G20 Summit 2023: శిఖరాగ్ర భేటీకి శ్రీకారం | Sakshi
Sakshi News home page

G20 Summit 2023: శిఖరాగ్ర భేటీకి శ్రీకారం

Published Sat, Sep 9 2023 5:39 AM

G20 Summit 2023: Joe Biden, Rishi Sunak, other world leaders to arrive in Delhi - Sakshi

న్యూఢిల్లీ: అద్భుతమైన ప్రపంచ ఆర్థికాభివృద్ధి సాధనే పరమావధిగా సాగే జీ20 అగ్రరాజ్యాల కూటమి సమావేశానికి హస్తిన సర్వాంగ సుందరంగా ముస్తాబై సభ్య దేశాల అధినేతలకు సాదర స్వాగతం పలుకుతోంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ తదితర ప్రపంచ దేశాల ఆగమనంతో జీ20 శిఖరాగ్ర సదస్సు హడావిడి మరింత పెరిగింది. శనివారం సైతం మరికొందరు నేతలు విచ్చేస్తున్నారు.

శుక్రవారం ఢిల్లీలో అడుగుపెట్టగానే బైడెన్‌తో మోదీ విస్తృతస్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రపంచ శ్రేయస్సుకు పాటుపడతామని ప్రకటించారు. మానవ కేంద్రిత, సమ్మిళిత అభివృద్ధి దిశగా సదస్సు కొత్త బాటలుపరుస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం ప్రకటించారు. మరోవైపు ఢిల్లీ డిక్లరేషన్‌ దాదాపు సిద్ధమైందని, ఏకాభిప్రాయం సాధిస్తామని భారత్‌ ధీమా వ్యక్తంచేసింది. 9, 10 తేదీల్లో (శని, ఆదివారాల్లో) జరిగే సదస్సుకు హాజరయ్యే నేతల రాక, సాదర స్వాగతం, అతిథులకు ఆతిథ్యంతో ఢిల్లీలో కోలాహలం పెరిగింది.

పసందైన వంటకాలు, భిన్న సంప్రదాయ వాయిద్యాలతో సంగీత విభావరి ఇలా పలు రకాల కార్యక్రమాలు, ప్రదర్శనలతో అధినేతలకు మరెప్పుడూ మరిచిపోలేని రీతిలో అద్భుతంగా అతిథ్యం ఇవ్వనున్నారు. వాతావరణ మార్పులు, ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం, ఆర్థిక అనిశి్చతి, మాంద్యం భయాలు వంటి కీలక అంశాలతో చర్చలు శిఖరాగ్రానికి చేరుకోనున్నాయి. ఎలాగైనా సరే సదస్సు ముగిసేనాటికి అందరి ఏకాభిప్రాయంతో సంయుక్త ప్రకటన విడుదల చేసేందుకు భారత్‌ శాయశక్తులా కృషిచేస్తోంది. నేడు మొదలయ్యే ఈ చర్చా సమరంలో నేతలు చివరకు ఎలాంటి వాగ్దానాలు చేస్తారో, ఏమేం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూద్దాం..!!  

దుర్భేద్యమైన భద్రత
ముఖ్యనేతలంతా ఢిల్లీకి వచ్చేస్తున్న నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో ఢిల్లీలో భద్రతా బలగాలను మొహరించారు. చర్చలకు ప్రధాన వేదిక అయిన ‘భారత్‌ మండపం’ కాంప్లెక్స్‌ వద్ద భద్రతను పోలీసులు, పారామిలటరీ, నిఘా వర్గాలతో కట్టుదిట్టం చేశారు. తొలిసారిగా ఇండియా ఈ సదస్సును నిర్వహిస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చేసేందుకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సదస్సు వివరాలను జీ20లో భారత షెర్పా అమితాబ్‌ కాంత్‌ శుక్రవారం ఢిల్లీలో వివరించారు.

‘ మన న్యూఢిల్లీ డిక్లరేషన్‌ దాదాపు సిద్ధం. దానిని ఇప్పుడు బహిర్గతం చేయలేం. ఎందుకంటే డిక్లరేషన్‌ తాలూకు ప్రతిపాదలను అధినేతలకు సమరి్పస్తాం. వారి సూచనలు, సవరణల తర్వాతే దానికి ఆమోదం లభిస్తుంది. ఆ తర్వాతే డిక్లరేషన్‌ ద్వారా సాధించబోయే విజయాలను వివరిస్తాం’ అని అమితాబ్‌ చెప్పారు.

‘ ఐక్యరాజ్యసమితి తర్వాత అత్యంత క్రియాశీలకమైన కూటమిగా ఉన్న ఆఫ్రికన్‌ యూనియన్‌ను జీ20లో చేర్చుకునేందుకు దాదాపు అందరినీ ఒప్పించడం భారతదేశ నిబద్ధతకు నిదర్శనం’ అని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్‌ మోహన్‌ క్వాత్రా చెప్పారు. ఆఫ్రికన్‌ యూనియన్‌ ఆగమనం మాకు సంతోషదాయకమే అని యురోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు చార్లెస్‌ మైఖేల్‌ అన్నారు. ఆఫ్రికన్‌ యూనియన్‌లో మొత్తంగా 55 దేశాలు సభ్యులుగా ఉన్నాయి.  

నేటి ప్రపంచానికి సరిపోయే నినాదమిది
మహా ఉపనిషత్తు నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు ఇతివృత్తం’ నేటి ప్రపంచానికి సరిపోయే నినాదమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అన్నారు. కాగా, చర్చల్లో రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ప్రధానంగా ప్రస్తావించి చర్చించాలని బ్రిటన్‌ భావిస్తోంది. దీంతో ఈ చర్చలో భారత్‌ పాత్ర కీలకంగా మారనుంది. ‘ ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ, మానవ హక్కుల హననంపై ఇండియా తన నిర్ణయం వెలువరచాలని చర్చలో పట్టుబడతాం.

మోదీతో, ఇతరులతో భేటీలను పుతిన్‌ దారుణ అకృత్యాలను ఆపేందుకు సాధనాలుగా వినియోగిస్తాం’ అని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ అధికార ప్రతినిధి చెప్పారు. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో కూటమి సభ్య దేశాల మధ్య భేదాభిప్రాయాలున్నా ఏకాభిప్రాయానికి ప్రయతి్నస్తామని యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు చార్లెస్‌ చెప్పారు. కాగా, భారత్‌ తమకు వ్యతిరేకంగా జీ20 వేదికగా ప్రకటన చేయాలని జీ7 దేశాలు ఒత్తిడి చేస్తున్నాయని రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో ఆరోపించింది.

డిజిటల్‌ మౌలిక వసతులు, వాతావరణ సంబంధ నిధులు, సుస్థిరాభివృద్ధి, శుద్ధ ఇంథనం వంటి అంశాల్లో జీ20 వేదికగా సానుకూల నిర్ణయాలు వెలువడతాయని అంతర్జాతీయ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌ ఒకటో తేదీన కూటమి సారథ్య బాధ్యతల్ని భుజానికి ఎత్తుకున్న భారత్‌ అప్పట్నుంచీ దేశవ్యాప్తంగా భిన్న నగరాలు, వేదికలపై 200 సమావేశాలను నిర్వహించింది. ప్రపంచ జీడీపీలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల జనసంఖ్య జీ20 దేశాల్లోనే ఉంది. అందుకే ఈ సదస్సులో తీసుకునే నిర్ణయాలు పెను ప్రభావం                  చూపిస్తాయి.  
 
సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
జీ20 శిఖరాగ్రంలో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ తదితరులు శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. సంప్రదాయ నృత్యాల నడుమ వీరికి ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) చీఫ్‌ క్రిస్టలినా జార్జియెవా విమానాశ్రయంలో డ్యాన్స్‌ చేశారు. భారతీయ సంస్కృతిపై క్రిస్టలినా చూపిన మక్కువను ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ప్రశంసించారు. వచ్చే రెండు రోజుల్లో వివిధ దేశాల నేతలతో ఫలప్రదమైన చర్చలు జరిపేందుకు ఆసక్తితో ఉన్నట్లు ఆయన తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ శుక్రవారం భారత్‌కు వచ్చారు. ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. బైడెన్‌కు చేసిన రెండు పరీక్షల్లోనూ నెగెటివ్‌గా రావడం పర్యటనను ఖరారు చేసుకున్నారు. ఇటలీ ప్రధాని జియోర్జియా మెలోనీ, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాలకు విమానాశ్రయంలో కేంద్ర మంత్రులు శోభా కరంద్లాజే, దర్శనా జర్దోష్‌ స్వాగతం పలికారు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌కు కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే, అర్జెంటినా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్‌కు కేంద్ర మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే స్వాగతం పలికారు.

కొమరోస్‌ అధ్యక్షుడు, ఆఫ్రికన్‌ యూనియన్‌ చైర్‌ పర్సన్‌ కూడా అయిన అజలి అస్సౌమనీ, రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్, ఒమన్‌ డిప్యూటీ ప్రధాని సయ్యిద్‌ ఫహద్, ఈజిప్టు అధ్యక్షుడు ఫతా ఎల్‌–సిసి, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్, యూఏఈ ప్రెసిడెంట్‌ అల్‌ నహ్యాన్‌లకు కూడా ఘన స్వాగతం లభించింది. ఐరాస సెక్రటరీ జనరల్‌ గుటెర్రస్‌కు అధికారులు స్వాగతం పలికారు. జీ20(గ్రూఫ్‌ ఆఫ్‌ 20)లో అర్జెంటినా, ఆ్రస్టేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, తుర్కియే, యూకే, అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)సభ్యులన్న విషయం తెలిసిందే.

బ్రిటిష్‌ కౌన్సిల్‌ విద్యార్థులతో సునాక్‌ ముఖాముఖి
శుక్రవారం యూకే ప్రధాని రిషి సునాక్‌ ఢిల్లీలోని బ్రిటిష్‌ కౌన్సిల్‌కు వెళ్లి సిబ్బంది, విద్యార్థులతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement