'స్టార్‌ హీరోలు కథ గురించి పట్టించుకోవట్లే'.. | Kollywood Movie The Proof Audio Launch Programme | Sakshi
Sakshi News home page

'కొందరు మేకింగ్‌ తెలియకుండానే డైరెక్షన్‌ చేస్తున్నారు'

Published Thu, May 2 2024 1:26 PM | Last Updated on Thu, May 2 2024 2:51 PM

Kollywood Movie The Proof Audio Launch Programme

ప్రతిభ అనేది ఎవరబ్బ సొత్తు కాదు. ప్రతిభావంతులు తమ సత్తాను ఏ రంగంలోనైనా చాటుకోవచ్చు. అలా నృత్య దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్న రాధిక ఇప్పుడు మోగాఫోన్‌ పట్టారు. ఆమె తెరకెక్కించిన చిత్రం ది ప్రూఫ్‌. గోల్డెన్‌ స్టూడియోస్‌ పతాకంపై గోమతి నిర్మించిన ఈ చిత్రంలో నటి సాయి ధన్సిక ప్రధాన పాత్రను పోషించింది. తాజాగా ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ చెన్నైలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్‌వీ.ఉదయకుమార్, నటుడు, నిర్మాత కే.రాజన్, దర్శకుడు మిష్కిన్, యూకీ సేతు, గీత రచయిత స్నేహన్, నటుడు రోబో శంకర్, సంతోష్‌ ప్రతాప్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్‌వీ ఉదయకుమార్‌ మాట్లాడుతూ ప్రూఫ్‌ చిత్రంలో అన్నీ అంశాలు బాగున్నాయన్నారు. ఇది ఒక క్లాస్‌ దర్శకురాలు చేసినట్లుగా ఉందన్నారు. దర్శకురాలు రాధిక చాలా సింపుల్‌గా ఉంటారని.. అయితే చాలా ప్రతిభావంతురాలని ప్రశంసించారు. ఇప్పుడు సినిమా ట్రెండ్‌ మారిపోయిందన్నారు. దర్శకులు నటిస్తున్నారని.. నృత్యదర్శకులు, నటులు, సంగీత దర్శకులు కూడా దర్శకత్వం వహిస్తున్నారన్నారు. సినిమా అందరినీ ఆదరిస్తుందని పేర్కొన్నారు.

అయితే మేకింగ్‌ స్టైల్‌ తెలియకుండానే కొందరు దర్శకత్వం వహిస్తున్నారని ఆయన తెలిపారు. అలాంటి కొన్ని చిత్రాలు హిట్‌ అయినంత మాత్రాన.. అది సరైన విధానం అని తాను చెప్పలేనన్నారు. ఎక్కడ ఏ షాట్‌ ఉండాలి.. ఇంటర్వెల్‌ ఎక్కడ ఉండాలి అన్న విషయాలను సహాయ దర్శకులు తెలుసుకోవాలన్నారు. ఇప్పుడు మాదక ద్రవ్యాల నేపథ్యమే సరికొత్త ట్రెండ్‌ అని పేర్కొన్నారు. దానితోనే మనం సంసాదించుకుంటున్నామన్నారు. ఇప్పుడు స్టార్‌ హీరోలు కథల గురించి పట్టించుకోవడం లేదని కాంబినేషన్‌ సరిగా సెట్‌ అయితే చాలు అనుకుంటున్నారన్నారు. ఈ మూవీ డైరెక్టర్‌ రాధికకు ఒక్క విషయం చెప్పదలచుకున్నానని.. ఇక్కడ చాలా మంది మిమ్మల్ని కన్ఫ్యూజ్‌ చేయాలనుకుంటారని, వారి గురించి పట్టించుకోకుండా ట్రెండ్‌కు తగినట్లుగా  చిత్రాలు చేయాలని సూచించారు. కాగా.. ఈ చిత్రంలో రుద్వీర్‌ వదన్, మెమ్‌గోపీ, రిత్విక, ఇంద్రజ ముఖ్యపాత్రలు పోషించారు. దీపక్‌ సంగీతం అందించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement