపి ఐదు చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి. 

మూడు దశాబ్దాల తర్వాత... 
కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పామ్‌ డ ఓర్‌’ విభాగంలో భారతీయ చిత్రం ‘ఆల్‌ వీ ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ పోటీ పడుతోంది. ఈ విభాగంలో 1994లో మలయాళ చిత్రం ‘స్వాహం’ నామినేషన్‌ను దక్కించుకున్నా, అవార్డు గెల్చుకోలేకపోయింది. ఈ సినిమాకు షాజీ నీలకంఠన్‌ కరుణ్‌ దర్శకత్వం వహించారు. అలాగే ఇదే విభాగంలో అవార్డు గెలుచుకున్న ఏకైక భారతీయ చిత్రం ‘నీచా నగర్‌’. 1946లో విడుదలైన ఈ హిందీ సినిమాకు చేతన్‌ ఆనంద్‌ దర్శకుడు.

‘నీచా నగర్‌’ చిత్రం తర్వాత ‘అమర్‌ భూపాలి’, ‘ఆవారా’ వంటి చిత్రాలు పామ్‌ డ ఓర్‌’కు నామినేషన్‌ దక్కించుకున్నా అవార్డు గెల్చుకోలేకపోయాయి. 30 ఏళ్లకు ఈ విభాగంలో  పోటీ పడుతున్న భారతీయ చిత్రం ‘ఆల్‌ వీ ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’కు అవార్డు వస్తుందా? అనేది చూడాలి. ఈసారి పామ్‌ డ ఓర్‌’ విభాగంలో విజేతను నిర్ణయించే జ్యూరీ అధ్యక్షురాలిగా అమెరికన్‌ నటి గ్రెటా గెర్విక్‌ వ్యవహరిస్తున్నారు. 

ఆల్‌ వీ ఇమాజిన్‌... కథేంటంటే...
కేరళకు చెందిన ఇద్దరు నర్సులు ప్రభ, అనులు ముంబైలో పని చేస్తుంటారు. ఈ ఇద్దరూ వారి వారి రిలేషన్‌షిప్స్‌లో ఇబ్బందులు పడుతుంటారు. అలా ఈ ఇద్దరూ ఓ రోడ్‌ ట్రిప్‌కు వెళ్లినప్పుడు ఏం జరిగింది? అన్నదే ఈ చిత్రం కథాంశమని సమాచారం. ఈ మలయాళ చిత్రానికి రచయిత–దర్శకురాలు, ఎడిటర్‌ పాయల్‌ కపాడియా దర్శకత్వం వహించారు. ఇక పాయల్‌ కపాడియా దర్శకత్వం వహించిన తొలి ఫీచర్‌ ఫిల్మ్‌ కూడా ఇదే కావడం విశేషం.

గతంలో పాయల్‌ దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీ ఫిల్మ్‌ ‘ఆఫ్టర్‌నూన్‌ క్లౌడ్స్‌’ 2015లో కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ స్క్రీనింగ్‌కు ఎంపిక అయింది. అలాగే పాయల్‌ దర్శకత్వంలో వచ్చిన మరో డాక్యుమెంటరీ ఫిల్మ్‌ ‘ఏ నైట్‌ ఆఫ్‌ నోయింగ్‌ నథింగ్‌’ 2021లో జరిగిన కాన్స్‌ ఫెస్టివల్‌లో ‘గోల్డెన్‌ ఐ’ అవార్డును గెలుచుకుంది. మరి.. ఈసారి కూడా పాయల్‌ అవార్డును గెలుస్తారా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ. 

సంతోష్‌ కథేంటంటే... 
బ్రిటిష్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ మేకర్‌ సంధ్యా సూరికి దర్శకురాలిగా ‘సంతోష్‌’ తొలి చిత్రం. ఉత్తర భారతదేశంలోని ఓ గ్రామం నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుంది. వితంతువు సంతోష్‌కి తన భర్త చేసే పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగం దక్కుతుంది. బలహీన వర్గానికి చెందిన ఓ అమ్మాయిపై జరిగిన అత్యాచారం, ఆ పై హత్యకు సంబంధించిన కేసుని ఛేదించే దర్యాప్తు బృందంలో సంతోష్‌ భాగం అవుతుంది. ఈ కేసుని ఆమె ఎలా హ్యాండిల్‌ చేసింది? అనేది కథాంశం. మరి.. ఈ చిత్రం కూడా అవార్డు దక్కించుకుంటుందా? చూడాలి.

Advertisement
Advertisement