భక్త జనానికి బాధలు! | Parking Problems in Nookambika Temple Visakhapatnam | Sakshi
Sakshi News home page

భక్త జనానికి బాధలు!

Published Mon, Apr 22 2019 10:43 AM | Last Updated on Fri, Apr 26 2019 11:53 AM

Parking Problems in Nookambika Temple Visakhapatnam - Sakshi

అనకాపల్లి పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది నూకాంబిక ఆలయం. ఇక్కడి కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి ఉత్తరాంధ్రతోపాటు ఉభయగోదావరి జిల్లాల నుంచి భక్తులు తరలివస్తారు. ఏడాది పొడవునా తాకిడి ఉంటుంది. కొత్త అమావాస్య సందర్భంగా మూడు నెలలు నిర్వహించే జాతర రోజుల్లో వేలాది మంది రాకతో ఆలయం కిటకిటలాడుతోంది. అయితే అందుకు తగ్గట్టుగా సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా పార్కింగ్‌ సమస్య వాహనదారులను వెంటాడుతోంది. దేవాదాయశాఖ అధికారులు దృష్టిసారించడం లేదనే విమర్శలను ఎదుర్కొంటున్నారు.

అనకాపల్లి: నూకాంబిక అమ్మవారి దర్శనానికి ఇటీవల భక్తుల తాకిడి బాగా పెరిగింది. కొత్త అమావాస్య జాతర జరుగుతుండడంతో ఆదివారం రోజుల్లో 50 వేల మంది వరకూ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉండడంతో జాతర ముందు వివిధ శాఖల అధికారులతో దేవాలయ అధికారులు సమీక్ష జరిపి తగిన  ఏర్పాట్లు చేస్తారు. ఈ ఏడాది కొత్త అమావాస్య జాతర నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో రాజకీయ నాయకుల ప్రమేయం తగ్గింది. దేవాదాయశాఖ అధికారులకు పూర్తిస్వేచ్ఛ వచ్చింది. అయితే అధికారులు స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి.

మారని అధికారుల తీరు...
ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలను కల్పించడంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల తీరు మాత్రం మారలేదనే భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి గవరపాలెం నడిబొడ్డున ఉన్న అమ్మవారి ఆలయానికి చేరుకునేందుకు నాలుగైదు రహదారులు ఉన్నాయి. ఈ రహదారి కూడళ్ల వద్ద పోలీసులు చెక్‌పోస్టులు కూడా ఏర్పాటు చేసి కేవలం ద్విచక్ర వాహనాలనే లోనికి అనుమతిస్తారు. ఈ  ఆదివారం 50 వేలకు పైబడి భక్తులు తరలిరావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ఎన్నికలు ముగియడం, పదో తరగతి పరీక్షలు పూర్తికావడం, ఇంటర్‌ ఫలితాలు రావడంతో విద్యార్థులు, రాజకీయ నాయకులు తరలిరావడంతో రద్దీ పెరిగింది. ఇటీవల కారుల్లో వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో వీటిని ఆలయానికి చేరుకునే చెక్‌పోస్టుల వద్ద అధికారులు నిలిపివేసేందుకు గతంలో నిర్ణయించారు. కానీ కొన్ని చోట్ల కార్లను నిలిపివేయగా మరికొన్ని చోట్ల లోపలికి అనుమతించడంతో ఆలయానికి ముందు భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ప్రధానంగా పార్కింగ్‌ సమస్య...
అమ్మవారి ఆలయం ముందు ఉన్న రహదారికి ఒకవైపు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు షాపులు ఉన్నాయి. దీంతో రెండు, మూడు వాహనాలు ఎదురెదురుగా వస్తే ట్రాఫిక్‌ నిలిచిపోతుంది. ఆలయ సహాయ కమిషనర్‌ హోదాలో ఉన్న అధికారి జాతరకు సంబంధించి విచ్చేసే భక్తులకు అన్ని సదుపాయాలు  కల్పించడంపై మిగిలిన శాఖలకు సంబంధించిన అధికారుల సహకారం తీసుకోవాలి. ఆలయం ముందు సంచరించే భక్తులతో పాటు వాహనాలు తిరగడంతో అటు ట్రాఫిక్, ఇటు పార్కింగ్‌ సమస్య ఏర్పడింది. అమ్మవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల వాహనాలకు ఆదివారం సంత ప్రాంతం వద్ద పార్కింగ్‌ ఏర్పాటు చేశామని గత సంవత్సరాల నుంచి దేవాదాయ, ధర్మాదాయశాఖ అధికారులు  చెబుతున్నా అది ఆచరణకు నోచుకోలేదు. దీంతో ఆలయ సమీపానికి వచ్చిన వాహనాలను ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేయడంతో అక్కడ వాహనాలకు ఫీజును వసూలు చేస్తున్నారు. దీనిపై దేవాదాయ, ధర్మాదాయశాఖ అధికారులకు ఎటువంటి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు.  వాహనాల పార్కింగ్‌కు సంబంధించి స్పష్టమైన పార్కింగ్‌ సదుపాయం, వాహనాల రాకపోకలపై నియంత్రణ, భక్తులకు తగిన సూచనలు ఇచ్చే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. సహజంగా ఒకరిద్దరు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ కుటుంబ సమేతంగా వచ్చేవారే సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆదివారం ఇలాంటి సమస్యలు స్పష్పంగా కనిపించాయి.

పార్కింగ్‌కు సంతబయల స్థలాన్ని కేటాయించాం
అమ్మవారి ఆలయం వద్ద పార్కింగ్‌ కోసం సంతబయల వద్ద స్థలాన్ని కేటాయించాం. అయితే భక్తులకు తెలియకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాము ప్రతీ ఏటా జాతరకు ముందు అధికారులతో సమీక్ష నిర్వహిస్తాం. ఒక్కసారిగా వేలాదిమంది భక్తులు వస్తే కొద్దిపాటి ఇబ్బంది సహజమే. అయినా భక్తులకు మంచినీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నాం. – సుజాత, నూకాంబిక ఆలయ ఈవో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement