
11న టీడీపీ శాసనసభాపక్ష సమావేశం
మంత్రివర్గ కూర్పుపై ఊహాగానాలు
తొలి విడతలో కొందరికే అవకాశం
సాక్షి, అమరావతి : రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈనెల 12వ తేదీన చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తొలుత 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించినా అదేరోజు ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తుండడం.. ఆ కార్యక్రమానికి హాజరవ్వాల్సి వుండడంతో చంద్రబాబు తన కార్యక్రమాన్ని 12కు వాయిదా వేసుకున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఆ రోజున రాజధాని ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి ముందు 11వ తేదీన టీడీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును టీడీపీ పక్ష నేతగా ఎన్నుకుంటారు. చంద్రబాబును టీడీఎల్పీ నేతగా ఎన్నుకుని గవర్నర్‌కు నివేదించాక 12న ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది.
తొలి విడతలో 10 మందికి మంత్రులుగా అవకాశం..
చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన రోజే తొలి విడతగా కొందరిని మంత్రులుగా ప్రమాణం చేయించనున్నట్లు తెలిసింది. సుమారు పది మందికి తొలి విడతలో అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ నుంచి ఐదారుగురు, జనసేన, బీజేపీ నుంచి నలుగురు ఆ జాబితాలో ఉండే అవకాశం ఉంది. తొలి విడతలో కింజరాపు అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, చింతకాయల అయ్యన్నపాత్రుడు, పి.నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు వంటి వారికి అవకాశం ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
జనసేన నుంచి పవన్‌కళ్యాణ్ మంత్రివర్గంలో చేరతారా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. మంత్రివర్గంలో చేరితే చంద్రబాబుతోపాటే ఆయన ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. అలాగే, నాదెండ్ల మనోహర్ కూడా తొలివిడతలోనే ఛాన్స్ దక్కించుకోనున్నట్లు సమాచారం. బీజేపీ తరఫున సుజనాచౌదరికి తొలి విడతలోనే మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం ఖాయమని చెబుతున్నారు. మంత్రి పదవులకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో తొలి విడతలో ముఖ్యులకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కొద్ది సమయం తీసుకుని సామాజిక సమీకరణలు, సీనియారిటీ, జిల్లాల ప్రాతిపదికన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది.
టీడీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి?
మరోవైపు.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల్లో ప్రధాన పార్టీగా ఉండడంతో టీడీపీ లోక్‌సభ స్పీకర్ పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, బీజేపీ అగ్రనేతలు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా స్పీకర్ పదవిని తన వద్దే ఉంచుకోవాలని బీజేపీ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ చంద్రబాబు ఆ పదవి కావాలని గట్టిగా పట్టుబడితే ఏమైనా నిర్ణయం మారే అవకాశం ఉందంటున్నారు.
కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ ఐదుకి పైగా స్థానాలు కోరుతుండడం, కీలకమైన జల్‌శక్తి, రవాణా వంటి శాఖలు అడుగుతుండడంతో దానిపైనా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ పౌర విమానయాన, ఉక్కు శాఖలను టీడీపీకి ఇవ్వాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. శుక్రవారం జరిగే ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం తర్వాత దీనిపై ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
అసెంబ్లీ స్పీకర్‌గా ‘ఆనం’..?
ఇదిలా ఉంటే.. అసెంబ్లీ స్పీకర్‌గా ఆనం రామనారాయణరెడ్డిని నియమించే యోచనలో టీడీపీ ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఆయన ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనైతే సభను హుందాగా నడిపిస్తారనే ఆలోచన ఉన్నట్లు భావిస్తున్నారు. ‘ఆనం’ కాదనుకుంటే గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కళా వెంకట్రావుకు అవకాశం ఇవ్వవచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ పదవి తనకు కావాలని ఉండి నియోజకవర్గం నుంచి గెలిచిన కనుమూరి రఘురామకృష్ణరాజు కోరుతున్నట్లు ప్రచారం జరుగుతున్నా అందుకు చంద్రబాబు అంత సుముఖంగా లేరని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment