సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెనాలి నుంచి మాజీమంత్రి ఆలపాటి రాజా ప్రస్థానం ముగిసినట్లేనా? రాబోయే శాసనసభ ఎన్నికల్లో తెనాలి నుంచి జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను గెలిపించాలంటూ తెనాలి కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రకటించడం ఈ చర్చకు దారి తీసింది. ఇంకా పొత్తులు సంగతి ఖరారు కాకుండానే ఏకపక్షంగా జనసేన తమ అభ్యర్థిని ప్రకటించడం పట్ల తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమకు బలమైన సీటులో అభ్యర్థిని ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారంటూ వారు మండిపడుతున్నారు. మరోవైపు నీ పని నీదేనని ఆలపాటికి టీడీపీ అధినేత చంద్రబాబు ఇదివరకే భరోసా ఇచ్చారనేది విశ్వసనీయ సమాచారం.
గుంటూరు పశ్చిమంపై దృష్టి!
గతంలో పొన్నూరు, తెనాలి, బాపట్ల, చీరాలలో చంద్రబాబు పర్యటనను ఖరారు చేశారు. తీరా ఒకరోజు ముందు తెనాలి పర్యటనను రద్దుచేసుకుని చంద్రబాబు నేరుగా బాపట్లకు వెళ్లారు. అక్కడ టీడీపీ అభ్యర్థిని ప్రకటించారు కూడా. తెనాలి అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకోకపోవటం, పొత్తులపై అనధికారంగా చేతులు కలిపినందున మనోహర్ కోసం తెనాలి సీటు వదులుకోవటానికి సిద్ధపడటం వంటి కారణాలతో తెనాలి పట్టణంలో పర్యటనను చంద్రబాబు రద్దుచేసుకున్నారని అప్పట్లో చెప్పుకున్నారు.
అప్పటి నుంచే ఆలపాటి రాజా భవితవ్యం చర్చనీయాంశంగా మారింది. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనతో ఈ విషయం స్పష్టం అవుతోంది. తెనాలి సీటు విషయంలో అనుమానాలు ఉండటంతోనే ఆలపాటి రాజా గుంటూరు పశ్చిమంపైనా దృష్టి పెట్టారు. అయితే ఆలపాటి రాజాను ఎంపీగా పంపుతారంటూ ఒక ప్రచారం జరుగుతోంది. చివరి నిముషంలో ఆలపాటి రాజాకు చంద్రబాబునాయుడు మొండిచెయ్యి చూపిస్తారంటూ తెలుగుదేశం శ్రేణులు గుసగుసలాడుతున్నాయి.
మనోహర్‌కు గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లు
గతంలో రెండుసార్లు తెనాలి నుంచి గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్పీకర్‌గా కూడా పనిచేసిన నాదెండ్ల మనోహర్ 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కేవలం 15 వేల ఓట్లు, 2019లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి 29 వేల ఓట్లు పొందారు. 2014లో గెలిచిన ఆలపాటి రాజా, 2019లో 76 వేల ఓట్లు సంపాదించారు. తెనాలిలో బలంగా ఉన్న ఆలపాటి రాజాకు పొత్తుల రూపంలో రాజకీయ ప్రస్థానానికి ఎండ్‌కార్డు పడుతుందా అన్న చర్చ తెలుగుదేశంలో జరుగుతోంది.
వాస్తవానికి ఏ ఎన్నికలకు అప్పటి పరిస్థితుల ప్రకారం నిర్ణయం తీసుకోవటం చంద్రబాబుకు అలవాటు. పార్టీకి విధేయత వంటివి ఆయన పట్టించుకోరు. వాడుకుని వదిలేయటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తెనాలి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థుల విషయాన్ని పరిశీలించినా ఈ విషయం తెలిసిపోతుంది. 1994 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ రావి రవీంద్రనాథ్‌ను పార్టీలో చేర్చుకుని, ఆ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఎమ్మెల్యేగా ఒక టర్మ్ పూర్తిచేసుకున్న డాక్టర్ రవీంద్రనాథ్‌కు 1999 ఎన్నికల్లో రెండోసారి టికెట్ ఇవ్వకుండా చంద్రబాబు మొండిచెయ్యి చూపారు.
కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి చెందిన వైద్యురాలు డాక్టర్ గోగినేని ఉమకు అభ్యర్థిత్వం కట్టబెట్టారు. ఆ ఎన్నికల్లో గెలిచిన డాక్టర్ ఉమ, 2004లో మళ్లీ టీడీపీ తరఫున పోటీచేసి ఓటమి చెందారు. ఆ తర్వాత 2009 ఎన్నికలకు వేమూరు ఎస్సీలకు రిజర్వుడు కావటంతో ఆ నియోజకవర్గానికి చెందిన ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను తెనాలి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిపారు.
డాక్టర్ ఉమను కొనసాగించలేదు. అయినా ఆ ఎన్నికల్లో ఆలపాటి ఓటమి పాలయ్యారు. 2014లోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆలపాటి రాజా ఎమ్మెల్యేగా గెలుపొందారు. మళ్లీ 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ చేతిలో ఓడిపోయారు. తెనాలి నుంచి మూడుసార్లు పోటీచేసి ఒకసారి గెలిచిన ఆలపాటికి మరోసారి చంద్రబాబు సీటు ఇస్తారనేది డౌటేనని అంటున్నారు. అయితే ఏకపక్షంగా జనసేన అభ్యర్థిని ప్రకటించడంతో భవిష్యత్ కార్యాచరణపై తెలుగుదేశం శ్రేణులు చర్చించుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment