యాప్‌ల్లో ఎన్నికల పందేలు | Betting on elections in apps | Sakshi
Sakshi News home page

యాప్‌ల్లో ఎన్నికల పందేలు

May 10 2024 5:08 AM | Updated on May 10 2024 5:08 AM

Betting on elections in apps

ఆన్‌లైన్‌లో  కాయ్‌ రాజా కాయ్‌

చట్టవిరుద్ధంగా ఆ యాప్‌లు హల్‌చల్‌

పార్టీలు, రాష్ట్రం, అభ్యర్థుల వారీగా అక్రమ బెట్టింగ్‌లు

రూ.100 నుంచి రూ.10 లక్షల వరకూ పందేలు

డిజిటల్‌ లావాదేవీల కోసం మ్యూల్‌ బ్యాంక్‌ అకౌంట్లు

ఆయా యాప్‌ల నిర్వహణ మొత్తం విదేశాల నుంచే

యాప్‌లు డౌన్‌లోడ్‌ చేస్తే మాల్‌వేర్‌తో ఫోన్‌ హ్యాక్‌

సాక్షి, హైదరాబాద్‌: బంతి బంతికీ.. మ్యాచ్‌ మ్యాచ్‌కూ ఎలాగైతే క్రికెట్‌ బెట్టింగ్‌లు జరు­గు­తున్నాయో.. అచ్చం అదే తరహాలో దేశంలో జరుగుతున్న ఎన్నికలపై కూడా పందేలు కాస్తున్నారు. క్రికెట్, ఫుట్‌బాల్, రగ్బీ, సాకర్, బాక్సింగ్, హార్స్‌ రైండింగ్‌ వంటి అన్ని రకాల క్రీడలపై బెట్టింగ్‌లు నిర్వహి­స్తున్న పలు ఆఫ్‌ షోర్‌ బెట్టింగ్‌ యాప్‌లు, వెబ్‌సై­ట్లు ఎన్నికల ఫలితాలపై కూడా బెట్టింగ్‌లు నిర్వహిస్తు­న్నాయి. పార్టీల వారీగా వచ్చే ఫలితాలు, నియోజకవర్గం, అభ్యర్థుల విజయాలు, మెజారిటీ వారీగా పందేలు కడుతున్నాయి.

గత ఎన్నికల్లోనే మొదలు..
2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ తరహా బెట్టింగ్‌లు జరిగినా అది తక్కువ స్థాయిలోనే జరిగాయి. కానీ, ఈసారి ఎన్నికలు అన్ని ప్రాంతీయ, జాతీయ పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో పందేలపై ఆసక్తి పెరిగింది. దీంతో బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ సంస్థలు వీటిపై దృష్టిసారించాయి. ఫెయిర్‌ ప్లే, జన్నత్‌బుక్, ఓం 247, జైబుక్, సాట్‌స్పోర్ట్, బకార్డీ వంటి సుమారు డజన్‌ యాప్‌లు, వెబ్‌సైట్లు ప్రత్యేకంగా ఎన్నికల్లో బెట్టింగ్‌లను నిర్వహిస్తున్నాయి. 

మ్యూల్‌ ఖాతాల్లోనే లావాదేవీలు
బెట్టింగ్‌ యాప్‌లు ఇండియా వెలుపలి నుంచి నిర్వహిస్తుంటాయని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. యాప్‌లను నిర్వహణ చేసే కంపెనీలు సిండికేట్‌గా మారి ఈ ఎన్నికల పందేలను నిర్వహిస్తుంటాయని, యూపీఐ చెల్లింపులు, బ్యాంక్‌ లావాదేవీల కోసం మ్యూల్‌ బ్యాంక్‌ అకౌంట్లనే వినియోగిస్తుంటాయని తెలిపారు. పందెం డబ్బు మొత్తం ఆయా అకౌంట్ల నుంచి క్రిప్టో వ్యాలెట్ల ద్వారా ఎలాంటి పన్ను చెల్లింపులు లేకుండా దేశం దాటేస్తుందని పేర్కొన్నారు.

ఇదంతా చట్ట విరుద్ధం
తెలంగాణ, ఏపీతో సహా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బెట్టింగ్, జూదం చట్టవిరుద్ధం. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం–2000, ఇన్మర్మేషన్‌ టెక్నాలజీ రూల్స్‌–2021 ప్రకారం ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ అనేది జూదంగా పరిగణిస్తారు. యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసేందుకు వీలుగా ఏపీకే ఫైల్స్‌ను అందుబాటులో ఉంచుతారు. 

డోన్‌లోడ్‌ చేసు­కునే క్రమంలో ఫోన్‌ కాంటాక్ట్‌లు, ఇతరత్రా పర్మిషన్స్‌ను అనుమతించాలని కోరతారు. పొరపాటున యాక్సెస్‌ చేయగానే హానికర సాఫ్ట్‌వేర్‌లు మొబైల్‌లో డౌన్‌లోడ్‌ అయిపో­తాయి. దీంతో మన ఫోన్‌ హ్యాక్‌ అయిపో­తుంది. సైబర్‌ నేరాల బారిన పడే ప్రమా­దం ఉందని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

రూ.100 నుంచి రూ.10 లక్షల వరకూ పందెం..
రూ.100 నుంచి రూ.10 లక్షల వరకు పందేం వేయవచ్చు. టెలిగ్రాం, వాట్సాప్‌ వంటి ఇన్‌స్టంట్‌ మెసేజ్‌ యాప్‌ల ద్వారా ఈ బెట్టింగ్‌లు ఎక్కువగా జరుగుతుంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోని పలు కీలకమైన రాష్ట్రాల్లో  ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో ఫ్యాన్సీ పందేలుగా పేర్కొంటూ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాయి. ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఒంటరిగా ఎన్ని సీట్లు సాధిస్తాయి? రాష్ట్రాల వారీగా ఆయా పార్టీలు కూటమితో కలిసి ఎన్ని సీట్లు గెలుస్తాయి? .. ఇలా విభాగాల వారీగా పందేలు నిర్వహిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement