Telangana News: TS Elections 2023: నేతల వలసలు సరే.. మరి ఓటు బదిలీ సంగతేంటి..!?
Sakshi News home page

TS Elections 2023: నేతల వలసలు సరే.. మరి ఓటు బదిలీ సంగతేంటి..!?

Published Mon, Nov 20 2023 1:58 AM

- - Sakshi

రాజకీయ పార్టీల్లో వలసల పరంపర కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచి జిల్లాలో రాజకీయ పార్టీల్లో ఒక పార్టీ నుంచి ఇతర పార్టీలకు జంప్‌ జిలానీల సంఖ్య భారీగా పెరిగింది. ఆయా పార్టీల్లో నేతలపై వ్యతిరేకతతో కొందరు, టికెట్‌ ఆశించి రాకపోవడంతో మరికొందరు పార్టీ కండువాలు మార్చేశారు. అయితే, వలస పోతున్న నేతల వెంట ఓటు బదిలీ జరిగేనా అన్న సందిగ్ధత ఆయా పార్టీల అభ్యర్థుల్లో నెలకొంది.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఎన్నికల షెడ్యూల్‌కంటే ముందే సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లు కేటాయించారు. దీంతో చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులపై వ్యతిరేకతతో నేతలు కాంగ్రెస్‌ పార్టీలోకి వలస వెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఖరారు తర్వాత అధికార పార్టీ నుంచి కూడా కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్‌లో టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతల తరఫు వారంతా అధికార పార్టీలో చేరారు.

అదే విధంగా అనుకున్న వారికి టికెట్‌ రాకపోవడంతో మరో పార్టీలో చేరి టికెట్‌ పొందారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి కూడా బీఆర్‌ఎస్‌లోకి వలసల పరంపర కొనసాగింది. మరోవైపు మొదట్లో వలస వెళ్లిన నేతలు కొంతమంది మళ్లీ తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు పార్టీ మారిన వారితోపాటు ఓటు బదిలీ ఎంత మేరకు జరుగుతుందన్నది ఇప్పుడు అభ్యర్థుల ముందు పెద్ద ప్రశ్నగా మారింది.

పార్టీలు మారిన నేతలు
ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నేతలు కూడా పార్టీలు మారారు. తద్వారానే టికెట్లను దక్కించుకున్నారు. వారితోపాటు ఆ నేతల వెంట కింది స్థాయి నాయకులు కూడా కండువాలు మార్చారు. నకిరేకల్‌లో బీఆర్‌ఎస్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం టిక్కెట్‌ దక్కకపోవడంతో కాంగ్రెస్‌లో చేరి టికెట్‌ తెచ్చుకున్నారు. ఇన్నాళ్లు బీఆర్‌ఎస్‌లోనే ఉన్న వీరేశం అనుచరులు, ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు పలువురు కాంగ్రెస్‌లో చేరారు.

♦భువనగిరి నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఆయన వెంట కొంతమంది కూడా గులాబీ కండువా వేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చారు. అంతేకాకుండా భువనగిరి ఎమ్మెల్యే టికెట్‌ తెచ్చుకున్నారు.

ఆయన వెంట బీఆర్‌ఎస్‌లోకి వెళ్లినవారంతా తిరిగి ‘హస్తం’ గూటికి చేరారు. ఇదే నియోజకవర్గంలో బీజేపీలో ఉన్న జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. అయితే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లోకి రావడంతో.. జిట్టా బీఆర్‌ఎస్‌లో చేరారు. కొన్ని రోజుల వ్యవధిలోనే వీరిద్దరు అటుఇటు మారడం చర్చనీయాంశమైంది.

♦ నల్లగొండ నియోజకవర్గంలో మొన్నటి వరకు బీఆర్‌ఎస్‌లో ఉన్న..బీఆర్‌ఎస్‌ పార్టీ జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌, తిప్పర్తి జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి వంటి నేతలు కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో ఉన్న మాజీ జెడ్పీటీసీ తండు సైదులు బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. నల్లగొండ పట్టణంలోనూ 8మంది బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌కు చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు బీఆర్‌ఎస్‌లో చేరారు.

♦ తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌లో ఉన్న మందుల సామేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరి టికెట్‌ తెచ్చుకున్నారు.

♦హుజూర్‌నగర్‌ నియోజకవర్గం నేరేడుచర్లలో కౌన్సిలర్‌గా ఉన్న చల్లా శ్రీలతారెడ్డి బీజేపీలో చేరి హుజూర్‌నగర్‌ టికెట్‌ తెచ్చుకున్నారు. కోదాడ, నాగార్జునసాగర్‌, మిర్యాలగూడ, సూర్యాపేట, దేవరకొండ నియోజకవర్గాల్లోనూ ఒక పార్టీ నుంచి మరో పార్టీకి భారీ ఎత్తున నేతలు, ప్రజా ప్రతినిధుల వలసల పరంపర కొనసాగింది.

♦ మునుగోడులోనూ చివరి వరకు కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన చలమల్ల కృష్ణారెడ్డి బీజేపీలో చేరడంతో ఆయన వర్గం కూడా బీజేపీలోకి పోయింది. దీంతో పాటు కృష్ణారెడ్డి బీజేపీ టికెట్‌ తెచ్చుకున్నారు. అక్కడ గత ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరి, టికెట్‌ దక్కించుకున్నారు. దాంతోపాటు గతంలో కాంగ్రెస్‌లో ఉండి, ఆ తరువాత బీఆర్‌ఎస్‌లో చేరిన నేతలు, ప్రజా ప్రతినిధులు కొందరు మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

అంతుచిక్కని ఓటరు నాడి
పార్టీలు మారిన నాయకుల బలం ఎంత? పార్టీలు మారిన వారు చెబితే పడే ఓట్ల శాతం ఎంత? అన్న అనుమానాలు అభ్యర్థుల్లో నెలకొన్నాయి. స్థానికంగా మండలాలు, గ్రామాలు, పట్టణాల్లో వారికి ఉన్న బలం ఎంత? అనే అంచనాల్లో అభ్యర్థులు పడ్డారు. స్థానిక నేతలు తమ వైపు రావడంతో ఆయా ప్రాంతాల్లో అప్పటివరకు వారిని నమ్మిన ఓటర్లు ఇప్పుడు వారు మారిన పార్టీకి వేస్తారా? లేదా? అన్న ఆందోళన పలువురు అభ్యర్థుల్లో నెలకొంది.

ప్రస్తుతం అన్ని పార్టీలు ప్రచారాలు ముమ్మరం చేశాయి. ఏ పార్టీ మీటింగ్‌ పెట్టినా జనాలు తండోపతండాలుగా సభలకు వస్తున్నారు. ఈ పరిస్థితులలో ఓటర్ల నాడి తెలియని పరిస్థితి ఉంది. ఎవరికి వారు తామే గెలుస్తామని బహిరంగంగా చెబుతున్నా లోలోపల ఆందోళనతోనే ఉన్నారు.

Advertisement
Advertisement