భారతదేశ సంస్కృతి... ప్రకృతి సౌందర్యం...ఆధ్యాత్మిక శోభ ఉట్టి పడుతూ నిర్మితమైన ఆలయం
ఒకవైపు పచ్చని కొండలు మరోవైపు నీలి సముద్రం... మధ్య ప్రశాంత వాతావరణంలో ఆలయం. కేవలం ఆధ్యాత్మిక చింతన మాత్రమే కాక ఆలయంలో అడుగు పెడితే మానవ జీవనశైలి... హైందవ ధర్మం... కాలచక్రం అన్ని స్పష్టంగా కనిపిస్తాయి. వందల ఏళ్లుగా పూజలు అందుకుంటున్న ఎండాడ గ్రామ దేవత ఆలయం ఇప్పుడు కొత్తగా ఆకర్షణీయంగా నిర్మితమైంది.
ఆలయ చరిత్ర..
ఒకప్పుడు విశాఖ నగర శివారు ప్రాంతమైన గొల్లల ఎండాడ ..ముసలయ్య పేట... సాగర్ నగర్ పరిసర ప్రాంత ప్రజలకు మొగ దారమ్మ తల్లి గ్రామ దేవతగా కొనసాగారు. అప్పట్లో పరిసర దాదాపు పది గ్రామాల ప్రజలు ఏ కష్టసుఖాల్లోనైనా అమ్మవారిని తొలి గా పూజించేవారు. ఆ రోజుల్లో అమ్మవారు ప్రతికగా ఓ చలువ పందిరి కింద పూజలు చేశారు. అయితే 1988 ప్రాంతంలో సత్య ప్రసాద్ అనే వ్యక్తి సాగర్ నగర్ పరిసరాల్లో రియల్ వ్యాపారం నిర్వహించారు. ఆతనకు కొంత కలిసి వచ్చింది. దీంతో స్థానికులు అతన్ని అక్కడ ఆలయం అభివృద్ధి చేయాలని కోరారు. ఆమేరకు ఆయన ఆలయ నిర్మాణం చేపట్టారు. అయితే ఆలయాన్ని మొక్కుబడిగా కాక ఆధ్యాత్మిక త ఉట్టిపడే రీతిన నిర్మాణం చేపట్టారు దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన శిల్పుల సహకారంతో ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో అడుగడుగునా సంస్కృతి సాంప్రదాయం కనిపిస్తుంది.
వైకాశన విధానంలో ఆలయ నిర్మాణం
ఇక్కడ శ్రీమత్ వైకాసన విధానంలో ఆలయ నిర్మాణం జరిగింది.. ఆలయం ప్రాంగణంలో మొగ ధారమ్మ ప్రధాన దేవత ఆలయం నిర్మించారు. కుడి ఎడమల వైపు దుర్గాలమ్మ ..నూకాలమ్మ అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేశారు.
ఆలయంలో ఎటు చూసినా ఆధ్యాత్మికత తో పాటు శిల్పకళా సౌందర్యం కనిపిస్తుంది. మానవ జీవితంపై ప్రభావం చూపించే గ్రహాలు వాటి అధిపతుల శిల్పాలను కూడా ఇక్కడ పొందుపరిచారు. నవ గ్రహాలు . వాటి అధిపతుల తో పాటు భారతదేశంలోని మొత్తం 12 జీవనదుల దేవతల విగ్రహాలను కూడా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. శ్రావ్యమైన సంగీతానికి అద్దం పట్టే డోలు డమరుకం..వివిధ రకాల ఫలాలను కూడా శిల్ప కలలో పొందుపరిచారు. ముఖ్యంగా 16 నాలుగు స్తంభాలపై నాలుగు రకాల వృక్షాలను చిత్రీ కరించారు.
ఇక్కడ స్తంభాలపై చెక్కిన శిల్పాలు ఒక్కో రకమైన ఆలోచన స్పూర్తింపజేస్తాయి. కేరళ కర్ణాటక తమిళనాడు ప్రాంతాల్లో మాదిరిగా ఆలయాలపై ఏనుగుల దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అందులో ఇక్కడ ఆలయం వద్ద వుండే పెంపుడు ఏనుగులు.. అడవి ఏనుగులు... రాజుల కోటల వద్ద ఉండే ఏనుగుల శిల్పాలు చిత్రీకరించారు.
ఏనుగు తొండం పై మానవ జీవన విధానం
ఆలయ ప్రధాన ద్వారానికి అటు ఇటుగా కనిపించే రెండు ఏనుగు తొండాలు పై మానవ జీవన విధానంలో మార్పులు గోచరిస్తున్నాయి. రాతి యుగంలో మానవుడు.. ఆధునిక యుగంలో మానవుడు.. గ్రామాల్లో దశలవారీగా మారిన మానవ మనుగడ పనిముట్లు తదితర అంశాలన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా పురాతన మానవ జీవితం అడవి సంపద అన్ని రకాల ప్రాణుల చిత్రాలను కూడా శిల్పాల్లో పొందుపరిచారు.
ఆది దైవంగా విశ్వక్సేనుడు
ఆది దైవంగా గణేష్ విగ్రహానికి బదులు విశ్వక్సేనుడు విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది. ఆలయ ప్రకారం ప్రాకారం స్వస్తిక్.. కమలం... కలశం గోడలపై స్పష్టంగా కనిపిస్తాయి.
సంతాన దేవతలు విగ్రహాలపై శ్రీకృష్ణుడు బ్రహ్మ జంటగా ఇక్కడ శిల్పాలను చిత్రీకరించారు. ధర్మార్థ కామ్య మోక్షాలకు ప్రతీక గా శేషశయన మూర్తి... దశావతారాలు వటపత్ర సాయి విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రధాన ఆలయం ఒకరకంగా కనిపిస్తే ఉప ఆలయాలు కోణార్క్ దేవాలయం తరహాలో రథచక్రాలతో కనిపిస్తున్నాయి.
మహాలక్ష్మి దుర్గాదేవి సరస్వతి రూపాల్లో గ్రామదేవతలు
ఇక్కడ ప్రధాన దేవత మోగ ధారమ్మ ను మహాలక్ష్మి దేవిగా... దుర్గా దేవిని దుర్గి దేవిగా .. నూకాలమ్మను సరస్వతి దేవిగా పూజలు చేస్తుంటారు. ఇంత అందమైన ఆలయాన్ని సాగర తీరాన కొత్తగా నిర్మించడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ శిల్ప కళా సౌందర్యం తో పాటు ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది అని భక్తులు అంటున్నారు.
ఆలయం చూసేందుకు వస్తున్న పాత తరం జనం..
వాస్తవానికి మొగధారమ్మ పరిసర గ్రామాలకు గ్రామ దేవతగా కొనసాగారు. ఈ దశలో చిన్నతనంలో ఏమాత్రం మౌలిక సదుపాయాలు లేని స్థితిలో ఉన్న ఆలయం సమూలంగా మారడంతో చాలామంది భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాన్ని అత్యంత అద్భుతంగా నిర్మించిన వ్యక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ కొత్త శిల్ప సౌందర్యంతో ఆలయాన్ని చూసేందుకు పాతతరం జనం వస్తున్నారు ప్రధానంగా వృద్ధులు ఒక్కసారిగా ఆలయం మారిన తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ నుంచి ఋషికొండ వెళ్లే మార్గంలో సాగర్ నగర్ వద్ద ఉన్న ఈ ఆలయం పర్యాటకులను కూడా ఆకట్టుకుంటుంది. నిత్యం ప్రసాదంతో పాటు ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. ఈ పురాతన గ్రామదేవత ఆలయం ఇప్పుడు ఈ ప్రాంతానికి మరింత ప్రాధాన్యత పెంచిందని ఈ వార్డు కార్పొరేటర్ లోడగల అప్పారావు పేర్కొన్నారు.
ఆలయ దర్శన వేళలు
ఉదయం 5:30 నుంచి 10:30 సాయంత్రం 5:30 నుంచి 8 గంటల మధ్య అమ్మవార్ల దర్శనాలు లభిస్తున్నాయి.
విశాఖ నుంచి భీమిలి వెళ్లే మార్గంలో సాగర్ నగర్ పక్కన ఈ ఆలయం ఉంటుంది. ఈ మార్గంలో 24 గంటలు వాహనాలతో పాటు బస్సులు అందుబాటులో ఉంటాయి.
-రావులవలస రామచంద్ర రావు, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment