సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు అర్బన్ తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. భవిష్యత్ గ్యారంటీ బస్ యాత్ర సాక్షిగా తెలుగుతమ్ముళ్లు రోడ్డెక్కారు. తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి నసీర్ అహ్మద్ వైఖరిని పలువురు ఎత్తి చూపి నిలదీయడంతో యాత్ర మొత్తం రసాభాసగా సాగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరిగిన టీడీపీ భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్యరథ యాత్రలో మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, పార్టీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్, నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, తూర్పు ఇన్‌చార్జి నసీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
తొలుత కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద అమ్మవారికి పూజలు చేసి, బస్సు యాత్ర ప్రారంభించారు. యాత్ర జిన్నా టవర్ సెంటర్‌కు వచ్చేసరికి ‘వన్‌టౌన్ టైగర్ నసీర్ అహ్మద్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్’ అంటూ ఆయన వర్గం ప్లకార్డులు పట్టుకోవడంతో మిగిలిన వారు విభేదించారు. ఇది సొంత యాత్ర కాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. చందనా బ్రదర్స్ సెంటర్‌కు చేరుకునే సరికి పార్టీలోని ఇంకో వర్గం ర్యాలీగా రావడంతో వారిని నసీర్ అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించేశారు.
బస్‌యాత్ర కోసం తెలుగుదేశం పార్టీ తయారు చేసిన పాటలను కాకుండా సొంత డీజేలో తమ పాటలు పెట్టుకుని యాత్ర నడిపించడం పట్ల కార్యక్రమానికి హాజరైన సీనియర్ నేతలు అభ్యంతరం చెప్పారు. అనంతరం రామయ్య కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసిన వర్తకుల సమావేశం ఫ్లెక్సీలలో పార్టీ జిల్లా, నగర అధ్యక్షుల ఫోటోలు వేయకపోవడంపై డేగల ప్రభాకర్ అభ్యంతరం చెప్పారు. దీనిపై నసీర్ అహ్మద్ వాగ్వాదానికి దిగారు. ఇద్దరూ కొట్టుకునే వరకూ పరిస్థితి వెళ్లింది. నసీర్ వ్యవహార శైలిపై పార్టీ సీనియర్లు, దాసరి రాజా మాస్టర్ కూడా ఆగ్రహంతో పార్టీ సిద్ధాంతాలు తెలియవా అంటూ గొడవకు దిగారు. దీంతో కార్యక్రమం రసాభాసగా ముగిసింది.
సీనియర్ల గుర్రు
సాయంత్రం పర్యటనలోనూ బస్‌కు ముందు ఓపెన్ టాప్ జీప్ ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి జరుగుతున్న వ్యవహారంతో విసిగిపోయిన తెలుగుదేశం సీనియర్లు ఓపెన్ టాప్ జీప్ ఎక్కడానికి ఇష్టపడలేదు. ఆలపాటి రాజా మాత్రమే ఓపెన్‌టాప్ జీప్ ఎక్కగా మిగిలినవారు బస్‌లోనే ఉండిపోయారు. ఈ వ్యవహారంపై పార్టీ రాష్ట్ర కార్యాలయానికి కూడా ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment