
టీ20 వరల్డ్‌కప్-2024లో పాకిస్తాన్ జట్టు కథ ముగిసింది. ఈ మెగా టోర్నీలో దారుణ ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ తొలి రౌండ్‌లోనే ఇంటుముఖం పట్టింది. తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో అనుహ్యంగా ఓటమి చవిచూసిన పాక్.. ఆ తర్వాత భారత్‌పై పోరాడి ఓటమి పాలైంది.
అనంతరం కెనడాపై తిరిగి పుంజుకుని బాబర్ సేన అద్బుత విజయం సాధించింది. దీంతో తమ సూపర్-8 ఆశలను పాక్ సజీవంగా నిలుపునకుంది. అయితే పాక్ భవితవ్యం ఆతిథ్య అమెరికాపై ఆధారపడింది.
ఐర్లాండ్ చేతిలో అమెరికా ఓడిపోతుందని, ఆ తర్వాత ఐర్లాండ్‌ను ఓడించి సూపర్-8కు వెళ్లాలని భావించిన పాక్ ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు. అమెరికా-ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో పాక్ టోర్నీ నుంచి గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.
ఇదే తొలిసారి..
కాగా టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ గ్రూపు స్టేజిలో ఇంటిముఖం పట్టడం ఇదే తొలిసారి. ఇంతకుముందు టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో పాక్ ఒక్కసారి కూడా గ్రూపు స్టేజిలో నిష్క్రమించలేదు. 2007లో షోయబ్ మాలిక్ సారథ్యంలో రన్నరప్‌గా పాక్ నిలిచింది.
అనంతరం 2009లో కూడా యూనిస్ ఖాన్ కెప్టెన్సీలో ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత షాహిద్ అఫ్రిది(2010), మహ్మద్ హాఫీజ్(2012) కెప్టెన్సీలో పాక్ సెమీఫైనల్స్‌కు చేరింది. అదే విధంగా బాబర్ ఆజం నాయకత్వంలో 2021 పొట్టి వరల్డ్‌కప్‌లో సెమీఫైనలిస్ట్‌గా, 2022 వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచింది.
కానీ ఈ సారి మాత్రం పాక్ గ్రూపు స్టేజిని దాటలేకపోయింది. దీంతో టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ స్టేజ్ నుంచి నిష్క్రమించిన తొలి పాక్ జట్టు కెప్టెన్‌గా బాబర్ ఆజం చెత్త రికార్డును నెలకొల్పాడు. దీంతో బాబర్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.