కొండలా ఉన్న గోపురంపైకి ఎక్కుతున్న అగ్నిమాపక సిబ్బంది, (ఇన్‌సెట్) చావుబతుకుల మధ్య ఉన్న పిల్లిని వలలో కిందకు దించుతున్న దృశ్యం జంతు సంరక్షకుడు వివేక్ చేతిలో మార్జాలం
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): ఇంగ్లిష్ నేర్చుకునే పిల్లలు కొంతకాలం కిందట ‘పుస్సీ క్యాట్..పు స్సీ క్యాట్ వేర్ హావ్‌యూ బీన్’ అని ముద్దుముద్దుగా వల్లెవేసే రైమ్ చాలామందికి తెలిసే ఉం టుంది. ఆ పాటలో క్యాట్ జవాబిస్తూ..రాణి గారి ని చూడడానికి ఏకంగా లండన్‌కే వెళ్లానని గడుసుగా అంటుంది. బాబాజీ కొండమీద పిల్లికి అం త సీన్ లేదు కానీ.. అది పాపం ఆకలితో నకనకలాడుతూ.. ఏకంగా దాదాపు వంద మీటర్ల ఎత్తు న్న ఆలయ గోపురంపైకే ఎక్కేసింది. అక్కడి నుంచి దిగిరాలేక యమయాతన పడింది. ఎట్టకేలకు జంతు సంరక్షకుల దయార్ద్ర హృదయం వల్ల.. అగ్నిమాపక సిబ్బంది దీక్షాదక్షతల వల్ల అయిదు రోజుల యాతన నుంచి పిల్లికి విముక్తి లభించింది. మార్జాల రక్షణ ప్రహసనం అనబడే ‘ఆపరేషన్ క్యాట్’ ఎట్టకేలకు సుఖాంతమైంది. ఈ సంఘటన కథాకమామిషు ఏంటంటే..
బాబాజీ కొండ అనబడే ఇసుకకొండపై వెలసిన సత్యనారాయణ స్వామి ఆలయం నగరంలో ఎంత ప్రముఖమైందో తెలిసిందే. ప్రాచీనమైన ఈ ఆలయ గోపురం దాదాపు వంద మీటర్ల ఎత్తుంటుంది. నాలుగైదు రోజులుగా ఆలయానికి వచ్చే భక్తులకు ఈ ఆలయ శిఖరంపైనుంచి సేవ్ మీ అన్న చందాన పిల్లి గావుకేకలు వినిపించడం మొదలైంది. ఏమైందోనన్న ఆలోచన కొద్దీ గోపురం వైపు దృష్టి సారిస్తే.. శిఖరంపైన అటూ ఇటూ తిరుగుతూ.. కిందకు దిగడానికి ప్రయత్నిస్తూ.. దిగలేక బెంబేలెత్తిపోతున్న ఓ మార్జాలం కనిపించింది. ఆలయం చుట్టుపక్కల తిరిగే పిల్లి ఏ పావురాన్ని చూసో పైకెక్కిందని.. ఎక్కడమైతే ఎక్కినా దిగడం చేతకాక తంటాలు పడుతోందని అంతా భావించారు. పైనుంచి దిగకపోతే భయంతోనో.. ఆకలితోనో మార్జాలం మృతి ఖాయం కనుక.. దానిని కాపాడితే పుణ్యమని భావించారు. వాళ్లలో ఓవ్యక్తి.. నగరంలోని జంతు ప్రేమికుల సంస్థ (విశాఖ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ కేర్ ఆఫ్ యానిమల్స్)కు చెందిన వివేక్ అనే యువకుడికి సమాచారం అందించారు. అతడు, ఆ సంస్థకు చెందిన మరి కొందరు ఆలయం వద్దకు చేరుకున్నారు.
చిక్కు సమస్య
పిల్లిని కాపాడాలనుకున్నారే కానీ.. అదెలా సాధ్యమో ఎవరికీ అర్థం కాలేదు. అప్పటికీ తెగించి గోపురం ఎక్కేందుకు ప్రయత్నించారు. అలా గురువారం మధ్యాహ్నం 3 నుంచిసాయంత్రం 6 గంటల వరకు తంటాలు పడ్డా ఫలితం లేకపోయింది. అంతలో వారిలో ఒకరికి అగ్నిమాపక దళం సాయం కోరాలన్న ఆలోచన వచ్చింది. ఐడియా వచ్చిందే తడవుగా.. అగ్నిమాపక కార్యాలయ అసిస్టెంట్ డివిజనల్ ఆఫీసర్‌కు ఫోన్ చేసి చెప్పారు. అధికారి వెంటనే స్పందించి అగ్నిమాపక యంత్రంతో పాటు పది మంది సిబ్బందిని పంపించారు. వీరంతా సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు నానా తంటాలు పడ్డారు. అయినా ఫలితం లేకపోవడంతో శనివారం ఉదయం ఆరున్నరకు మళ్లీ వచ్చి తాళ్ల సాయంతో శిఖరంపైకి ఎక్కారు.
వార్నిష్ పెయింట్ ఉన్న గోపురంపై కాలు జారుతున్నా తంటాలు పడి.. ఎట్టకేలకు ఉదయం పది గంటల ప్రాంతంలో పిల్లి ఉన్న ప్రాంతానికి అతి కష్టంపై చేరుకున్నారు. ఓ వలలో దానిని కిందకు దించి నగరంలోని మారికవలసలో గల విశాఖ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ కేర్ ఆఫ్ యానిమల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ పిల్లి నెమ్మదిగా కోలుకుంటుంది. ప్రమాదాల వేళ అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లడం మామూలే అయినా.. ఓ పిల్లి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.. మరో ఆలోచన లేక శిఖరం ఎక్కిన ఫైర్ సిబ్బందిని అంతా ప్రశంసించారు. ఆపరేషన్ క్యాట్‌లో సూర్యబాగ్ అగ్నిమాపక కార్యాలయ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఎన్.గోపీకిషోర్, లీడింగ్ ఫైర్‌మెన్ కె.శంకరరావు, డీఓపీ టి.అశోక్‌కుమార్, ఫైర్‌మెన్ కె.నాయుడుబాబు, ఆర్.శ్రీను, హోంగార్డ్ కె.శంకరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment