భోపాల్‌లో ఓటర్లకు కానుకలు
లక్కీ డ్రాలో బహుమతులు గెలుచుకోవచ్చంటే సామాన్యుల కాలు కదలకుండా ఉంటుందా..? మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లోక్‌సభ స్థానంలో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు ఇలాంటి ఆఫరే ఇస్తున్నారు. మూడో దశలో భాగంగా ఈ నెల 7న భోపాల్‌లో పోలింగ్ జరుగుతోంది. ఆ రోజున ఓటేసే వారి పేర్లనుంచి ప్రతి మూడు గంటలకు ఒకసారి లక్కీ డ్రా తీయనున్నారు.
విజేతలకు వజ్రపు ఉంగరాలు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు తదితర కానుకలిస్తారట! ‘‘నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉదయం 10, మధ్యాహ్నం 3, సాయంత్రం 6 గంటలకు లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులిస్తం. పోలింగ్ మర్నాడు మెగా డ్రా తీసి విజేతలకు మరింత పెద్ద బహమతులిస్తాం’’అని జిల్లా ఎన్నికల అధికారి కౌసలేంద్ర విక్రమ్ సింగ్ ప్రకటించారు.
ఓటింగ్ పెంచేందుకే..
మధ్యప్రదేశ్‌లో ఇప్పటిదాకా జరిగిన రెండు దశల్లో పోలింగ్ 2019తో పోలిస్తే సగటున 8.5 శాతం తగ్గింది. 2019లో భోపాల్‌లో 65.7 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి ఎండలు విపరీతంగా ఉన్నందున ఓటర్లు పెద్దగా ఇల్లు కదలకపోవచ్చన్న ఆందోళనలున్నాయి. దీంతో ఎలాగైనా ఓటింగ్‌ను పెంచాలని ఈసీ కృత నిశ్చయంతో ఉంది. భోపాల్ నియోజకవర్గంలో 3,097 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
ప్రతి బూత్ వద్ద ఒక బీఎల్‌వో, వలంటీర్‌ను లక్కీ డ్రా కోసం నియమించారు. ఓటేశాక అక్కడి కూపన్ బుక్‌లెట్‌లో పేరు, మొబైల్ నంబర్ రాసి రసీదు తీసుకోవాలి. బహమతుల ఖర్చును కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కంపెనీలు భరిస్తున్నాయి. మెగా డ్రా కోసం డైమండ్ ఉంగరాలు, ల్యాప్‌టాప్‌లు, ఫ్రిజ్‌లు ఎనిమిది డిన్నర్ సెట్లు, రెండు మొబైల్ ఫోన్లు రెడీగా ఉన్నాయి. దీంతోపాటు ప్రతి పోలింగ్ కేంద్రంలో తొలి ఓటర్‌ను గౌరవించేందుకు ప్రత్యేకంగా ఏదైనా చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు!
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment