జీ20 భేటీపై చైనా అభ్యంతరం.. భారత్‌ దీటైన జవాబు | Sakshi
Sakshi News home page

జీ20 భేటీపై చైనా అభ్యంతరం.. భారత్‌ దీటైన జవాబు

Published Sun, May 21 2023 6:02 AM

India Sharp Response As China Opposes G20 Meet In Kashmir - Sakshi

శ్రీనగర్‌: ఈ నెల 22–24 తేదీల మధ్య జి–20 టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ మూడో సమావేశాన్ని శ్రీనగర్‌లో నిర్వహించడంపై చైనా అభ్యంతరం తెలిపింది. జి–20కి సంబంధించిన ఏ విధమైన సమావేశాల్ని కూడా వివాదాస్పద ప్రాంతాల్లో జరపరాదని, అటువంటి సమావేశాలకు తాము హాజరుకాబోమని శుక్రవారం పేర్కొంది. దీనిపై భారత్‌ దీటుగా స్పందించింది. ‘మా సొంత భూభాగంలో ఎక్కడైనా సమావేశాలు జరుకునే స్వేచ్ఛ మాకుంది.

చైనాతో సాధారణ సంబంధాలు నెలకొనాలంటే సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు ఏర్పడటం అవసరం’అని పేర్కొంది. ఈ సమావేశాలకు హాజరు కారాదని టర్కీ ఇప్పటికే ప్రకటించగా, సౌదీ అరేబియా నుంచి ఎటువంటి స్పందనా లేదు. ఈ సమావేశాలకు వివిధ దేశాల నుంచి 100 మంది వరకు ప్రతినిధులు హాజరవుతారని ప్రభుత్వం ముందుగా భావించింది.

అయితే, సుమారు 60 మంది హాజరవుతారని తాజాగా అంచనా వేస్తోంది. ఇలా ఉండగా, జి–20 సమావేశాల నేపథ్యంలో  ప్రభుత్వం అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. మెరైన్‌ కమాండోలు, నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌(ఎన్‌ఎస్‌జీ)ను రంగంలోకి దించింది. ఉగ్రవాదులు హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నించవచ్చన్న అనుమానాల నేపథ్యంలో జి–20 సమావేశాల వేదిక, దాల్‌లేక్‌ను భద్రతా బలగాలు స్వాధీనంలోకి తీసుకున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement