లోక్‌సభ ఎన్నికల సుదీర్ఘ ఘట్టంలో మే 7న మూడో విడత పోలింగ్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ విడతలో రాజకీయ ఉద్ధండులతో పాటు కొత్త ముఖాలూ బరిలో ఉన్నారు. కొల్హాపూర్‌లో ఛత్రపతి శివాజీ వారసునికి బీజేపీ టికెటిచి్చంది.
శివమొగ్గలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ భార్య బరిలోకి ఉన్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ లోక్‌సభ టికెట్ తీసుకున్నారు. మెయిన్‌పురిలో డింపుల్ భాభీ మరోసారి మేజిక్ చేసేందుకు సిద్ధమంటున్నారు. ఇలా మూడో దశ బరిలో ఆసక్తి రేపుతున్న కీలక స్థానాలపై ఫోకస్...
బారామతి వదినా మరదళ్ల వార్!
దేశమంతటా ఆసక్తి రేపుతున్న నియోజకవర్గమిది. మరాఠా రాజకీయ యోధుడు శరద్ పవార్ ముద్దుల తనయ సుప్రియా సులేపై వదిన సునేత్రా పవార్ పోటీకి సై అంటున్నారు. బాబాయి శరద్ పవార్‌పై తిరుగుబావుటా ఎగరేసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని దక్కించుకున్న అజిత్ పవార్ తన చెల్లెలిపై ఏకంగా భార్యనే రంగంలోకి దించారు. సుప్రియ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ. ఎన్‌సీపీ (శరద్) వర్గానికి సారథ్యం వహిస్తున్నారు.
గత ఎన్నికల్లో బీజేపీ నేత కంచన్ రాహుల్ కూల్‌పై 1,55,774 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి వదినా మరదళ్ల మధ్య హై ఓల్టేజ్ పోటీ నెలకొంది. సునేత్రకు బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)లతో కూడిన మహాయుతి కూటమి బలమైన దన్నుంది. ఇక సుప్రియ కాంగ్రెస్, శివసేన (ఠాక్రే) ఎన్‌సీపీ (పవార్)తో కూడిన మహా వికాస్ అగాడీ తరఫున వదినకు సవాలు విసురుతున్నారు. బీఎస్పీ నుంచి ప్రియదర్శని కోక్రే కూడా రేసులో ఉన్నారు.
విదిశ మామాజీ ఈజ్ బ్యాక్
మధ్యప్రదేశ్‌కు 20 ఏళ్లకు పైగా సీఎం. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బంపర్ మెజారిటీ సాధించి పెట్టారు. ఇంతటి రికార్డున్నా శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు మళ్లీ సీఎంగా చాన్స్ రాలేదు. అయితే బీజేపీ అనూహ్యంగా ఆయనను విదిశ నుంచి లోక్‌సభ బరిలో దింపింది. ‘‘శివరాజ్‌ను ఢిల్లీకి తీసుకెళ్తా. కేంద్ర ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారు’ అన్న మోదీ ప్రకటనతో విదిశ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
మామాజీగా ప్రసిద్ధుడైన శివరాజ్ ఇక్కడ 1991 నుంచి 2004 దాకా వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలవడం విశేషం. బీజేపీ దిగ్గజాలు వాజ్‌పేయి ఒకసారి, సుష్మా స్వరాజ్ రెండుసార్లు ఇక్కడ విజయం సాధించారు. ఈ బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్ నుంచి ప్రతాప్ భాను శర్మ బరిలో ఉన్నారు. ఆయన కూడా 1980, 1984లో ఇక్కడ రెండుసార్లు గెలిచారు. ఏకంగా 40 ఏళ్ల తర్వాత మళ్లీ బరిలో దిగుతున్నారు!
ఆగ్రా త్రిముఖ పోరు
యూపీకి దళిత రాజధానిగా పేరొందిన ఆగ్రాలో ముక్కోణపు పోరు నెలకొంది. సిట్టింగ్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ బఘెల్‌పై బీఎస్పీ నుంచి పూజా అమ్రోహి, సమాజ్‌వాదీ నుంచి సురేశ్ చంద్ర కర్దామ్ బరిలో ఉన్నారు. మోదీ–యోగీ ఫ్యాక్టర్, అయోధ్య రామమందిరం, సంక్షేమ పథకాలనే బఘెల్ నమ్ముకున్నారు. వైశ్యులు, బ్రాహ్మణులు, పంజాబీలు, యాదవేతర ఓబీసీలతో పాటు దళితుల్లో ఒక వర్గం కమలానికి మద్దతిస్తుండటం ఆయనకు కలిసి రానుంది.
దళితుల ఓటు బ్యాంకుపై పూజ, జాతవ్‌లు, ముస్లిం ఓట్లపై కర్దామ్ ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడి 20.57 లక్షల ఓట్లలో 30 శాతం దళితులే. వారిలోనూ మూడొంతుల మంది జాతవ్ దళితులు! బీఎస్పీ, ఎస్పీ అభ్యర్థులిద్దరిదీ ఇదే సామాజికవర్గం. ప్రత్యర్థుల నాన్ లోకల్ విమర్శలను పూజ దీటుగా తిప్పికొడుతున్నారు. ఈ స్థానం ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట. రామమందిర ఉద్యమంతో 1990 నుంచి బీజేపీ గుప్పిట్లోకి చేరింది. మధ్యలో రెండుసార్లు మాత్రం ఎస్పీ నుంచి బాలీవుడ్ నటుడు రాజ్ బబ్బర్ గెలిచారు.
శివమొగ్గ బీజేపీకి పక్కలో బల్లెం
కర్ణాటక దిగ్గజ నేత బీఎస్ యడ్యూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర మరోసారి శివమొగ్గలో బరిలో నిలిచారు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ భార్య గీతకు కాంగ్రెస్ టికెటివ్వడంతో రాజకీయం వేడెక్కింది. పైగా బీజేపీతో 50 ఏళ్లకు పైగా అనుబంధమున్న అగ్ర నేత కేఎస్ ఈశ్వరప్ప స్వతంత్ర అభ్యరి్థగా బరిలో నిలిచి రాఘవేంద్రకు పక్కలో బల్లెంలా మారారు. ఈ ముక్కోణపు పోటీ అందరినీ ఆకర్షిస్తోంది.
2023 అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్న ఈశ్వరప్ప తన కుమారుడు కంతేశ్‌కు ఎంపీ టికెట్ కోసం విఫలయత్నం చేశారు. యడ్యూరప్పతో మొదట్నుంచీ ఉప్పు నిప్పుగా ఉన్న ఈశ్వరప్పకు ఈ పరిణామం తీవ్ర ఆగ్రహం కలిగించింది. రాష్ట్ర బీజేపీ చీఫ్, యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రపై తీవ్ర విమర్శలకు దిగి పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. తాను మోదీకి వీర విధేయుడినంటూ ఆయన బొమ్మతోనే ఈశ్వరప్ప జోరుగా ప్రచారం చేస్తుండటంతో బీజేపీ నేతలు తలపట్టుకుంటున్నారు!
కొల్హాపూర్.. బరిలో ఛత్రపతి
ఛత్రపతి శివాజీ వంశీయుడిని కాంగ్రెస్ బరిలోకి దించడంతో కొల్హాపూర్‌లో పోటీ కాక పుట్టిస్తోంది. శివసేన సిట్టింగ్ ఎంపీ సంజయ్ మాండ్లిక్ ఈసారి శివసేన (షిండే) నేతగా మహాయుతి కూటమి తరఫున మళ్లీ బరిలో ఉన్నారు. దాంతో కాంగ్రెస్, శివసేన (ఠాక్రే) ఎన్సీపీ (శరద్)లతో కూడిన మహా వికాస్ అగాడీ వ్యూహాత్మకంగా ఛత్రపతి రాజర్షి సాహు మహారాజ్‌కు టికెటిచ్చింది. ఆయన కాంగ్రెస్ అభ్యరి్థగా బరిలో ఉన్నారు.
అయితే ఆయన శివాజీకి నిజమైన వారసుడు కాదన్న మాండ్లిక్ వ్యాఖ్యలతో అగ్గి రాజుకుంది. వీటిపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అధికార కూటమి వెనక్కు తగ్గింది. ‘గాడీ (సింహాసనం)ని గౌరవించండి. కానీ ఓటు మాత్రం మోడీకే వేయండి’ అంటూ కొత్త తరహా ప్రచారం మొదలుపెట్టింది. రెండు కూటముల మధ్య ఇక్కడ టఫ్ ఫైట్ జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, ఎన్సీపీలకు గట్టి పట్టుండటం సాహు మహారాజ్‌కు కలిసొచ్చే అంశం.
మెయిన్‌పురి.. భాభీ సవాల్
ఈ స్థానం ఎస్పీ దిగ్గజం దివంగత ములాయం సింగ్ యాదవ్ కంచుకోట. ములాయం మరణానంతరం 2022లో ఉప ఎన్నికలో ఆయన కోడలు, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ సత్తా చాటారు. 2.88 లక్షల ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రఘురాజ్ సింగ్ శాక్యను ఓడించారు. ఈసారి మళ్లీ బీజేపీకి సవాలు విసురుతున్నారు. బీజేపీ నుంచి యూపీ పర్యాటక మంత్రి జైవీర్ సింగ్ ఠాకూర్ బరిలో ఉన్నారు.
ఫిరోజాబాద్‌కు చెందిన ఠాకూర్ బలమైన నాయకుడు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలిచారు. బీఎస్పీ కూడా శివ ప్రసాద్ యాదవ్ రూపంలో బలమైన అభ్యరి్థని రంగంలోకి దించడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. బీఎస్పీ నుంచి మధ్యలో బీజేపీలోకి వెళ్లిన శివప్రసాద్ అనంతరం సొంత పార్టీ కూడా పెట్టి చివరికి బీఎస్పీ గూటికే చేరారు. ఇక్కడ మోదీ–యోగి ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదంతో సమాజ్‌వాదీకి ఎలాగైనా చెక్ పెట్టేందుకు కమలనాథులు తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు. కానీ డింపుల్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment