‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ మూవీ రివ్యూ | Sakshi
Sakshi News home page

Manjummel Boys Review: మలయాళంలో రూ.200 కోట్లు వసూలు చేసిన మంజుమ్మల్‌ బాయ్స్‌ ఎలా ఉంది?

Published Sat, Apr 6 2024 11:51 AM

Manjummel Boys Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: మంజుమ్మల్‌ బాయ్స్‌
నటీనటులు: సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మ‌రియ‌న్‌, లాల్ జూనియ‌ర్ త‌దిత‌రులు
నిర్మాణ సంస్థలు: పరవ ఫిల్మ్స్, మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
రచన, దర్శకత్వం: చిదంబరం
సంగీతం: సుశీన్‌ శ్యామ్‌
సినిమాటోగ్రఫీ:షైజు ఖలీద్ 
ఎడిటర్: వివేక్ హర్షన్
విడుదల తేది(తెలుగులో): ఏప్రిల్‌ 6, 2024

కరోనా తర్వాత మలయాళ సినిమాలకు టాలీవుడ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. అక్కడ హిట్‌ అయిన సినిమాలను తెలుగులో డబ్‌ చేస్తే..ఇక్కడ కూడా మంచి విజయం సాధిస్తున్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో తెలుగులో మలయాళ సినిమాలను ఎక్కువగా రిలీజ్‌ చేస్తున్నారు. గతవారం  సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ రిలీజ్‌ చేశారు. ఇక ఈ వారం అదే జోనర్‌లో మరో సినిమాను విడుదల చేశారు. అదే మ​ంజుమ్మల్‌ బాయ్స్‌. ఇటీవల మలయాళంలో రిలీజై రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. ఇప్పుడు అదే పేరుతో ప్రముఖ నిర్మాత సంస్థ  మైత్రీ మూవీ మేక‌ర్స్‌ తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందా లేదా? రివ్యూలో చూద్దాం. 


‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ కథేంటంటే..
ఈ సినిమా కథ 2006 ప్రాంతంలో జరుగుతుంది. కేరళలోని కొచ్చికి చెందిన కుట్టన్‌(సౌబిన్ షాహిర్), సుభాష్‌(శీనాథ్‌ బాసి)తో పాటు మరికొంత మంది స్నేహితులు ఊర్లోనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ సరదాగా జీవితాన్ని గడుపుతుంటారు. ఈ గ్యాంగ్‌కి మంజుమ్మల్‌ బాయ్స్‌ అని పేరు పెట్టుకుంటారు. వీరంతా కలిసి ఓసారి తమిళనాడులోని కొడైకెనాల్‌ టూర్‌కి వెళ్తారు. అక్కడ అన్ని ప్రదేశాలను చూసి.. చివరకు గుణ కేవ్స్‌కి వెళ్తారు.

అది చాలా ప్రమాదకరమైన గుహ. ఆ గుహల్లో చాలా లోతైన లోయలుంటాయి. వాటిల్లో డెవిల్స్‌ కిచెన్‌ ఒకటి. అందులో పడ్డవారు తిరిగిన వచ్చిన దాఖలాలు లేవు. అందుకే ఆ ఏరియాకు టూరిస్టులు వెళ్లకుండా డెంజర్‌ బోర్డ్‌ పెట్టి నిషేధిస్తారు అటవి శాఖ అధికారు. కానీ మంజుమ్మల్‌ బాయ్స్‌ అధికారుల కళ్లుగప్పి నిషేధించిన ప్రాంతానికి వెళ్తారు. ఆ గుహంతా తిరిగి తెగ అల్లరి చేస్తారు. ఇంతలో అకస్మాత్తుగా ఓ లోయలో పడిపోతాడు సుభాస్. ఆ తర్వాత ఏం జరిగింది? సుభాష్‌ని కాపాడటానికి తోటి స్నేహితులు ఏం చేశారు? వారికి పోలీసు శాఖ, ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ ఎలాంటి సహాయాన్ని అందించాయి? చివరకు సుభాష్‌ ప్రాణాలతో బయటకొచ్చాడా లేదా? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
నిజ సంఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించి, హిట్‌ సాధించడంలో మలయాళ ఇండస్ట్రీయే మొదటి స్థానంలో ఉంటుంది. అక్కడ ఎక్కువగా యథార్థ కథలతోనే సినిమాను తీసి, దాన్ని ప్రేక్షకుడిని కనెక్ట్‌ అయ్యేలా చేస్తారు. మంజుమ్మల్‌ బాయ్స్‌ కూడా ఓ యథార్థ కథే. 2006లో జరిగిన సంఘటన ఇది. కేరళకు చెందిన కొంతమంది స్నేహితులు కోడైకెనాల్‌ టూర్‌కి వెళ్తే..అందులో ఒకరు లోయలో పడిపోతాడు. ఎర్నాకులం మంజుమ్మ‌ల్ బాయ్స్ సాహసం చేసి మరీ తమ స్నేహితుడిని రక్షించుకుంటారు. దీన్నే కథగా అల్లుకొని మజ్ముమల్‌ బాయ్స్‌ని తెరకెక్కించాడు దర్శకుడు చిదంబరం.

కథగా చూసుకుంటే మంజుమ్మల్ బాయ్స్ చాలా చిన్నది. ఇంకా చెప్పాలంటే తరచు పేపర్లో కనిపించే ఓ చిన్న ఆర్టికల్‌ అని చెప్పొచ్చు. లోయలో పడిపోయిన తన స్నేహితుడిని ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతాడు. ఇదే మంజుమ్మల్‌ బాయ్స్‌ కథ. ఈ యథార్థ సంఘటనకి దర్శకుడు ఇచ్చిన ట్రీట్‌మెంట్‌ ఉత్కంఠకు గురి చేస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు మనమే ఆ లోయలో  చిక్కుకున్న ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని చోట్ల భయం కలిగితే..  మరికొన్ని చోట్ల ‘అయ్యో.. పాపం’ అనిపిస్తుంది. లోయలో పడిపోయిన సుభాష్‌ పరిస్థితి చుస్తుంటే తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయి. సుభాష్‌ని కాపాడడం కోసం తోటి స్నేహితులు చేసే ప్రయత్నం, వారు పడే ఆవేదన గుండెల్నీ పిండేస్తుంది. అదే సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు, ఇతర అధికారులు వ్యవహరించే తీరును కూడా చాలా సహజంగా చూపించారు.  కథనం నెమ్మదిగా సాగడం కొంతమేరకు ఇబ్బందిగా అనిపిస్తుంది.

మంజుమ్మల్‌ బాయ్స్‌  నేపథ్యాన్ని పరిచయం చేస్తు సినిమా ప్రారంభించాడు దర్శకుడు.  కొడైకెనాల్‌ టూర్‌ ప్లాన్‌ చేసే వరకు కథంతా సింపుల్‌గా సాగుతుంది. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు కూడా కాకపోవడంతో ఒకనొక దశలో కాస్త బోర్‌ కొడుతుంది. ఎప్పుడైతే కొడైకెనాల్‌కి వెళ్తారో అక్కడ నుంచి కథనంలో వేగం పుంజుకుంటుంది.   సుభాష్‌ లోయలో పడిన తర్వాత ఉత్కంఠ పెరుగుతుంది. ఫస్టాఫ్‌లో కథేమీ లేకున్నా.. మంజుమ్మల్‌ బాయ్స్‌ చేసే అల్లరి ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్‌ సీన్‌ ఉత్కంఠను పెంచేలా ఉంటుంది.

ఇక సెకండాఫ్‌ అంతా ఉత్కంఠ భరితంగా, ఎమోషనల్‌గా సాగుతుంది. మంజుమ్మల్‌ బాయ్స్‌ చిన్నప్పటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.  సుభాష్‌, కుట్టన్‌ పాత్రల స్వభావం ఎలాంటివో ఆ సన్నివేశాల ద్వారా చూపించారు. సుభాష్‌కి ఇరుగ్గా ఉండే ప్రాంతాలు అంటే చిన్నప్పటి నుంచే చాలా భయం..అలాంటిది దాదాపు 150 అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోతాడు.  చిన్నప్పటి సీన్స్‌ చూపించిన తర్వాత సుభాష్‌పై మరింత జాలి కలుగుతుంది.  ఇలా మంజుమ్మల్‌ బాయ్స్‌ చిన్నప్పటి స్టొరీని సర్వైవల్ డ్రామా లింక్ చేస్తూ చూపించిన విధానం బాగుంది. క్లైమాక్స్‌లో ఆకట్టుకుంటుంది. కథనం నెమ్మదిగా సాగడం మైనస్‌. 

ఎవరెలా చేశారంటే.. 
ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తనమదైన సహజ నటనతో ఆకట్టుకున్నారు. వాళ్లు నటించారని చెప్పడం కంటే జీవించారనే చెపొచ్చు. తెరపై వాళ్లను చూస్తుంటే మనకు కూడా ఇలాంటి స్నేహితులు ఉంటే బాగుండనిపిస్తుంది. వాళ్లు చేసే అల్లరి పనులు అందరికి కనెక్ట్‌ అవుతుంది. షౌబిన్ షాహిర్‌, శ్రీనాథ్ భాషి పోషించిన పాత్రలు గుర్తిండిపోతాయి. టెక్నికల్‌గా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. షైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో ప్రధాన బలం. గుణ కేవ్స్‌ చుట్టే ఈ సినిమా సాగుతుంది. వాటిని షైజు ఖలీద్ తన కెమెరాలో చక్కగా బంధించాడు. సుశీన్‌ శ్యామ్‌ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. కాస్త ఓపికతో చూస్తే  ఈ  సర్వైవల్ థ్రిల్లర్ కచ్చితంగా ఆకట్టుకుంటుంది. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌ డెస్క్‌

Rating:
Advertisement
Advertisement