ముగిసిన ప్రచారం.. అక్కడ రేపే పోలింగ్‌ | Mizoram And Chattisgarh Phase 1 Polling Countdown Begins - Sakshi
Sakshi News home page

మిజోరంలో త్రిముఖ పోరు.. ఛత్తీస్‌గఢ్‌లో హోరాహోరీ పోరు!

Published Mon, Nov 6 2023 10:39 AM

Polling Countdown Begins At Mizoram And Chattisgarh Phase 1 - Sakshi

ఢిల్లీ: దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో రేపు(మంగళవారం) ఈశాన్య రాష్ట్రం మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతలో పోలింగ్‌ జరుగనుంది. మిజోరంలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది. దీంతో, ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రంతో తెరపడింది. పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్‌ ప్రభావిత బస్తర్‌ డివిజన్‌లోని ఏడు జిల్లాలు, మరో నాలుగు ఇతర జిల్లాల్లో ఈ 20 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 25 మంది మహిళలతో పాటు మొత్తం 223 మంది అభ్యర్థులు తొలి విడత బరిలో ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగే అవకాశం ఉన్నదని సర్వేలు చెప్తున్నాయి. తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్న 20 స్థానాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 17 సీట్లను కైవసం చేసుకుంది. కాగా, రెండో విడుతలో 70 స్థానాలకు ఈ నెల 17న పోలింగ్‌ జరుగనుంది.

మరోవైపు.. మిజోరంలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్‌ జరుగనుంది. మొత్తం 8.57 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించనున్నారు. ఎన్నికల్లో 174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 1,276 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంతఃరాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దుల్లోని దాదాపు 30 పోలింగ్‌ కేంద్రాలను సున్నితమైనవిగా ఎన్నికల అధికారులు గుర్తించారు. బంగ్లాదేశ్‌, మయన్మార్‌తో సరిహద్దులు పంచుకొనే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మొత్తంగా 3 వేల మంది పోలీసు సిబ్బంది, 5,400 మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించామని తెలిపారు.

మూడు పార్టీల ముమ్మర ప్రచారం మిజోరంలో త్రిముఖ పోటీ నెలకొన్నది. అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌), ప్రతిపక్ష కాంగ్రెస్‌, జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌(జెడ్‌పీఎం) మధ్య ప్రధానంగా పోటీ నెలకొన్నది. అధికారాన్ని నిలబెట్టుకొనేందుకు ఎంఎన్‌ఎఫ్‌ ముమ్మర ప్రచారం చేసింది. అటు మిజోరంలో గత రెండు పర్యాయాలుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. ఈసారి ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉన్నది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో విజయం సాధించి సంచలనం సృష్టించిన జెడ్‌పీఎం పార్టీ ఈసారి ఎన్నికల్లో కింగ్‌ మేకర్‌గా నిలిచి, ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో ఉంది. 

ఇది కూడా చదవండి: అవినీతిపరులంతా బీజేపీలోకే: కేజ్రివాల్‌

Advertisement
 
Advertisement
 
Advertisement