నేడు ప్రధానమంత్రి రోడ్‌ షో | Sakshi
Sakshi News home page

నేడు ప్రధానమంత్రి రోడ్‌ షో

Published Fri, May 10 2024 8:25 PM

-

భువనేశ్వర్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన కోసం శుక్రవారం మరోసారి రాష్ట్రానికి రానున్నారు. స్థానిక రాజ్‌భవన్‌లో ఆయన రాత్రి బస చేస్తారు. ఈ సందర్భంగా నగరంలో జరగనున్న ప్రధాని నరేంద్రమోదీ రోడ్‌ షో దృష్ట్యా కమిషనరేట్‌ పోలీసులు వాహనాల రాకపోకలపై మార్గదర్శకాలు జారీ చేశారు. శుక్రవారం మాస్టర్‌ క్యాంటీన్‌ కూడలి నుంచి వాణీ విహార్‌ వరకు రెండు కిలో మీటర్ల మేర జనపథ్‌ రోడ్‌లో ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహించనున్నారు. ఐదేళ్లలో మోదీకి ఇది రెండో రోడ్‌ షో.

పటిష్టమైన భద్రత

దీని కోసం 55 ప్లాటూన్ల పోలీసు బలగాల్ని మోహరించనున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రధాని రోడ్‌ షో కోసం ఐదుగురు డీసీపీ హోదా అధికారులు, పది మంది అదనపు డీసీపీలు, 27 మంది ఏసీపీలు, 41 మంది ఇన్‌స్పెక్టర్లు, 180 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లను మోహరిస్తారు. రహదారులకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయనున్నారు. మూడు యూనిట్ల ప్రత్యేక వ్యూహాత్మక విభాగం (ఎస్టీయూ)తో పోలీసు సిబ్బంది సాధారణ దుస్తులలో పరిస్థితి పట్ల నిఘా వేస్తారు. వాహనాల రవాణా పురస్కరించుకుని శాంతిభద్రతల నిర్వహణకు అనుకూలంగా చోదకులకు ఇబ్బంది కలగకుండా జారీ చేసిన నియంత్రణ మార్గదర్శకాల్లో కమిషనరేట్‌ పోలీసులు ఈ మార్గంలో వాహనాల రాకపోకలపై కొన్ని ఆంక్షలు విధించారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి మాస్టర్‌ క్యాంటీన్‌ నుంచి వాణి విహార్‌ వైపు వాహనాల రాకపోకలను నివారించే దిశలో దారి మళ్లిస్తారు. సాధారణ ప్రజల సౌకర్యార్థం జనపథ్‌ రహదారిపై వాహనాల రాకపోకలు ఇతర కార్యకలాపాలు లేకుండా సీల్‌ చేస్తారు.

పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాలు

శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రోడ్‌ షో ముగిసే వరకు జనపథ్‌ రహదారిపై..మాస్టర్‌ క్యాంటీన్‌ నుంచి వాణి విహార్‌ వరకు వాహనాలకు అనుమతి లేదు. వీధులు, సందులు గుండా వచ్చే వాహనాల రవాణాకు జనపథ్‌కు ఇరువైపుల మాస్టర్‌ క్యాంటీన్‌ నుంచి వాణి విహార్‌ వరకు జనపథ్‌ రహదారిని వినియోగించుకోవడానికి అనుమతించరు. తదనుగుణంగా వాహనదారులు తమ రూట్‌ను ప్లాన్‌ చేసుకోవాలని పోలీసులు సూచించారు.

ఆంక్షలు విధించిన పోలీసులు

Advertisement
 
Advertisement