ధైర్యంగా ఓటుహక్కు వినియోగించుకోవాలి | Sakshi
Sakshi News home page

ధైర్యంగా ఓటుహక్కు వినియోగించుకోవాలి

Published Thu, Apr 18 2024 2:05 PM

- - Sakshi

వెంకటాపురం(కె): ప్రజలు ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని వెంకటాపురం సీఐ బండారి కుమార్‌ సూచించారు. మండల పరిధిలోని ఆలుబాకలో బుధవారం సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు సంఘ విద్రోహ శక్తులకు భయపడకుండా ఓటు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు కొప్పుల తిరుపతి రావు, అశోక్‌, వాజేడు ఎస్సై వెంకటేశ్వర్లు, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అగ్నిప్రమాదాలపై అప్రమత్తం

ములుగు రూరల్‌: అగ్ని ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక కేంద్ర అధికారి అబ్దుల్‌ రహీం అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా బుధవారం మండల పరిధిలోని మల్లంపల్లిలో గల బాలాజీ నర్సింగ్‌హోం వద్ద అగ్ని ప్రమాదాల నివారణ చర్యల వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది నగేష్‌, మధుసూధన్‌, భార్గవ్‌, మహేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

అంబులెన్స్‌లో ప్రసవం

గోవిందరావుపేట: అంబులెన్స్‌లో ఓ మహిళ ప్రసవించింది. ఈ ఘటన మండల పరిధిలోని బుస్సాపూర్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బస్సాపూర్‌కు చెందిన ధనసరి అంకిత పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. అంకితను 108లో ములుగు ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటీ యుగేందర్‌ పురుడు పోశారు. అనంతరం తల్లీబిడ్డను ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

కాంగ్రెస్‌ నాయకుడికి షోకాజ్‌ నోటీస్‌

కాటారం(మహదేవపూర్‌): మహదేవపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో నృత్యం చేసిన సంఘటనలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మహదేవపూర్‌ జెడ్పీటీసీ గుడాల అరుణ భర్త గుడాల శ్రీనివాస్‌కు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఐత ప్రకాశ్‌రెడ్డి ఈ నెల 15న షోకాజ్‌ నోటీస్‌ జారీ చేయగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ నెల 15న గుడాల శ్రీనివాస్‌ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఓ పాటకు నృత్యం చేయగా ఆ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అయింది. యోగా, వ్యాయామం ప్రాముఖ్యత పోలీసులకు తెలియజేయడంలో భాగంగా ఇలా నృత్యం చేసినట్లు శ్రీనివాస్‌ సోషల్‌ మీడియా ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. అయినప్పటికీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ కిరణ్‌ఖరే అదే రోజు విచారణ చేపట్టి ఎస్సైతో పాటు ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లపై వేటు వేశారు. ఇదే క్రమంలో నృత్యం అంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ సైతం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర స్థాయిలో వైరల్‌ కావడంతో స్పందించిన కాంగ్రెస్‌ జిల్లా కమిటీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా శ్రీనివాస్‌కు షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది. బాధ్యతాయుతమైన కాంగ్రెస్‌ కార్యకర్తగా ఉండి ఇలాంటి వాటికి పాల్పడటం సరికాదని నోటీస్‌లో పేర్కొంది. నోటీస్‌ జారీ అంశం మండలంలో చర్చనీయంగా మారింది.

కాళేశ్వర్యంలో

మద్యం దుకాణాలు బంద్‌

కాళేశ్వరం: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మొదటి విడతలో పార్లమెంట్‌ ఎన్నికలు ఈనెల 19న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు సరిహద్దులోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలోని రెండు మద్యం దుకాణాలను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కాటారం సీఐ నరేందర్‌ ఆధ్వర్యంలో బంద్‌ చేసి సీల్‌ వేశారు. మళ్లీ 19న పోలింగ్‌ ముగిసిన తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకుంటాయని పేర్కొన్నారు.

1/2

2/2

Advertisement
Advertisement