‘కపటనీతికి మారుపేరు కాంగ్రెస్!’.. కేటీఆర్‌ ఫైర్‌ | Sakshi
Sakshi News home page

‘కపటనీతికి మారుపేరు కాంగ్రెస్! అసలు రంగు బయటపడుతోంది’

Published Fri, Apr 19 2024 10:00 AM

KTR Slams on congress party over all poll guarantees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ కపటనీతికి మారుపేరు అని బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. కానీ తమ 120 రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేయడం ప్రారంభించిందని మండిపడ్డారు.

‘ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు రూ. 4,000 నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక.. అసలు అటువంటి హామీ ఏమివ్వలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట మార్చారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని వార్తాపత్రికల మొదటి పేజీలో తమ జాబ్ క్యాలెండర్‌ గురించి ప్రకటనలు ఇచ్చింది. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన 30 వేల ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలను ఇచ్చి ఆ ఉద్యోగాలను నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటోంది కాంగ్రెస్.

అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ తాము ఇచ్చిన హామీపై నిస్సిగ్గుగా యూ టర్న్ తీసుకుంటూ.. కాంగ్రెస్ ప్రభుత్వం టెట్ పరీక్ష ఫీజును రూ. 400 నుండి రూ. 2000లకు (2 పేపర్లకు) పెంచింది.  బల్మూరి వెంకట్ వంటి కాంగ్రెస్ నాయకులను ఎన్నో కోర్టు కేసులు వేసి.. అనేక పోటీ పరీక్షలు రద్దవ్వడానికి కారణమయ్యారు. నిరుద్యోగుల ఉసురు పోసుకుని, ప్రతిఫలంగా వెంకట్ ఎమ్మెల్సీ పదవిని అందుకున్నాడు. కానీ.. ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులను మాత్రం దిక్కుతోచని స్థితిలో వదిలేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. తమని నట్టేట ముంచిన కాంగ్రెస్‌ పార్టీకి నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది’ అని ‘ఎక్స్‌’వేదికగా మండిపడ్డారు.

Advertisement
Advertisement