కాంగ్రెస్‌ మార్క్‌ సెలక్షన్‌! | Congress MLC Opportunity Those Who Have Been In Party Since Student Stage, Know Details Inside - Sakshi
Sakshi News home page

MLC Elections 2024: కాంగ్రెస్‌ మార్క్‌ సెలక్షన్‌!

Published Thu, Jan 18 2024 5:33 AM

Congress MLC opportunity those who been party since student stage - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌ మార్కు స్పష్టంగా కనిపించింది. ఎవరూ ఊహించని విధంగా భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నర్సింగరావుకు అవకాశం ఇచ్చింది. వెంకట్‌తో పాటు ముందు నుంచీ ఊహిస్తున్న విధంగానే టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌ను మరో అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది.

బల్మూరి వెంకట్‌ ఓసీ (వెలమ) వర్గానికి చెందిన వారు కాగా, మహేశ్‌కుమార్‌ బీసీ (గౌడ) వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. తొలుత బల్మూరితో పాటు దళిత నాయకుడు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు ఖరారైందనే వార్తలు వెలువడ్డాయి. నామినేషన్‌ పత్రాలు సిద్ధం చేసుకోవాల్సిందిగా చెప్పిందని కూడా ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనకు ఝలక్‌ ఇచ్చింది. గవర్నర్, స్థానిక సంస్థలు, గ్రాడ్యుయేట్స్‌ కోటా ఎమ్మెల్సీ పదవులను ఎస్సీ, మైనార్టీ వర్గాలకు కేటాయిస్తారని తెలుస్తోంది.  

మొదట్నుంచీ పార్టీకి విధేయుడు 
ఎన్నికైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అతి తక్కువ వయసులో ఎమ్మెల్సీ అయిన నేతగా బల్మూరి వెంకట్‌ రికార్డు సృష్టించనున్నారు. ఇక ఆయన ఎంపికకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. వెంకట్‌ మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీకి విధేయుడిగా ఉన్నారు. విద్యార్థి స్థాయి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ఖచ్చితంగా భవిష్యత్‌ ఉంటుందన్న సంకేతాలు పంపడంలో భాగంగానే వెంకట్‌ను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారనే చర్చ జరుగుతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణంలో పాలు పంచుకున్న పలువురు నేతలకు కాంగ్రెస్‌ పార్టీ తగిన ప్రాధాన్యత కల్పించిందని, అందులో భాగంగా వెంకట్‌కు ఈ ప్రాధాన్యత లభించిందని చెబుతున్నారు.

మరోవైపు పార్టీ పట్ల వెంకట్‌కున్న విధేయత కూడా కలిసి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2021 అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో హుజూరాబాద్‌ నుంచి వెంకట్‌ను పోటీకి దింపిన కాంగ్రెస్‌ పార్టీ.. అంతకు ముందు 2018 ఎన్నికల్లో పెద్దపల్లి అసెంబ్లీ టికెట్‌ను, ఆ తర్వాత 2023 ఎన్నికల్లో హుజూరాబాద్‌ టికెట్‌ను ఇవ్వలేదు. అయినా పార్టీ పట్ల విధేయతతో వెంకట్‌ అవిశ్రాంతంగా ఉద్యమాలు నిర్వహించారు. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల భర్తీ, పేపర్‌ లీకేజీలు, పోలీసు ఉద్యోగాల విషయంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరాడారు. అనేకసార్లు గాయపడ్డారు. పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో జైలుకు కూడా వెళ్లారు.

చర్లపల్లి జైల్లో ఉన్న వెంకట్‌ను ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా పరామర్శించారు. ఈ విధేయతే వెంకట్‌కు అనూహ్యంగా పెద్దల సభకు వెళ్లే అవకాశాన్ని కల్పించిందని, 2023 ఎన్నికల కంటే ముందే కేసీ వేణుగోపాల్‌ స్వయంగా వెంకట్‌ భవిష్యత్తుకు హామీ ఇచ్చిన దృష్ట్యా ఆయన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారనే చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో జరుగుతోంది. వెంకట్‌ పేరును రాహుల్‌గాంధీ స్వయంగా ప్రతిపాదించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండో ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్, మహేశ్‌గౌడ్‌ల పేర్ల పరిశీలన జరిగిందని, చివరకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వైపు పార్టీ మొగ్గు చూపిందని చెబుతున్నారు. 

సంస్థాగత నిర్మాణంలో మహేశ్‌ సక్సెస్‌ 
మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కూడా విద్యార్థి రాజకీయాల నుంచి కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు. 1986–1990 వరకు నిజామాబాద్‌ జిల్లా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత యూత్‌ కాంగ్రెస్‌లోనూ పనిచేశారు. అనంతరం పీసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2013–14 వరకు ఉమ్మడి రాష్ట్ర వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఇక, 2014లో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగస్వామి అయిన మహేశ్‌గౌడ్‌ ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

పార్టీ సంస్థాగత వ్యవహారాల బాధ్యుడిగా పనిచేస్తున్నారు. 2023 ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌ టికెట్‌ ఆశించినా కొన్ని సమీకరణల వల్ల సాధ్యం కాలేదు. అయినా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి సంస్థాగత వ్యవహారాలను చక్కదిద్దడంలో సఫలీకృతులయ్యారనే చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వలేని కారణంగా ఎమ్మెల్సీ లేదా పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తామని గతంలోనే అధిష్టానం మహేశ్‌కు హామీ ఇచ్చిందని, ఈ హామీ మేరకే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎంపిక చేసిందని గాం«దీభవన్‌ వర్గాలంటున్నాయి. 

నిస్వార్థంతో చేసిన కష్టానికి గుర్తింపు: వెంకట్‌ 
ప్రజాసమస్యల పరిష్కారం కోసం, పార్టీ బలోపేతం కోసం నిస్వార్థంతో సేవ చేసినందుకు కాంగ్రెస్‌ పార్టీ ఓ యువ కార్యకర్తకు గుర్తింపునిచ్చిందని బల్మూరి వెంకట్‌ చెప్పారు. తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాందీ, రాహుల్‌గాందీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై నమ్మకంతో పెట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. 

ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్‌ గౌడ్, బల్మూరి 
నేడు నామినేషన్ల దాఖలు 

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇద్దరిని కాంగ్రెస్‌ అధిష్టానం ఖరారు చేసింది. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి.మహేష్‌ కుమార్‌ గౌడ్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నర్సింగరావు (వెంకట్‌) అభ్యర్థిత్వాలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఇద్దరికీ పార్టీ బీ ఫారాలు అందజేశారు. కాగా మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్‌ గురువారం ఉదయం విడివిడిగా తమ నామినేషన్లు దాఖలు చేస్తారని సీఎల్పీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.  

బల్మూరి వెంకట్‌ బయోడేటా 
పేరు : బల్మూరి వెంకట నర్సింగరావు  
తండ్రి: మదన్‌మోహన్‌రావు  
పుట్టిన తేదీ    : నవంబర్‌ 2, 1992 
విద్యార్హత: ఎంబీబీఎస్‌  
పుట్టిన ఊరు: తారుపల్లి, కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా 
కులం: ఓసీ (వెలమ)  

మహేశ్‌కుమార్‌ గౌడ్‌ బయోడేటా 
పేరు:  బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ 
తండ్రి: బి.గంగాధర్‌ గౌడ్‌ 
పుట్టిన తేదీ:  ఫిబ్రవరి 24, 1966 
విద్యార్హత: బీకామ్‌ 
పుట్టిన ఊరు: రహత్‌నగర్, భీంగల్‌ మండలం, నిజామాబాద్‌ జిల్లా 
కులం: బీసీ (గౌడ) 

Advertisement
Advertisement