పలుచోట్ల శిలాఫలకాలు, వైఎస్సార్ విగ్రహాలపై దాడి
ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు కూల్చివేత
సచివాలయాలపై అక్కసుతో పేట్రేగిన వైనం
తెనాలిలో అభివృద్ధి పనులకు మోకాలడ్డు
విజయనగరంలో ప్రభుత్వ ఆస్పత్రి వద్ద రచ్చ
సంకురాత్రిపాడులో బోర్డులు, శిలాఫలకాలు, దిమ్మెలు ధ్వంసం
సచివాలయంపై టీడీపీ, జనసేన, బీజేపీ జెండాల ఏర్పాటు
తెనాలి అర్బన్/బైరెడ్డిపల్లె (చిత్తూరు జిల్లా)/మదనపల్లె /విజయనగరం ఫోర్ట్/నాడెండ్ల/ తాడికొండ: అధికారం వచ్చిందన్న సంతోషం ముసుగులో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై ఓ వైపు దాడులు కొనసాగిస్తూ ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేస్తున్నారు. శిలాఫలకాలు, సచివాలయాల బోర్డులను పగులగొడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ దాడులను ఆపాల్సిన ఆ పార్టీ పెద్దలు చోద్యం చూస్తుండటం పట్ల ప్రజలు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకేనా అధికారం కట్టబెట్టిందంటూ మండిపడుతున్నారు. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో కొందరు అధికార పార్టీ నాయకులు విధ్వంసానికి దిగారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ధ్వంసం చేయడమే కాకుండా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై బుధవారం రాళ్లతో దాడి చేశారు. చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్‌లో నాడు–నేడు పథకం కింద అదనపు తరగతి గదులు నిర్మించారు. దానిని అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కూటమి గెలుపొందడంతో కొందరు అధికార పార్టీ నాయకులు బుధవారం రాత్రి పాఠశాలలోనికి వెళ్లి శిలాఫలకాన్ని పగలకొట్టారు.
రణరంగచౌక్‌లో ఉన్న వైఎస్సార్ విగ్రహంపై రాళ్లతో దాడి చేశారు. కొద్ది రోజుల క్రితం విగ్రహం సమీపంలో టైల్స్, రిటైనింగ్ వాల్స్ నిర్మించారు. దాదాపు 80 శాతం పని పూర్తయింది. మిగిలిన పని పూర్తి చేసేందుకు సదరు కాంట్రాక్టర్ సిద్ధమయ్యారు. ఇంతలో ఎన్నికల ఫలితాలు రావడం.. తెనాలి ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్ గెలవడం జరిగింది. దీంతో కొందరు టీడీపీ నాయకులు నిర్మాణ పనులు జరపడానికి వీలులేదని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులపై హుకుం జారీ చేశారు. దీంతో అధికారులు సదరు కాంట్రాక్టర్‌ను ఆ పనులు పూర్తి చేయొద్దని అడ్డుకుంటున్నారు.
వెల్‌నెస్ సెంటర్ బోర్డు ధ్వంసం
పలమనేరు నియోజకవర్గం బైరెడ్డి మండలంలోని కంభంపల్లె సచివాలయ పరిధిలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రాల శిలాఫలకాలను, వెల్‌నెస్ సెంటర్ బోర్డును టీడీపీ కార్యకర్తలు బుధవారం రాత్రి ధ్వంసం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలపై జగన్ బొమ్మ కనిపిస్తే ధ్వంసం చేస్తాం అంటూ దుర్భాషలాడుతూ హంగామా సృష్టించారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించామనే గర్వంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దాడులు ఆపకపోతే మొదట్లోనే చెడ్డపేరు రావడం ఖాయం అని హెచ్చరిస్తున్నారు.
సిమెంట్ బల్లలు ధ్వంసం
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం సంకురాత్రిపాడు గ్రామంలో బుధవారం రాత్రి టీడీపీ వర్గీయులు గ్రామ సచివాలయం వద్ద బీభత్సం సృష్టించారు. సచివాలయం భవనంపైకి ఎక్కి.. బోర్డులు, శిలాఫలకాలను ధ్వంసం చేశారు. ట్రాక్టర్‌తో దిమ్మెలు కూలగొట్టారు. బొడ్డురాయి సెంటర్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ జెండాను చింపేశారు. సచివాలయం సమీపంలో దాతలు ఏర్పాటు చేసిన సిమెంటు బల్లలను ధ్వంసం చేశారు.
సచివాలయంపై టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు కట్టారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో ఏర్పాటు చేసిన ఉపాధి హామీ పథకం దిమ్మెను సైతం ధ్వంసం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేరుపై పేడ అలికారు. నాదెండ్ల మండలంలోని ఇర్లపాడు గ్రామం ఎస్సీ కాలనీలో టీడీపీ వర్గీయులు గొడ్డళ్లు, కర్రలతో వైఎస్సార్ విగ్రహం తల, చేతులను విరగ్గొట్టారు. బైక్‌లకు టీడీపీ జెండాలు కట్టుకుని బాణసంచా కాలుస్తూ కాలనీలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు.
పోలీసుల సాక్షిగా విగ్రహాల ధ్వంసం
గుంటూరు జిల్లా తుళ్లూరులో తెలుగుదేశం పార్టీ నాయకుల వికృత చేష్టలు, విగ్రహాల విధ్వంసాల పరంపర కొనసాగుతూనే ఉంది. పోలీసు కాపలా ఉన్నప్పటికీ వారి ఎదుటే తుళ్లూరులో రెండు విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. తుళ్లూరు గ్రామానికి చెందిన ఆలూరి శివ, మూల్పూరి నరేష్ అనే టీడీపీ నాయకులు అర్ధరాత్రి తుళ్లూరు తులసీ థియేటర్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం తల పగలగొట్టి కాలువలో పడవేశారు.
అనంతరం ఎస్సీ కాలనీలో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్దకు వచ్చి సుత్తితో ధ్వంసం చేస్తుండగా ఎస్సీ కాలనీకి చెందిన వారు అడ్డుకొనేందుకు యత్నించగా వారిపై దాడి చేశారు. ఈ తంతు అంతా పోలీసులు కాపలాగా ఉన్నప్పుడే జరగడం గమనార్హం. ప్రశ్నించిన వారిపై విచక్షణా రహితంగా దాడులకు దిగడంతో ఇరు వర్గాల మధ్య వివాదం ముదిరి తోపులాట జరిగింది. అప్పుడు తీరిగ్గా పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.
ఆస్పత్రి బోర్డు తొలగింపు
విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి నేమ్ బోర్డును గురువారం సాయంత్రం టీడీపీ కార్యకర్తలు తొలగించారు. ఈ ఘటనను చూసిన ఆస్పత్రికి వచ్చిన రోగులు, వైద్య సిబ్బంది అవాక్కయ్యారు. అధికారం వచ్చి రెండు రోజులు కాకముందే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంతలా దౌర్జన్యానికి దిగడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు మాట్లాడుతూ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
పార్కు బోర్డ్ పగులగొట్టిన దుండగులు
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని వైఎస్సార్ సొసైటీ కాలనీలోని మున్సిపల్ పార్క్ నేమ్ బోర్డ్‌ను గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. గురువారం ఉదయం నేమ్ బోర్డ్ ధ్వంసం చేసిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులు, మీడియాకు సమాచారం అందించారు. నేమ్‌బోర్డ్‌లో వైఎస్సార్ పేరును మాత్రమే చెరిపివేసి, మిగిలిన అక్షరాలను అలాగే ఉంచడంపై ప్రజలు అనుమానం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment