టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరగుతున్న విషయం తెలిసిందే. భార్య నటాషా స్టాంకోవిక్‌తో అతడికి విభేదాలు తలెత్తాయని.. విడాకులే తరువాయి అంటూ వదంతులు వ్యాపించాయి.
ఇప్పటికే నటాషా కోర్టు మెట్లు ఎక్కారని.. విడాకుల కోసం దరఖాస్తు చేయడమే కాకుండా.. భరణంగా హార్దిక్ ఆస్తిలో 70 శాతం పొందనున్నారనే వార్తలు వినిపించాయి. నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి పాండ్యా ఇంటిపేరును తొలగించడం.. వారి పెళ్లి ఫొటోలు కనిపించకుండా పోవడమే ఇందుకు కారణమని గాసిప్‌రాయుళ్లు ప్రచారం చేశారు.
అయితే, తాజాగా నటాషా ట్విస్ట్ ఇచ్చారంటూ మరో ప్రచారం తెరమీదకు వచ్చింది. తమ పెళ్లి ఫొటోలను ఆమె తిరిగి ఇన్‌స్టా ఖాతాలో పునరుద్ధారించారని దాని సారాంశం. నిజానికి విడాకుల రూమర్ల తర్వాత కూడా హార్దిక్ పాండ్యా అకౌంట్‌లో వారి పెళ్లి ఫొటోలు దర్శనమిచ్చాయి. అయితే, తాజాగా నటాషా కూడా వాటిని రీస్టోర్ చేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఏదేమైనా ఇంతగా వార్తల్లో నానుతున్నా ఇటు హార్దిక్ పాండ్యా గానీ.. అటు నటాషా గానీ విడాకుల అంశం ఖండించనూ లేదు. అలాగని అంగీకరించనూలేదు. అయితే, తాజాగా నటాషా తమ వివాహ బంధం పదిలంగా ఉందని చాటేలా ఫొటోలు రీస్టోర్ చేయడం విశేషం.
ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా- నటాషాలపై నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ‘‘సానుభూతి కోసం భలే డ్రామాలు ఆడారు. బాగానే వర్కౌట్ అయింది’’ అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పాండ్యాపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. రోహిత్‌పై వేటు పడటాన్ని జీర్ణించుకోలేక స్టేడియం, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హార్దిక్‌ను ట్రోల్ చేశారు హిట్‌మ్యాన్ ఫ్యాన్స్. ఇక అతడి సారథ్యంలో ముంబై పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలవడంతో ట్రోలింగ్ తారస్థాయికి చేరింది.
ఈ నేపథ్యంలో విడాకుల అంశం తెరమీదకు రాగా.. ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు వస్తుండటంతో సానుభూతి పొందేందుకు హార్దిక్- నటాషా జోడీ నాటకాలాడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా సెర్బియా మోడల్ నటాషాను పెళ్లాడిన హార్దిక్ పాండ్యాకు కుమారుడు అగస్త్య సంతానం. ప్రస్తుతం హార్దిక్ టీ20 ప్రపంచకప్-2024తో బిజీగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment