రామాంజనేయులు, జనసేన నాయకులను నిలదీస్తున్న సీఆర్ కాలనీ ప్రజలు
గుంటూరు రూరల్: ఓటు అడిగేందుకు ఏ హక్కుతో వచ్చారు.. గతంలో 14 ఏళ్లు అధికారం ఇస్తే సీఆర్ కాలనీకి ఏం చేశారని స్థానిక ప్రజలు టీడీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి రామాంజనేయులును నిలదీశారు. కాలనీలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన టీడీపీ, జనసేన నాయకులపై స్థానిక ప్రజలు మండిపడ్డారు. కాలనీలో కనీసం ఎటువంటి సౌకర్యాలు కల్పించలేక పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు సైతం తమను పట్టించుకోలేదని, నేడు ఎన్నికలు రాగానే ఓట్లు అడిగేందుకు వచ్చారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో కాలనీ ఏర్పడిందని, అప్పుడు ఎన్నోసార్లు రోడ్లు, తాగునీరు, రేషన్, అంగన్‌వాడీ కేంద్రాలు కావాలని అడిగినా పట్టించుకోలేదని మండిపడ్డారు.
నేడు కార్పొరేషన్‌లో విలీనం తరువాత కనీసం రోడ్లయినా ఏర్పడ్డాయని, టీడీపీ హయాంలో ఒరిగిందేమి లేదని తేల్చి చెప్పారు. నేడు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు వస్తున్నాయని అభ్యర్థికి తెలిపారు. అసలు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పకుండా ఓట్లు అడిగేందుకు ఎలా వస్తారని ? ప్రశ్నించారు. దీంతో స్థానిక టీడీపీ, జనసేన నాయకులు ప్రజలకు నచ్చజెప్పారు. అనంతరం అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. రూరల్ మండలంలో ప్రతి గ్రామంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగులుతూనే ఉందని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment