T20 World Cup 2024: బాబర్‌ ఆజమ్‌ రికార్డు సమం చేసిన రోహిత్‌ శర్మ | Indian captain Rohit Sharma has equaled Babar Azam's T20 captaincy record for the most T20 International wins. |Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: బాబర్‌ ఆజమ్‌ రికార్డు సమం చేసిన రోహిత్‌ శర్మ

Published Tue, Jun 25 2024 6:57 AM | Last Updated on Tue, Jun 25 2024 9:47 AM

T20 World Cup 2024: Rohit Sharma Equals Babar Azam Record For Most Wins In T20I

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుత కెప్టెన్లలో అతి తక్కువ మ్యాచ్‌ల్లో అత్యధిక అంతర్జాతీయ టీ20 విజయాలు సాధించిన కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. విజయాల పరంగా రోహిత్‌ పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌తో సమానంగా నిలిచినప్పటికీ.. మ్యాచ్‌ల పరంగా బాబర్‌ కంటే తక్కువ మ్యాచ్‌ల్లో రోహిత్‌ ఈ ఘనత సాధించాడు. 

హిట్‌మ్యాన్‌ కేవలం 60 మ్యాచ్‌ల్లో 48 విజయాలు సాధించగా.. బాబర్‌కు ఈ మార్కును తాకేందుకు 85 మ్యాచ్‌లు అవసరమయ్యాయి. టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా రోహిత్‌ ఈ రికార్డును సాధించాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ శివాలెత్తిపోవడంతో టీమిండియా 24 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. హిట్‌మ్యాన్‌ వీరవిహారం (41 బంతుల్లో 92; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) చేయడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. భారత్‌ ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్‌ (31), శివమ్‌ దూబే (28), హార్దిక్‌ పాండ్యా (27 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. విరాట్‌ కోహ్లి (0) మరోసారి నిరాశపరిచాడు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 25 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ట్రవిస్‌ హెడ్‌ (76) ఆసీస్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. హెడ్‌కు జట్టులో మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోడంతో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. 

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో మిచెల్‌ మార్ష్‌ (37), మ్యాక్స్‌వెల్‌ (20), టిమ్‌ డేవిడ్‌ (15), కమిన్స్‌ (11 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ 3, కుల్దీప్‌ 2, బుమ్రా, అక్షర్‌ పటేల్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ గెలుపుతో భారత్‌ అధికారికంగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. గ్రూప్‌-1 నుంచి రెండో సెమీస్‌ బెర్త్‌..  బంగ్లాదేశ్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement