పక్కా ప్రణాళికతోనే సీఎం జగన్‌పై హత్యాయత్నం  | Sajjala Ramakrishna Reddy Fires On Pawan Kalyan Over Attack On CM YS Jagan - Sakshi
Sakshi News home page

పక్కా ప్రణాళికతోనే సీఎం జగన్‌పై హత్యాయత్నం 

Published Fri, Apr 19 2024 6:02 AM

Sajjala Ramakrishna Reddy Fires On Pawan Kalyan - Sakshi

బొండా ఉమా పాత్ర ఉంటే దర్యాప్తులో తేలుతుంది 

డ్రామా అంటున్న పవన్‌ కళ్యాణ్‌ రాయితో కొట్టించుకోగలరా? 

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి 

యూఎస్‌ఏ ఎన్నారైలు సమకూర్చిన ప్రచార రథాలు ప్రారంభం 

సాక్షి, అమరావతి: పక్కా ప్రణాళికతోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై విజయవాడలో హత్యాయత్నానికి తెగబడ్డారని వైఎస్సార్‌సీసీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాము ఆది నుంచి చెబుతున్నదే పోలీసుల దర్యాప్తులో కూడా తేలిందని అన్నారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యంగా గురిపెట్టి రాయితో కొట్టారని, ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్‌ ఎడమ కంటి కనుబోమ్మకు తగిలి, పక్కనే ఉన్న మాజీ మంత్రి వెలంపల్లి కంటికి తగిలిందన్నారు. సీఎం జగన్‌కు కొద్దిగా కింద కణతకు తగిలి ఉంటే ప్రాణాలకు ప్రమాదం జరిగేదని చెప్పారు.

ఇదంతా డ్రామా అంటున్న పవన్‌ కళ్యాణ్‌ కానీ టీడీపీ నేతలు కానీ గురిపెట్టి రాయితో కొట్టించుకోగలరా అని నిలదీశారు. సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో బొండా ఉమాను ఎందుకు ఇరికిస్తారని, ఇందులో ఆయన పాత్ర ఉంటే దర్యా­ప్తులో తేలుతుందని చెప్పారు. నేరం చేసిన వాడు ఎవరైనా అతన్ని ఇరికించాలని చూస్తున్నారని చెబితే దానిలో హేతుబద్ధత ఉంటుందా అని నిలదీశారు. పోలీసుల దర్యాప్తులో బొండా ఉమా లేదా అంతకంటే పైన ఉన్నవారు లేదా దిగునవ ఉన్న వాళ్ల పాత్ర ఉన్నట్లు తేలితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని చెప్పారు. ముఖ్య­మంత్రి అంతటి వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని సామాన్యుడు ఎవరైనా గురిపెట్టి రాయితో కొట్టడానికి సాహసిస్తారా అని ప్రశ్నించారు. అందుకే ఈ హత్యాయత్నం వెనుక కుట్ర ఉందన్నారు. దాడి చేసిన వారి వెనుక ఎవరైనా పెద్ద వ్యక్తి ఉండి ఉండాలని, లేదంటే రెచ్చగొట్టైనా ఉండాలని అన్నారు.  

జగన్‌ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం 
మరోసారి చారిత్రక విజయంతో రాష్ట్రంలో అధికారంలోకి వచి్చ, పేదింటి భవిష్యత్తును, రాష్ట్రాన్ని మరింత గొప్పగా మార్చేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్న మహాయజ్ఞంలో ఎన్నారైలు భాగస్వాములవడం హర్షణీయమని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రచారం కోసం యూఎస్‌ఏకి చెందిన ఎన్నారైలు సమకూర్చిన 13 ప్రచార రథాలను తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద సజ్జల గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్, జగన్‌ అభిమానులు వీటిని స్వచ్ఛందంగా అందించారని చెప్పారు.

రాష్ట్రంలో 58 నెలలుగా జరిగిన సంక్షేమం, అభివృద్ధి మరో ఐదేళ్ళు కావాలని ప్రజలతోపాటు ఎన్నారైలు కూడా కోరుకుంటున్నారని చెప్పారు. సీఎం జగన్‌ విజయాన్ని తమ విజయంగా అనుకుంటున్న ఎన్నారైలను చల్లా మధు బృందం సమన్వయం చేసి, వారు సమకూర్చిన ఈ వాహనాలను ఇక్కడకు తెచ్చారన్నారు. సీఎం జగన్‌ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్ట, అగ్రవర్ణ పేదలకు జరిగిన మేలును ఈ రథాలలో ప్రదర్శిస్తామన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించబోతోందని, మరోసారి ముఖ్యమంత్రిగా సీఎం జగన్‌ ప్రమాణస్వీకారం చేస్తారనే ఊపు రాష్ట్రమంతటా కనిపిస్తోందని చెప్పారు.

Advertisement
Advertisement