నితీష్ కుమార్‌పై లాలూ కూతురు ఫైర్ | Lalu Yadav Daughter Jibe At Nitish Kumar Amid Dynastic Politics Row, Details Inside - Sakshi
Sakshi News home page

నితీష్ కుమార్‌పై లాలూ కూతురు ఫైర్

Published Thu, Jan 25 2024 4:07 PM

Lalu Yadav Daughter Jibe At Nitish Kumar Amid Dynastic Politics Row - Sakshi

పాట్నా: బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. వంశపారంపర్య రాజకీయాలపై సీఎం నితీష్‌ కుమార్ వ్యాఖ్యలపై ర్జేడీ అధినేత లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ఘాటుగా స్పందించారు. కొందరు తమ సొంత లోపాలను చూసుకోలేరు.. ఇతరులపై బురద జల్లుతారు అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. 

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషికి గాను కర్పూరీ ఠాకూర్‌కు మరణానంతరం కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో సత్కరించింది. ప్రభుత్వ చర్యను స్వాగతించిన నితీష్ కుమార్.. కర్పూరి ఠాకూర్ తన కుటుంబ సభ్యులను పార్టీలో ఎన్నడూ తీసుకురాలేదని చెప్పారు. దివంగత నేత చూపిన బాటలోనే తమ పార్టీ పయనించిందని నితీష్ కుమార్ అన్నారు.  జేడీయూ కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు.  బీహార్‌లోని మహాకూటమి (మహాగత్‌బంధన్‌) ప్రభుత్వంలో జేడీయూకి మిత్రపక్షంగా ఉన్న ఆర్జేడీని ఉద్దేశించి పరోక్షంగా నితీష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలకు ఆర్జేడీ నేత లాలూ కుమార్తె ఘాటుగా స్పందించారు.  కొందరు తమ సొంత లోపాలను చూసుకోలేరు.. ఇతరులపై బురద జల్లుతారు అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. నితీష్ కుమార్ పేరును ప్రస్తావించనప్పటికీ.. అర్హత లేని వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఏం ప్రయోజనం? ఒకరి ఉద్దేశ్యంలో మోసం ఉన్నప్పుడు ఆ పద్ధతిని ఎవరు ప్రశ్నించగలరు? అంటూ ట్వీట్ చేశారు. ఆ వెంటనే ఆ ట్వీట్‌లను డిలీట్ చేశారు.

ఇదీ చదవండి: అస్సాంలో రాహుల్ గాంధీపై నమోదైన కేసు సీఐడీకి బదిలీ

Advertisement
 
Advertisement
 
Advertisement