వరల్డ్‌కప్‌ ఫైనల్‌.. క్రికెట్‌ అభిమానులకు భారతీయ రైల్వే శుభవార్త | Sakshi
Sakshi News home page

వరల్డ్‌కప్‌ ఫైనల్‌.. క్రికెట్‌ అభిమానులకు భారతీయ రైల్వే శుభవార్త

Published Sat, Nov 18 2023 11:40 AM

Indian Railways Announces special trains For World Cup final In Ahmedabad - Sakshi

క్రికెట్‌ అభిమానులకు భారతీయ రైల్వే సంస్థ గుడ్‌న్యూస్‌ చెప్పింది. నవంబర్‌ 19న వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్‌ మ్యాచ్‌ జరిగే అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించింది. భారత్‌ ఆస్ట్రేలియా మధ్య జరిగే హై ఓల్టేజ్‌ మ్యాచ్‌కు వెళ్లే అభిమానుల రద్దీ దృష్టా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

మొత్తం నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా.. మూడు ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. మరొకటి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు రైలు సర్వీసును నడపనున్నట్లు పేర్కొంది. ఈ రైళ్లు శనివారం సాయంత్రం ముంబై, ఢిల్లీ నుంచి బయలుదేరి మరుసటి రోజు(ఆదివారం) ఉదయం అహ్మదాబాద్‌కు చేరుకుంటాయని తెలిపింది. 

అంతేగాక అన్ని సాధారణ రైలు రిజర్వేషన్‌లు నిండినందున.. ప్రత్యేక రైలు టికెట్లు విమాన, మిగతా రైలు ఛార్జీల కంటే తక్కువ ధరలకే అందిస్తున్నట్లు చెప్పింది. ఈ రైలులో స్లీపర్‌ క్లాస్‌ టికెట్‌ ధర రూ. 620.. రూ.1,525కే 3ఏసీ ఎకానమీ బెర్త్.. రూ.1,665కే స్టాండర్డ్ 3ఏసీ.. రూ.3,490కే ఫస్ట్ క్లాస్ ఏసీ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది. కాగా అహ్మాదాబాద్‌కు ప్రస్తుతం విమాన టికెట్‌ ధర రూ. 20,000 నుంచి రూ. 40,000 వరకు ఉంది.

అదే విధంగా మ్యాచ్‌ ముగిసిన తరువాత అభిమానులు ప్రత్యేక రైళ్లలో తిరిగి వెళ్లే సదుపాయం కూడా కల్పిస్తుంది రైల్వే సంస్థ. అహ్మదాబాద్‌లో సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు రైళ్లు బయల్దేరనున్నాయని చెప్పింది. ఈ ప్రత్యేక రైళ్లలో టిక్కెట్లను ప్రయాణికులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని తెలిపింది.
చదవండి: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని మోదీ

కాగా గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లోని  నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం సాయంత్రం వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్‌ జరుగనున్న విషయం తెలిసిందే తుదిపోరులో టీమిండియా- అయిదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇరవై ఏళ్ల తర్వాత మరోసారి భారత్‌- ఆసీస్‌లు మరోసారి వరల్డ్‌ కప్‌ ఫైనల్లో ఈ రెండు జంట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఆసీస్‌-భారత జట్లు చివరగా 2003 వరల్డ్‌కప్‌ ఫైనల్లో తలపడ్డాయి. ఈ పోరును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా డిప్యూటీ పీఎం రిచర్డ్ మార్లెస్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్.. సహా పలువురు ప్రముఖులు ప్రత్యేక్షంగా వీక్షించనున్నారు.

నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోయే ఫైనల్‌ మ్యాచ్‌ను లక్ష పైచిలుకు మంది ప్రత్యక్షంగా చూడనున్నారు. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు దేశంలోనే కాకుండా విదేశాల్లోని అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దీంతో  అహ్మదాబాద్‌ వెళ్లవలసిన రోడ్డు, రైలు, ఆకాశ మార్గాలన్నీ కిక్కిరిసిపోయాయి. ధరలన్నీ ఆకాశాన్ని అంటున్నాయి. ఏది ఎక్కినా చుక్కలు చూడటం ఖాయంగా మారింది. బసచేసే హోటళ్లు, తినే ఆహారం రేట్లు అన్నీ వేలు, లక్షల్లో పలుకుతున్నాయి. అసాధారణ ధరలతో ఉక్కిరి బిక్కిరవుతున్న క్రికెట్‌ అభిమానులకు రైల్వే ప్రకటించిన సదుపాయం కాస్తా ఊరటనిచ్చే అంశంగా మారింది.
చదవండి: CWC 2023: టీమిండియా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అంతే!

Advertisement

తప్పక చదవండి

Advertisement