అరాచకాన్ని అరికట్టండి | TDP Supporters Attacked YSRCP in Andhra pradesh | Sakshi
Sakshi News home page

అరాచకాన్ని అరికట్టండి

Published Fri, Jun 7 2024 6:08 AM | Last Updated on Fri, Jun 7 2024 6:08 AM

TDP Supporters Attacked YSRCP in Andhra pradesh

ఏపీలో విధ్వంసకాండపై రాష్ట్రపతి, గవర్నర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై యథేచ్ఛగా దాడులు

తక్షణం జోక్యం చేసుకుని శాంతి భద్రతలు కాపాడాలని వినతి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ మద్దతుదారులు, సాను­భూతిపరులపై యథేచ్ఛగా కొనసాగుతున్న దాడులు, హింసాకాండను తక్షణం అరికట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్‌ ఎస్‌.­అబ్దుల్‌ నజీర్‌ను పార్టీ కోరింది. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల విడుదల అనంతరం కొత్త ప్రభు­త్వం ఏర్పడుతున్న వేళ అల్లరి­మూకలు సంధి కాలాన్ని ఎంపిక చేసుకుని విధ్వంసాలకు తెగబ­డటం వెనుక పక్కా కుట్ర ఉందని స్పష్టం చేసింది.

అరాచక శక్తులు చెలరేగుతున్నా పోలీసు యంత్రాంగం ఉదాశీనంగా వ్యవహరించడం పరిస్థితిని మరింత దిగజారుస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించేలా తక్షణం కఠిన చర్యలకు ఆదేశించాలని కోరింది. ఈమేరకు రాష్ట్రపతి, గవర్నర్‌కు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు ఎస్‌.నిరంజన్‌ రెడ్డి గురువారం విడివిడిగా లేఖలు రాశారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను అరికట్టి ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించాలని డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాను మరో లేఖ ద్వారా కోరారు. ఆ లేఖల్లో పేర్కొన్న వైఎస్సార్‌సీపీ ప్రధానంగా ప్రస్తావించిన  అంశాలు ఇవీ..

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, పిల్లలపై దాడులు..
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులపై అసాంఘిక శక్తులు యథే­చ్చగా హింసాకాండకు పాల్పడుతున్నాయి. ఎన్ని­కల్లో వైఎస్సార్‌ సీపీకి మద్దతు తెలిపిన వారిని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నాయి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలు, పిల్లలపై దాడులకు దిగడంతోపాటు ఇక మీదట మరింత తీవ్ర పరిణామాలను ఎదు­ర్కోవాల్సి వస్తుందని బహిరంగంగానే హెచ్చరిస్తు­న్నాయి. బాధిత కుటుంబాలు ప్రాణ భయంతో ఇళ్లు, గ్రామాలను విడిచిపెట్టి వెళుతున్నాయి. వైఎస్సార్‌సీపీకి చెందినవారి ఆస్తులపై దాడులు చేస్తూ జీవనాధారాన్ని నాశనం చేస్తుండటంతో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. 

పోలీసు శాఖ నిర్లిప్తత
అల్లరి మూకలు దాడులకు పాల్పడుతున్న ఉదంతాలు ప్రధాన మీడియాతోపాటు సోషల్‌ మీడి­యాలో ప్రసారమవుతున్నా పోలీసు యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందనా లేదు. పరిస్థితి తీవ్రతను ఏమాత్రం పట్టించుకోకుండా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. గత 24 గంటల్లో దాడులు, దౌర్జన్యాలు అమాంతం పెరగడం వెనుక పక్కా కుట్ర ఉంది. 

ఇవిగో ఆధారాలు 
వైఎస్సార్‌సీపీనేతలు, కార్యకర్తలు, సానుభూతి­పరు­లపై రౌడీమూకల దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసకాండకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, మీడియాలో ప్రచురితమైన కథనాలను మీకు సమ­ర్పి­స్తున్నాం. వాటిని పరిశీలించి రాష్ట్రంలో యథే­చ్ఛగా సాగుతున్న విధ్వంసకాండ తీవ్ర­తను గుర్తించాలని కోరుతున్నాం. తక్షణం దాడు­లను అరిక­ట్టేలా చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించాలి. శాంతి భద్ర­తలను కాపాడి ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కల్పించండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement