టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా తరఫున ఓపెనర్‌గా రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి బరిలోకి దిగాలని తారా స్థాయిలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.
అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు తొమ్మిది సార్లు టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లి.. రోహిత్ శర్మతో కలిసి ఒకే ఒక మ్యాచ్‌లో ఓపెనర్‌గా జత కట్టాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లి, రోహిత్ జోడీ చెలరేగిపోయింది.
2022 మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో వీరు కేవలం 54 బంతుల్లోనే 94 పరుగులు జోడించి, భారత ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు. టీ20ల్లో కోహ్లి అప్పటివరకు అడపాదడపా మాత్రమే ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఆ సమయంలో కోహ్లి ఓపెనర్‌గా ఎలా రాణిస్తాడో అని అభిమానులు తెగ టెన్షన్ పడ్డారు.
అయితే అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ కోహ్లి 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. అప్పటికే రెగ్యులర్ ఓపెనర్‌గా స్థిరపడిన రోహిత్ సైతం ఆ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు.
వీరిద్దరితో పాటు సూర్యకుమార్ యాదవ్ (32 నాటౌట్), హార్దిక్ పాండ్యా (39 నాటౌట్) కూడా విజృంభించడంతో ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ చేతులెత్తేయడంతో భారత్ ఆ మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ప్రస్తుతం జరుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో కోహ్లి-రోహిత్ ఓపెనర్లుగా జతకట్టాలని డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ స్కోర్ కార్డు నెట్టింట చక్కర్లు కొడుతుంది. కోహ్లి-రోహిత్ జోడీ ఒక్క మ్యాచ్‌లో జతకడితేనే ఈ స్థాయి విధ్వంసం జరిగింది. అదే వీరిద్దరు ప్రతి మ్యాచ్‌లో ఓపెనర్లు బరిలోకి దిగితే వీరిని ఆపడం సాధ్యమా అని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, ఐపీఎల్‌లో ఓపెనర్‌గా ఇదివరకే ప్రూవ్ చేసుకున్న విరాట్.. అంతర్జాతీయ టీ20ల్లోనూ ఓపెనర్‌గా అదిరిపోయే ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు. విరాట్ టీ20ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన 9 మ్యాచ్‌ల్లో 57.14 సగటున, 161.29 స్ట్రయిక్‌రేట్‌తో 400 పరుగులు చేశాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2024 సీజన్‌లో అరివీర భయంకర ఫామ్‌లో (741 పరుగులతో సీజన్ టాప్ స్కోరర్) ఉన్న కోహ్లి.. రోహిత్‌తో పాటు ఓపెనర్‌గా జతకడితే ఈసారి టీమిండియా ప్రపంచకప్ గెలవడం ఖాయమని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment