చెమటోడ్చాల్సిందే! 12 కీలక రాష్ట్రాల్లో పేలవంగా కాంగ్రెస్‌ పరిస్థితి | Sakshi
Sakshi News home page

చెమటోడ్చాల్సిందే! 12 కీలక రాష్ట్రాల్లో పేలవంగా కాంగ్రెస్‌ పరిస్థితి

Published Wed, Apr 17 2024 2:25 AM

congress party lost 232 seats out of 247 seats - Sakshi

12 కీలక రాష్ట్రాల్లో పేలవంగా కాంగ్రెస్‌ పరిస్థితి

247 సీట్లకుగాను 232 చోట్ల పార్టీ ఓటమి

ఈ రాష్ట్రాల్లో 93 శాతం సీట్లు సాధించిన ఎన్డీఏ కూటమి

ఢిల్లీ, గుజరాత్, రాజస్తాన్, హరియాణా, హిమాచల్, ఉత్తరాఖండ్‌లలో ఖాతా తెరవక హస్తం డీలా

లోక్‌సభ ఎన్నికల రణక్షేత్రంలో బీజేపీతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైన కాంగ్రెస్, తన కూటమి పక్షాలకు క్షేత్రస్థాయి పరిస్థితులు, గత ఎన్నికల ఫలితాలు నీడలా వెంటాడుతున్నాయి. అత్యంత కీలకమైన రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర ఓటమి పరాభవాన్ని ఎదుర్కొంది. 247 స్థానాలున్న 12 రాష్ట్రాల్లో కేవలం ఏడు శాతం ఓట్లనే ఒడిసిపట్టగలిగింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో మళ్లీ పూర్వవైభవాన్ని సాధించడం కాంగ్రెస్‌కు తలకు మించిన భారంలా తయారైంది. ఇక్కడ సీట్లు పెంచుకుంటే కానీ అధికారం దక్కే అవకాశం లేకపోవడంతో ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలు కాళ్లకు బలపం కట్టుకుని మరీ విస్తృతస్థాయి ప్రచారం చేస్తున్నారు. 

బీజేపీ హవాకు బ్రేకులు వేయాల్సిందే
2019 ఎన్నికల్లో కీలక రాష్ట్రాలైన గుజరాత్, మహారాష్ట్ర, బిహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్తాన్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ వంటి రాష్ట్రాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాల హవా కొనసాగింది. ముఖ్యంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాల చాణక్యం పనిచేయడంతో గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, హరియాణా, హిమాచల్, ఉత్తరాఖండ్‌లలో బీజేపీ ఒంటరిగానే క్లీన్ స్వీప్‌ చేసింది. మొత్తంగా ఈ 12 రాష్ట్రాల పరిధిలో 247 లోక్‌సభ స్థానాలుండగా, బీజేపీ, దాని మిత్రపక్షాలు 232 చోట్ల విజయపతాక ఎగరేశాయి. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు అంతా కలిసి కేవలం 15 చోట్ల గెలుపు అందుకున్నాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లో తన సత్తా చూపేందుకు కాంగ్రెస్‌ తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఇటీవలే ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్  ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితులే కనిపిస్తున్నాయి.

29 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం ఒకే స్థానంలో గెలిచింది. ఇటీవలి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 230 సీట్లలోగాను బీజేపీ 164 సీట్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ 65 స్థానాలకే పరిమితం కావడం ఆ పార్టీకి చిక్కులు తేనుంది. రాజస్థాన్ లో పాతిక సీట్లుంటే హస్తం పార్టీ కనీసం ఒక్క చోట కూడా గెలవలేదు. తాజాగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లకుగాను 69 స్థానాలకే పరిమితమై అధికారం కోల్పోవడంతో కాంగ్రెస్‌కు కొత్త సవాళ్లు ఎదురుకానున్నాయి. గత ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో 11 స్థానాలకుగాను కాంగ్రెస్‌ కేవలం 2 చోట్ల గెలిచింది.

తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటమి పార్టీని తీవ్రంగా కలవరపెడుతోంది. బీజేపీని ఎదుర్కొనేందుకు ఇప్పటికే ‘ఇండియా’ కూటమిగా ఏర్పడ్డ విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి, పరస్పర సహకారంతో ముందుకెళ్తే తప్ప కేంద్రంలో అధికార పీఠం దక్కదు. అందుకే ఈ రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను సాధించేందుకు కాంగ్రెస్‌ అగ్రనేతలు విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో రాహుల్‌ గాంధీ, ప్రియాంక 16 పర్యటనలు చేశారు. రాజస్థాన్ లో 14 చోట్ల సుడిగాలి పర్యటనలు చేసి సభల్లో పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.

చేజారుతున్న నేతలతో కొత్త తలనొప్పులు
గుజరాత్‌లో బీజేపీని ఎదురించడం కాంగ్రెస్‌కు సాధ్యమయ్యేలా లేదు. మోదీ సొంత రాష్ట్రంలో 26 ఎంపీ స్థానాలకుగాను కనీసం ఐదు స్థానాలైన గెల్చుకోవాలని కాంగ్రెస్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా శ్రమిస్తున్నా, అక్కడ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటం పార్టీని ఇబ్బందికరంగా మారింది. బిహార్‌లో తమ కూటమి నుంచి జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌ వైదొలగడంతో కాంగ్రెస్‌ కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. ఇక్కడ ఆర్‌జేడీతో పొత్తుతో ముందుకెళుతున్నా కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయి పరిస్థితులు అంత అనుకూలంగా లేవనే వార్తలు వినవస్తున్నాయి.

కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సిద్ధార్థ్‌ సౌరవ్, మురారీ గౌతమ్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇదే దారిలో ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బిహార్‌ మాజీ అధ్యక్షుడు అనిల్‌శర్మ ఇటీవలే కమలదళంలో చేరిపోయారు. మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే), శరద్‌పవార్‌ ఎన్ సీపీలతో కలిసి కాంగ్రెస్‌ బరిలోకి దిగింది. మహారాష్ట్రలోని 41 స్థానాల్లో ఇండియా కూటమి 10 స్థానాలకు మించి తమ ఖాతాలో వేసుకోవడం అసాధ్యంగా తోస్తోంది.

చీలిక తెచ్చి పార్టీని అజిత్‌ పవార్‌ హస్తగతం చేసుకోవడం, శివసేన సైతం చీలికవర్గం నేత, ముఖ్యమంత్రి ఏక్‌నా«థ్‌ షిండే వశం కావడం, హిందూత్వ భావజాలం రాష్ట్రంలో తీవ్రం కావడం, అశోక్‌ చవాన్, మిలింద్‌ దేవ్‌రా, బాబా సిధ్ధిఖీ వంటి సీనియర్లు పార్టీని వీడటం వంటి పరిణామాలు కాంగ్రెస్‌కు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి.  హరియాణాలో మాజీ మంత్రి సావిత్రి జిందాల్‌ రాజీనామా, మాజీ ముఖ్యమంత్రి భూపేందర్‌ సింగ్‌తో పీసీసీ అధ్యక్షుడు ఉదయ్‌ భాన్  కుమ్ములాటలు పార్టీకి కొత్త ఎన్నికల పరీక్ష పెడుతున్నాయి. ఢిల్లీలో 7 స్థానాలకుగాను ఆమ్‌ ఆద్మీ పార్టీతో పొత్తు కారణంగా కేవలం 3 సీట్లకే కాంగ్రెస్‌ పరిమితం అయింది. –సాక్షి, న్యూఢిల్లీ 

Advertisement
Advertisement