స్పైస్‌జెట్‌కు రూ.60 వేల జరిమానా | Sakshi
Sakshi News home page

స్పైస్‌జెట్‌కు రూ.60 వేల జరిమానా

Published Fri, May 10 2024 8:25 PM

-

భువనేశ్వర్‌: స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థకు జిల్లా వినియోగదారుల ఫోరం భారీ జరిమానా విధించింది. ముందస్తు సమాచారం లేకుండా విమానం దారి మల్లించి గమ్యం చేర్చడంలో చోటు చేసుకున్న జాప్యంతో తలెత్తిన పరిణామాల వివరణతో బాధిత వినియోగదారుడు న్యాయ సంస్థను ఆశ్రయించాడు. ఈ అసౌకర్యం పూర్వాపరాల్ని పరిశీలించిన మేరకు జిల్లా వినియోగదారుల ఫోరం.. స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థకు రూ.60 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఝార్సుగుడ మాజీ సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి (ఎస్‌డీపీఓ) నిర్మల్‌ మహాపాత్రో స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ సేవల్లో లోపాలున్నాయని ఆరోపిస్తూ జిల్లా వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార ఫోరంలో వ్యాజ్యం దాఖలు చేశారు. అసౌకర్యానికి అనుబంధంగా సమాచార హక్కు చట్టం కింద లభ్యమైన వివరాల్ని వినియోగదారుల ఫోరం దృష్టికి తీసుకువెళ్లారు. నిర్మల్‌ మహాపాత్రో 2021 సంవత్సరం నవంబర్‌ నెలలో స్పైస్‌జెట్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకుని కుటుంబంతో కలిసి అస్సాం పర్యటనకు వెళ్లారు. వారి తిరుగు ప్రయాణంలో విమానం సుమారు 3 గంటలు ఆలస్యంగా గమ్యం చేరింది. బాగ్డోగ్రా నుంచి బయల్దేరిన స్పైస్‌జెట్‌ విమానం కోల్‌కత్తాకు సాయంత్రం 6.30 గంటలకు చేరాల్సి ఉండగా రాత్రి 9.30 గంటలకు చేరింది. దీనిపై ఆరా తీయగా గౌహతికి దారి మళ్లించడంతో ఈ జాప్యం అనివార్యమైనట్లు గుర్తించారు. ఈ మేరకు ముందస్తు సమాచారం లేకుండా ప్రయాణంలో అసౌకర్యం కల్పించడంతో కోల్‌కత్తా నుంచి ఝార్సుగుడాకు వెళ్లాల్సిన రైలు తప్పిపోయినట్లు వివరించారు. దీంతో టాక్సీని అద్దెకు తీసుకుని సుదూర ఝార్సుగడకు రోడ్డు మార్గంలో ప్రయాణించడంతో తన కుటుంబీకులు అనారోగ్యానికి గురైనట్లు ఆరోపించారు. ఈ పరిస్థితి మరింత ఆవేదనకు గురి చేసిందని జిల్లా వినియోగదారుల ఫోరంకు అనుబంధ సాక్ష్యాధారాలతో రుజువు చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న న్యాయ సంస్థ సమన్వయ లోపం కారణంగా ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి రూ.50 వేలు, కేసు నమోదులో దరఖాస్తుదారుడు చేసిన ఖర్చుకు రూ.10 వేలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement