‘లోక్‌సభకా.. నో, నో’.. కర్ణాటక కాంగ్రెస్‌లో కొత్త తలనొప్పి | Sakshi
Sakshi News home page

‘లోక్‌సభకా.. నో, నో’.. కర్ణాటక కాంగ్రెస్‌లో కొత్త తలనొప్పి

Published Thu, Mar 7 2024 8:00 PM

After State Win Cold Feet In Karnataka Congress Over Lok Sabha Elections - Sakshi

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి.. ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. వరుసగా మూడో సారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకువెళ్తోంది. మరోవైపు ఈసారి ఎలాగైనా మోదీని గద్దె దించేందుకు కాంగ్రెస్‌ సారథ్యంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

ఈ క్రమంలో తాజాగా ఎన్నికల ముంగిట కర్ణాటక కాంగ్రెస్‌లో కొత్త తలనొప్పి మొదలైంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల బరిలో దిగేందుకు కాంగ్రెస్‌కు అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్న హస్తం పార్టీలో ఈసారి ఎన్నికల పోరులో తలపడేందుకు వెనకడుగు వేస్తున్నారట. పలువురు మంత్రులతో సహా పేరు మోసిన నాయకులు సైతం ఎంపీగా పోటీకి అనాసక్తి చూపుతున్నట్లు సమాచారం..

కాగా కర్ణాటక ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్ర అని తెలిసిందే. అయితే పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేయాలన్న అభ్యర్థనను ఖర్గే ఇప్పటికే తిరస్కరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.  ఇక కర్ణాటకలో మొత్తం 28 ఎంపీ స్థానాలు ఉండగా..  2019 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 25 స్థానాలను కైవసం చేసుకోగా.. కాంగ్రెస్‌ కేవలం ఒక్క స్థానానికి పరిమితమైంది. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌  నుంచి ఒకరు , స్వతంత్ర్య అభ్యర్థి ఒక చోట గెలుపొందారు.

అయితే ఈసారి లెక్కలు తారుమారు అవుతాయని కాంగ్రెస్‌ భావిస్తోంది. గతేడాది రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం, రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రకు మంచి స్పందన తీసుకురావడంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుస్తామని పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.

రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాల్లో కొన్నింటిలో సిద్ధరామయ్య ప్రభుత్వంలోని మంత్రులు పోటీ చేయాలని పార్టీ కేంద్ర నాయకత్వం కోరుతున్నట్లు సంబంధిత తెలిపాయి. కేంద్రం భావిస్తున్న నేతల జాబితాలో మంత్రులు సతీష్ జార్కిహోళి, బీ నాగేంద్ర, కృష్ణ బైరేగౌడ, కేహెచ్ మునియప్ప, హెచ్‌కే పాటిల్, ఈశ్వర్ ఖండ్రే ఉన్నారు. అయితే పోటీకి మాత్రం వీరంతా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

లక్ష్మీ హెబ్బాల్కర్‌తో సహా పలువురు ఎంపీ ఆఫర్‌ను నిరాకరించినట్లు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న హెబ్బాల్కర్ తన కుమారుడు మృణాల్ హెబ్బాల్కర్‌ను పోటీలోకి దించాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. తన కుమారుడు పోటీ చేయాలని బెలగావి ప్రజలు, స్థానిక నాయకులు ఆశపడుతున్నారని, అతని పేరు కూడా సిఫార్సు చేసినట్లు మీడియాతో తెలిపారు.

చదవండి: కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి మాజీ సీఎం కుమార్తె!

మరోవైపు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌పీ మహదేవప్ప ఎలాంటి కారణం చెప్పకుండానే ఎంపీ అభ్యర్థి అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారు. తాను లోక్‌సభ అభ్యర్థిని కాదని.. ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన తెలిపారు. హైకమాండ్ ఎవరికి టికెట్ ఇస్తే వారి గెలుపు కోసం ప్రయత్నిస్తానని వెల్లడించారు. ఎంపీ పేరు ఎత్తగానే నేతలంతా వరుస పెట్టి ఎంపీగా  ఊహు. అనడంతో ఈ విషయంలో పార్టీ హైకమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.

తాజాగా ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం, రాష్ట్ర పార్టీ చీఫ్ డీకే శివకుమార్ స్పందించారు.  పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ అంగీకరించాల్సిందేనని తెలిపారు. అది తనకు కూడా వర్తిస్తుందన్నారు. పార్టీ వల్లే తామంతా ఇక్కడ ఉన్నామని, అందరూ అధిష్టాన నిర్ణయాన్ని అంగీకరించి.. ఎక్కువ సీట్లు గెలిచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ రణదీప్ సూర్జేవాలా మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు ఒక మంత్రిని మాత్రమే ఎంపీగా పోటీ చేయమని అడిగారని, ఈ విషయాన్ని పరిశీలించేందుకు ఆయన సమయం కావాలని కోరినట్లు తెలిపారు.

Advertisement
Advertisement