బీజేపీలో కేఆర్‌పీపీ విలీనం.. గాలి జనార్ధన్‌ కీలక వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

బీజేపీలో కేఆర్‌పీపీ విలీనం.. గాలి జనార్ధన్‌ కీలక వ్యాఖ్యలు

Published Mon, Mar 25 2024 12:22 PM

Gali Janardhana Reddy Merges KRPP With BJP In Karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌ రెడ్డి తన పార్టీని బీజేపీ విలీనం చేశారుఉ. ఈ క్రమంలో జనార్థన్‌ రెడ్డితో పాటు ఆయన భార్య కూడా బీజేపీలో చేరి పార్టీ కండువా కప్పుకున్నారు. 

కాగా, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ బీజేపీ గూటికి చేరుకున్నారు. తన పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్‌పీపీ)ని సోమవారం బీజేపీలో విలీనం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప సమక్షంలో జనార్ధన్‌ రెడ్డి తన పార్టీని బీజేపీలో కలిపారు. దీంతో, లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలో రాజకీయం ఆసక్తికరంగా మారింది.

ఈ సందర్భంగా గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. కేఆర్‌పీపీ పార్టీని బీజేపీలో విలీనం చేశానని, బీజేపీలో చేరానని తెలిపారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిని చేసేందుకు ఒక బీజేపీ కార్యకర్తగా తాను పని చేస్తానని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండానే తాను బీజేపీలో చేరానని, తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని చెప్పుకొచ్చారు. 

అనంతరం, మాజీ సీఎం యడియూరప్ప మాట్లాడుతూ.. గాలి జనార్దన్ రెడ్డి, ఆయన భార్య బీజేపీలో చేరారు. ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. జనార్దన్‌ రెడ్డి చేరిక బీజేపీని మరింత బలపరుస్తుందని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 28 లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కల్యాణ కర్ణాటక ప్రాంతానికి చెందిన కీలక నేతలు, జనార్దన్ రెడ్డి అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక, గత వారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన జనార్దన్ రెడ్డి, ఆ తర్వాత తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని ప్రకటించారు.

కర్ణాటకలో బీజేపీ కొత్త వ్యూహం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. బంపర్ మెజారిటీ సాధించిన కాంగ్రెస్ రాష్ట్రంలో బీజేపీ నుంచి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ ఫలితంతో కంగుతిన్న బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిపోరు సరికాదనే భావనకు వచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే మాజీ ప్రధానమంత్రి దేవెగౌడకు చెందిన జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) పార్టీతో బీజేపీ సీట్లను సర్దుబాటు చేసుకుంది. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలోని కల్యాణ కర్ణాటక ప్రాంతంపై మంచి పట్టు కలిగిన గాలి జనార్దన్ రెడ్డి పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష(కేఆర్‌పీపీ)ను కమలదళం విలీనం చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ఉన్న రెడ్డి, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ఓట్లను ఏకీకృతం చేయొచ్చని బీజేపీ భావిస్తోంది

Advertisement
 
Advertisement
 
Advertisement