ఆ ఫార్చూనర్‌ కందికుంటదే! | Possibility of issuing EC notices to Kandikunta Venkataprasad | Sakshi
Sakshi News home page

ఆ ఫార్చూనర్‌ కందికుంటదే!

Published Thu, May 2 2024 5:32 AM | Last Updated on Thu, May 2 2024 5:32 AM

Possibility of issuing EC notices to Kandikunta Venkataprasad

ప్రధాన అనుచరుడు రాంబాబు ఆధ్వర్యంలో రూ.2 కోట్ల తరలింపు యత్నం! 

అతడితోపాటు మరో వ్యక్తి హస్తం ఉన్నట్లు అనుమానం  

కందికుంటకు ఈసీ నోటీసులు జారీచేసే అవకాశం 

అనంతపురం: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ను రూ.2 కోట్ల వ్యవహారం ఇరకాటంలో పడేసింది. అనంతపురం నుంచి కదిరికి ఆయన కారులో తరలిస్తున్న సుమారు రూ.2 కోట్లను మంగళవారం పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అభ్యర్థి కారులోనే నగదును తరలిస్తుండటం చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో తనకు అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో కందికుంట ప్రలోభాలకు తెరతీశారు.

డబ్బు ఎరవేసి ఓట్లు దండుకోవాలని పన్నాగం పన్నారు. ఈ క్రమంలోనే అనంతపురం నుంచి కదిరికి డబ్బు తరలిస్తుండగా..పోలీసు తనిఖీల్లో పట్టుబడింది. నగదు తరలింపు వ్యవహారాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. నగదు లభించిన ఏపీ 39 ఆర్‌క్యూ 0999 నంబరు ఫార్చూనర్‌ కారు కందికుంట ప్రసాద్‌ పేరుతోనే రిజిస్టర్‌ అయింది. 

దీంతో ఎన్నికల సంఘం కందికుంటకు నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అనంతపురం పోలీసులు ఆయనకు నోటీ­సు­లు ఇవ్వనున్నారు. నగదు తరలించడానికి కారణాలేమిటి? తదితర అంశాలను ప్రస్తావిస్తూ కందికుంటకు నోటీసులు జారీచేసి వివరణ తీసుకోనున్నారు.  

బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి అనంతపురానికి కందికుంట వాహనంలోనే రాంబాబు రాక  
డబ్బు తరలింపు వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన కందికుంట ప్రధాన అనుచరుడు రాంబాబు కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కందికుంట ఫార్చూనర్‌ కారు సోమవారం కదిరి నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వెళ్లి.. అక్కడ రాంబాబును ఎక్కించుకుని అనంతపురం వచ్చింది. రాంబాబు సోమవారం రాత్రి నగరంలోని ఓ త్రీస్టార్‌ హోటల్‌లో బసచేశారు. 

మంగళవారం ఉదయం రాంబాబును అదే ఫార్చునర్‌ కారులో తీసుకెళ్లి రాంనగర్‌లో వదలి పెట్టారు. తర్వాత కందికుంట వాహన డ్రైవర్‌ ఆనంద్‌కుమార్‌ రాంనగర్‌లోని ఒక ఇంటికి వెళ్లి, అప్పటికే బ్యాగుల్లో ఉంచిన నగదును కారులో పెట్టుకున్నాడు. ముందు ఒక కారు (పైలట్‌ వాహనం), వెనుక కందికుంట ఫార్చునర్‌ కారు వెళ్లేలా ప్రణాళిక రచించుకున్నారు. అనంతపురంలోని విద్యుత్‌నగర్‌ సర్కిల్‌కు వెళ్లాక ముందు ఉన్న కారులో పోలీసులు తనిఖీ చేశారు.

 వెనుక ఉన్న కందికుంట కారు డ్రైవర్‌ పోలీసులను చూసి భయపడి కారులో ఉన్న నగదు బ్యాగులు పోలీసులకు అప్పగించాడు. దీంతో పోలీసులు ఆ కారు రిజి్రస్టేషన్‌ వివరాలు పరిశీలించగా అది కందికుంటదని తేలింది. అప్పటికే ముందున్న కారులోని వ్యక్తులు వేగంగా వెళ్లిపోయారు. ఆ కారులో వెళ్లింది ఎవరన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు. ఈ నగదు తరలింపు వ్యవహారంలో కందికుంట అనుచరుడు రాంబాబుతో పాటు మరోవ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది.

ఆదాయపన్ను అధికారుల విచారణ ప్రారంభం 
పోలీసుల తనిఖీల్లో రూ.10 లక్షల కంటే ఎక్కువగా నగదు పట్టుబడితే ఆదాయపన్ను విభాగానికి సమాచారం అందించాల్సి ఉంటుంది. దీంతో పోలీసులు దాదాపు రూ.2 కోట్ల నగదు పట్టుబడిన విషయాన్ని ఆదాయపన్ను శాఖకు తెలిపారు. ఆ శాఖ అధికారులు కూడా విచారణ ప్రారంభించారు. నగదుకు సంబంధించిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. వారి విచారణ పూర్తయిన తరువాత చట్టపరంగా చర్యలు తీసుకోనున్నారు.

 ఏది ఏమైనా కందికుంట వెంకటప్రసాద్‌ చుట్టూ రూ.2 కోట్ల ఉచ్చు బిగుస్తోందని విశ్లేషకులు అంటున్నారు. కందికుంటకు అసలే నియోజకవర్గంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన కారులోనే డబ్బు పట్టుబడింది. దీంతో ఆయన ఎన్నికల సంఘంతో పాటు పోలీసులు, ఆదాయపన్ను అధికారులకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ పరిణామాలతో కందికుంట ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సొంత టీడీపీ వారు చెబుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement